Homeఆదాబ్ ప్రత్యేకంSri Vasishta Junior College | అనుమతులు రెండే.. క్యాంపస్‌లు పది..!

Sri Vasishta Junior College | అనుమతులు రెండే.. క్యాంపస్‌లు పది..!

మియాపూర్ శ్రీ వశిష్ట కార్పొరేట్ కాలేజీ మాయాజాలం?

  • సెట్‌బ్యాక్ లేకుండా ఇరుకైన భవనాల్లో క్లాసులు
  • విద్యార్థుల భవిష్యత్తుతో చెలగాటం ఆడుతున్న వైనం..
  • మియాపూర్ పరిధిలో పలు క్యాంపస్‌లపై ఆరోపణలు..
  • ప్రత్యేక కోర్సుల పేరుతో లక్షల రూపాయల వసూళ్లు..?
  • తల్లిదండ్రులపై భారీ భారం.. బోర్డు అధికారుల మౌనం..?
  • ఎలాంటి రక్షణ చర్యలు తీసుకోకుండా కాలేజీల నిర్వహణ..
  • ప్రభుత్వ యంత్రాంగం స్పందించాలని పేరెంట్స్ విజ్ఞప్తి

అక్కడ తమ పిల్లలకు సరైన సదుపాయాలు ఉన్నాయా..? అలాగే కాలేజీ నిర్వహిస్తున్న బిల్డింగులు సురక్షితమా..? అన్న విషయాలను పట్టించుకోవడం లేదు.. పక్కింటి పిల్లలో, తెలిసినవారి పిల్లలో కార్పొరేట్ కాలేజీల్లో చదువుతున్నారు.. తాము కూడా తమ పిల్లలను అక్కడే చదివించాలి.. అన్న ఫాల్స్ ప్రిస్టేజీకి పోతున్నారు.. కానీ పిల్లలు ఎంత మానసిక వ్యథను అనుభవిస్తున్నారో ఆలోచించలేకపోతున్నారు..

- Advertisement -
Miyapur Sri Vasishta Junior College Unauthorized Campuses1

పాపం అక్కడ చదువుతున్న పిల్లలు అటు కాలేజీలో ఎదురుచెప్పలేక, ఇటు తల్లి దండ్రులకు వాస్తవాలు చెప్పుకోలేక మనోవ్యథకు గురైపోతూ చివరకు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు.. ఇలాంటి దారుణ ఘటనలు ఎన్నెన్నో చూసాం.. ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం.. కానీ పేరెంట్స్ లో మార్పు రావడం లేదు.. ఇదంతా ఒక ఎత్తు అయితే.. కొంతమంది విద్యాశాఖ అధికారులు.. అక్రమ సంపాదనకు మరిగి, నడుస్తున్న కాలేజీలకు సరైన పర్మిషన్లు ఉన్నాయా..?

ఆ కాలేజీ సురక్షిత వాతావరణంలో నడుస్తోందా..? ఒక్క పర్మిషన్ తో ఎన్ని కాలేజీలు నడుస్తున్నాయి..? కాలేజీ యాజమాన్యం ఎంతెంత ఫీజులు వసూలు చేస్తున్నారు..? కాలేజీల్లో నిర్వహిస్తున్న హాస్టళ్ల పరిస్థితి ఏమిటి..? స్టడీ అవర్స్ పేరుతో పిల్లలకు ఎలాంటి నరకం చూపిస్తున్నారు..? అన్న విషయాలు పట్టించుకోవడం మానేశారు.. అలాంటి కాలేజీలను మూసి వేయాలన్న సోయి లేకుండా విధులు నిర్వహిస్తున్నారు.. ఈ పరిస్థితుల్లో మార్పు వస్తే తప్ప.. పిల్లల భవిష్యత్తు బంగారుమయం అవుతుంది..

Miyapur Sri Vasishta Junior College Unauthorized Campuses2

ఇంటర్మీడియట్ అడ్మిషన్ల సీజన్ మొదలైందంటే చాలు.. రంగురంగుల బ్రోచర్లు, భారీ హోర్డింగ్‌లు, స్టేట్ ర్యాంకుల హోరుతో విద్యాసంస్థలు విద్యార్థుల తల్లిదండ్రులను ఉక్కిరిబిక్కిరి చేస్తాయి. కానీ, ఆ మెరుపుల వెనుక ఉన్న చేదు నిజాలను గ్రహించకపోతే మీ పిల్లల భవిష్యత్తు మాత్రమే కాదు, వారి ప్రాణాలు కూడా పణంగా పెట్టాల్సి వస్తుందని విద్యా నిపుణులు హెచ్చరిస్తున్నారు.

మియాపూర్ ‘శ్రీ వశిష్ట’ వివాదం :
అనుమతులు రెండింటికే.. నడుస్తున్నవి పది :

మియాపూర్‌లోని మాతృశ్రీ నగర్ పరిసరాల్లో జరుగుతున్న వ్యవహారం ఇప్పుడు సంచలనంగా మారింది. “శ్రీ వశిష్ట జూనియర్ కాలేజీ” పేరుతో దాదాపు 10 క్యాంపస్‌లు నిర్వహిస్తుండగా, అధికారికంగా ఇంటర్ బోర్డు అనుమతి కేవలం రెండు క్యాంపస్‌లకు మాత్రమే ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం.అయితే ఇక్కడొక ప్రశ్న ఉద్భవిస్తోంది..

