Sunday, March 1, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంTelangana | పాలకులు చట్టానికి లోబడి ఉండాలి..!

Telangana | పాలకులు చట్టానికి లోబడి ఉండాలి..!

  • ఇక్కడ చట్టమే పాలకులకు చుట్టమైంది..
  • ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు..
  • చట్ట పాలన చట్టబండలు.. అధికారానిదే హవా..
  • చట్టాలపై ప్రజలకు నమ్మకం పోతోంది..
  • ప్రజాస్వామ్యం చిరునామా గల్లంతవుతోంది..
  • ‘న్యాయం దక్కదు’ అనే భావన పెరుగుతోంది..
  • వ్యవస్థలపై ప్రజల విశ్వాసం సన్నగిల్లుతోంది..

చట్టం కళ్లకు గంతలు కట్టుకుంటే, ప్రజాస్వామ్యం అంధకారంలోకి జారిపోతుంది. పుస్తకాలలో అందరికీ సమానంగా కనిపించే చట్టం, వాస్తవంలో చూసేసరికి అధికారం ఎదుట మూగబోతోంది.. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ నుంచి కాళేశ్వరం వరకు వెలుగులోకి వచ్చిన అనేక ఘటనలు.. ఈ రాష్ట్రంలో చట్టబద్దమైన పాలన ఉందా? లేక అధికార దురహంకారం నడుస్తోందా? అన్న ప్రశ్నలను ప్రజల ముందుకు తెస్తున్నాయి.

చట్టాలపై ప్రజలకు నమ్మకం పోయిన రోజున ప్రజాస్వామ్యం కుదేలవుతుంది. ‘న్యాయం దక్కదు’ అనే భావన ప్రజల్లో పెరిగితే, ప్రజలు వ్యవస్థపై విశ్వాసం కోల్పోతారు. అది అసంతృప్తికి, ఆగ్రహానికి, చివరికి అశాంతికి దారితీస్తుంది. ప్రజా ప్రతినిధులు చట్టానికి అతీతులు అన్న భావన బలపడితే, అది రాజ్యాంగానికి చేసిన అవమానం. అధికారం అనేది ప్రజలు ఇచ్చింది.. ఆ అధికారంతోనే ప్రజలను అణచివేయడం అత్యంత ప్రమాదకరమైన పరిణామం.

- Advertisement -

చట్టాలు పుస్తకాలలో అందరికీ సమానంగా కనిపిస్తాయి. కానీ వాస్తవానికి వచ్చేసరికి అధికారం ఎదుట చట్టం మౌనమవుతున్న దృశ్యమే ఎక్కువగా దర్శనమిస్తోంది. తెలంగాణ రాజకీయాల నడుమ ఇటీవల వెలుగులోకి వచ్చిన ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరం ప్రాజెక్టు, కార్ రేస్ వ్యవహారాలు.. ఈ కఠిన నిజానికి నిలువెత్తు నిదర్శనాలుగా ప్రజాస్వామ్యాన్ని వెక్కిరిస్తున్నాయి. నిజానికి ప్రజాస్వామ్యంలో పాలకులు చట్టానికి లోబడి ఉండాలి. కానీ ఇక్కడ చట్టమే పాలకుల చుట్టూ తిరుగుతున్నట్టుగా కనిపిస్తోంది.

ఫోన్ ట్యాపింగ్,ప్రజాస్వామ్యంపై నిఘా నీడ :

ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛను రక్షించాల్సిన రాజ్యాంగం, వారి ఫోన్లపై అక్రమంగా నిఘా పెట్టబడిందన్న ఆరోపణలతో కంపించింది. రాజకీయ ప్రత్యర్థులు, మీడియా ప్రతినిధులు, వ్యాపారవేత్తల ఫోన్లు ట్యాప్ చేశారన్న ఆరోపణలు దేశవ్యాప్తంగా చర్చకు దారి తీశాయి. ఇది కేవలం ఒక కేసు కాదు.. ప్రజాస్వామ్యంపై జరిగిన దాడి. ఈ వ్యవహారంలో కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు పేర్లు ప్రస్తావనకు రావడం రాజకీయంగా ఎంత సంచలనమో, చట్టపరంగా అంతే తీవ్రమైన విషయం. కానీ విచారణ వేగం చూస్తే సామాన్యుడికి ఒక్కటే అనుమానం.. కలుగుతోంది..ఇంత పెద్ద ఆరోపణలున్నా ఎందుకు స్పష్టత రావడం లేదు..? ఎందుకు సమాధానాలు దొరకడం లేదు..? ఒక సాధారణ వ్యక్తి ఫోన్ ట్యాపింగ్ చేస్తే క్షణాల్లో అరెస్ట్. అదే ఆరోపణ అధికారం ఉన్నవారిపై వస్తే… దర్యాప్తే దారి తప్పుతోందన్న అనుమానాలు ఎందుకు కలుగుతున్నాయి..?

కాళేశ్వరం, అభివృద్ధి పేరుతో బాధ్యతల మాయం :

దేశంలోనే అతి పెద్ద ఎత్తున చేపట్టిన కాళేశ్వరం ప్రాజెక్టు, ఇప్పుడు ఆర్థిక భారం, సాంకేతిక లోపాలు, అవినీతి ఆరోపణల కేంద్రంగా మారింది. వేల కోట్ల ప్రజాధనం ఖర్చయినా, ప్రాజెక్టు సామర్థ్యంపై అనేక ప్రశ్నలు ..ఇంకా ప్రశ్నలుగానే మిగిలిపోయాయి..నిర్మాణ లోపాలపై నివేదికలు, బ్యారేజీల కుంగింపు, పంపుల సమస్యలు..ఇవన్నీ బయటపడినా బాధ్యత ఎవరిది? నిర్ణయాలు తీసుకున్నవారు ఎవరు? నిధులు ఖర్చు చేసినవారు ఎవరు? ఇక్కడే చట్టం మళ్లీ మౌనంగా మారింది. సామాన్య రైతు చిన్న రుణం కట్టకపోతే నోటీసులు వస్తాయి. కానీ వేల కోట్ల వ్యవహారాల్లో తప్పులు జరిగితే… ఫైళ్లు మాత్రమే తిరుగుతున్నాయి కానీ దోషులు దొరకడం లేదు..?

ఈ కార్ రేస్ వ్యవహారం : చట్టానికి వేగం తగ్గిందా..?

నగరంలో జరిగిన ఈ కార్ రేస్ వ్యవహారం మరో ఉదాహరణ. అనుమతులు, భద్రతా లోపాలు, ప్రజా ఆస్తులకు నష్టం.. ఇన్ని అంశాలు ఉన్నా ఈ కేసు ఎందుకు ముందుకు కదలడం లేదు. సాధారణంగా ఒక యువకుడు రోడ్డుపై రేస్ చేస్తే వెంటనే కేసు. అదే ఘటనలో అధికార వర్గాల ప్రమేయం ఉందన్న ఆరోపణ వస్తే… వ్యవహారం నెమ్మదిస్తుంది. ఇదేనా సమానత్వం..? ఇదేనా చట్ట పాలన..?

- Advertisement -
RELATED ARTICLES

Latest News