- తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం..
- తీర్మానానికి అన్ని పార్టీల మద్దతు..
కర్ణాటక ప్రభుత్వం చేపట్టనున్న మేకెదాటు డ్యామ్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ ఏకగ్రీవ తీర్మానం చేసింది. ఈ మేరకు శుక్రవారం దీనిపై అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టగా అన్ని పార్టీలు డ్యామ్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ, తీర్మానానికి మద్దతు తెలిపాయి. ఈ సందర్భంగా అసెంబ్లీలో సీఎం జోసెఫ్ విజయ్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం ఎటువంటి అనుమతులు ఇవ్వకూడదని కోరారు. అన్ని అనుమతుల్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
డ్యామ్ నిర్మాణానికి అనుకూలంగా కేంద్రం ఎలాంటి పర్యావరణ, సాంకేతిక, పరిపాలనా పరమైన అనుమతులు ఇవ్వకూడదని తీర్మానంలో పేర్కొన్నారు. కావేరి నదిపై ఎలాంటి కొత్త నిర్మాణం చేపట్టకూడదంటూ దీర్ఘకాలికంగా తమిళనాడు అనురిస్తున్న వైఖరికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని విజయ్ స్పష్టం చేశారు. కావేరి నదిపై కర్ణాటక ప్రభుత్వం మేకెదాటు డ్యామ్ నిర్మించేందుకు సిద్ధమవుతోంది.
దీనివల్ల తమకు నష్టం జరుగుతుందని తమిళనాడు వాదిస్తోంది. ఇప్పటికే కావేరి నదీ జలాల విషయంలో తమిళనాడు, కర్ణాటక మధ్య దశాబ్దాలుగా వివాదం నడుస్తోంది. ఈ అంశంపై 2007 ఫిబ్రవరిలో కావేరి వాటర్ డిస్ప్యూట్స్ ట్రిబ్యునల్, 2018లో సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీ చేశాయి.
నదీ జలాల వాడకం, పంపకం విషయంలో రెండు రాష్ట్రాల మధ్య ఒప్పందం కుదురుస్తూ ఆదేశాలిచ్చాయి. ఈ ఆదేశాల ప్రకారమే రెండు రాష్ట్రాలకు సంబంధించి కావేరి నది నుంచి ఎవరి వాటా వాళ్లకు దక్కాలి. అయితే, డ్యామ్ నిర్మాణం వల్ల తమ వాటా తగ్గిపోతుందని తమిళనాడు వాదిస్తోంది. దీనిపై తాజా తీర్మానంలో కీలక అంశాల్ని ప్రస్తావించారు. ఇప్పటికే కావేరి నది నీళ్లలో లోటు కనిపిస్తోందని అసెంబ్లీ పేర్కొంది. నీళ్లు తమిళనాడుకు ఉన్న హక్కు, సహజ వనరు అని, వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత తమపై ఉందని సీఎం విజయ్ అన్నారు.