Miyapur Sri Vasishta Junior College Unauthorized Campuses3

అనుమతి లేని మిగతా క్యాంపస్‌లలో చదివే విద్యార్థుల పరిస్థితి ఏమిటి? రేపు హాల్ టికెట్లు రాకపోయినా, సర్టిఫికేట్ల విషయంలో ఇబ్బందులు ఎదురైతే బాధ్యులెవరు? దీనికి ఎవరు సమాధానం చెబుతారు.. నిబంధనలకు విరుద్ధంగా ఇన్ని అక్రమ క్యాంపస్‌లు వెలుస్తుంటే ఇంటర్ బోర్డు అధికారులు ఎందుకు మౌనంగా ఉన్నారు? అన్నది కూడా అంతుబట్టని విషయంగా మారింది.. కేవలం అక్రమ అనుమతులే కాదు, భవన నిర్మాణాల్లో కనీస భద్రతా ప్రమాణాలు లేకపోవడం అత్యంత ఆందోళనకరమైన విషయం.

  • సెట్ బ్యాక్ లు లేని భవనాలు :

అత్యవసర సమయాల్లో విద్యార్థులు బయటకు రావడానికి కనీస స్థలం కూడా లేని ఇరుకైన భవనాల్లో క్లాసులు నిర్వహిస్తున్నారు.

Miyapur Sri Vasishta Junior College Unauthorized Campuses4
  • సామర్థ్యానికి మించి అడ్మిషన్లు :

వంద మంది పట్టే చోట ఐదు వందల మందిని కుక్కుతూ, గాలి కూడా ఆడని గదుల్లో విద్యార్థులను బంధిస్తు న్నారు. అదే భవనాల్లో హాస్టల్ సౌకర్యాలు కల్పిస్తూ, విద్యార్థుల ఆరోగ్యం, భద్రతను గాలికొదిలేస్తున్నారు.

  • ఫీజుల దోపిడీ :

నీట్, ఐఐటి, ఎంసెట్ కోచింగ్ పేరుతో తల్లిదండ్రులపై లక్షల రూపాయల భారం మోపుతున్నారు. ‘ఇంటిగ్రేటెడ్ కోర్సు’ అనే అందమైన పేరుతో మధ్యతరగతి కుటుంబాల రక్తాన్ని పిండుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. విద్యాసంస్థలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలుగా కాకుండా, కేవలం లాభాలే ధ్యేయంగా సాగే కార్పొరేట్ అడ్డాలుగా మారిపోతున్నాయి.

  • తల్లిదండ్రులకు ఒక విజ్ఞప్తి :

అడ్మిషన్ తీసుకునే ముందు ఖచ్చితంగా ఈ విషయాలు తనిఖీ చేయండి.. మీరు కష్టపడి సంపాదించిన డబ్బును, మీ బిడ్డ బంగారు భవిష్యత్తును కాలేజీలకు అప్పగించే ముందు ఈ 4 ప్రశ్నలు కాలేజీ యాజమాన్యాన్ని అడగండి..

Miyapur Sri Vasishta Junior College Unauthorized Campuses5
  • అఫిలియేషన్ లెటర్ :

మీరు అడ్మిషన్ తీసుకుంటున్న ‘నిర్దిష్ట క్యాంపస’కు ఇంటర్ బోర్డు అనుమతి పత్రం ఉందా? లేదా,..? కాలేజీ పేరు ఒకటే అయినా క్యాంపస్ కోడ్ వేరుగా ఉంటుంది, ఇది తప్పక గమనించండి.

  • ఫైర్ సేఫ్టీ సర్టిఫికేట్ :

అగ్నిమాపక శాఖ నుండి అనుమతి ఉందా? అత్యవసర ద్వారాలు ఉన్నాయా?

  • భవన అనుమతి :

ఆ భవనం విద్యాసంస్థల నిర్వహణకు సంబంధిత అధికారులు ఇచ్చిన అనుమతి పత్రం ఉందా?

  • సదుపాయాలు :

ల్యాబ్స్, లైబ్రరీ, కనీస ఆటస్థలం ఉన్నాయా లేదా స్వయంగా పరిశీలించండి.

ప్రభుత్వ యంత్రాంగం, ఇంటర్మీడియట్ బోర్డు తక్షణమే స్పందించి మియాపూర్ పరిధిలోని అక్రమ క్యాంపస్‌లపై కఠిన చర్యలు తీసుకోవాలి. విద్యార్థుల ప్రాణాలతో, భవిష్యత్తుతో ఆడుకునే హక్కు ఏ యాజమాన్యానికీ లేదని విశ్లేషకులు సూచిస్తున్నారు.. కొన్ని కాలేజీల యాజమాన్యాలు తమకున్న అంగబలం, అర్ధబలం, రాజకీయ పలుకుబడితో.. కొందరు అవినీతి అధికారులను కొనేసి, కాలేజీలను నిర్వహిస్తున్నారు.. ఇలాంటి కాలేజీలను ఏరిపారేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

- Advertisement -
RELATED ARTICLES

Latest News