- ఎమ్మెల్యే పద్మారావు గౌడ్
- అడ్డగుట్టలో రూ.2.65 కోట్ల అభివృద్ధి పనులు ప్రారంభం
అడ్డగుట్ట సర్వతోముఖాభివృద్ధిని లక్ష్యంగా పెట్టుకొని గత పదేళ్లలో ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి పనులు చేపట్టి అడ్డగుట్టను ఆదర్శ ప్రాంతంగా తీర్చిదిద్దామని సికింద్రాబాద్ శాసనసభ్యులు,మాజీ డిప్యూటీ స్పీకర్ తీగుళ్ల పద్మారావు గౌడ్ తెలిపారు.గురువారం అడ్డగుట్ట మున్సిపల్ డివిజన్ పరిధిలో విస్తృతంగా పర్యటించిన ఆయన దాదాపు రూ.2.65 కోట్ల వ్యయంతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులను అడ్డగుట్ట స్థానిక కార్పొరేటర్ లింగాన్ని ప్రసన్నలక్ష్మితో కలిసి అభివృద్ధి పనులను ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ,గత 50 సంవత్సరాల్లో చేయని పనులను గత పదేళ్లలో సికింద్రాబాద్ నియోజకవర్గంలో పూర్తి చేశామని చెప్పారు.తుకారాం గేట్ ఆర్‌యూబీ,మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్,ఆసుపత్రి నిర్మాణం వంటి కీలక ప్రాజెక్టులు తమ హయాంలోనే ప్రారంభమయ్యాయని తెలిపారు.భవిష్యత్తులో కూడా నియోజకవర్గంలోని ఎనిమిది కొత్త డివిజన్ల అభివృద్ధిపై నిరంతరం దృష్టి సారిస్తామని స్పష్టం చేశారు.

అడ్డగుట్ట కార్పొరేటర్ లింగాని ప్రసన్న లక్ష్మీ శ్రీనివాస్ మాట్లాడుతూ స్థానిక అభివృద్ధిలో ఎమ్మెల్యే పద్మారావు గౌడ్ పాత్ర ప్రశంసనీయమని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు సామాల హేమ,కంది శైలజ,అధికారులు,ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.రూ.145 లక్షలతో మల్టీ పర్పస్ ఫంక్షన్ హాల్ అదనపు భవనం,రూ.118 లక్షలతో సీసీ రోడ్డు,బీ సెక్షన్‌లో మెట్ల నిర్మాణ పనులు ప్రారంభించారు.
