- పాలమాకుల జంగయ్య జిల్లా కార్యదర్శి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో ప్రజా సమస్యలపై రాజీలేని పోరాటాలు చేసే వామపక్షాలు, లౌకిక పార్టీలతో కలిసి భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) పోటీ చేస్తుందని ఆ పార్టీ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి పాలమాకుల జంగయ్య ప్రకటించారు. గురువారం చేవెళ్లలోని పార్టీ కార్యాలయంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు, నియోజకవర్గ ఇన్చార్జి కే. రామస్వామి అధ్యక్షతన ముఖ్య నాయకుల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన జంగయ్య ఎన్నికల కార్యాచరణను వెల్లడించారు. వార్డుల వారీగా పోటీ వివరించారు.
మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా జిల్లాలోని పలు మున్సిపాలిటీల్లో సీపీఐ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. చేవెళ్ల మున్సిపాలిటీ నాలుగు వార్డులు, మొయినాబాద్ మున్సిపాలిటీ మూడు వార్డులు, శంకర్పల్లి మున్సిపాలిటీ మూడు వార్డులు, ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ రెండు వార్డులు అనంతరం వారు మాట్లాడుతూ.. నిరంతరం ప్రజా పోరాటాల్లో, కార్మిక సమస్యల పరిష్కారంలో ముందుండే సీపీఐకి ప్రజల ఆశీస్సులు మెండుగా ఉన్నాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజా పోరాటాలే పార్టీకి అసలైన బలమని, మున్సిపల్ ఎన్నికల్లో లౌకిక శక్తుల ఐక్యతతో విజయం సాధిస్తామని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో ఏఐకేఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం. ప్రభులింగం, జిల్లా కార్యవర్గ సభ్యుడు వడ్ల సత్యనారాయణ, చేవెళ్ల మండల కార్యదర్శి ఎం. సత్తిరెడ్డి, శంకర్పల్లి మండల కార్యదర్శి సుధీర్, ఇన్సాఫ్ జిల్లా అధ్యక్షుడు ఎండి. మక్బూల్, బి.కె.ఎం.యు జిల్లా అధ్యక్షుడు జె. అంజయ్య, సీనియర్ నాయకులు డాక్టర్ శౌరీలు, శివ, పాపయ్య, పెంటయ్య తదితరులు పాల్గొన్నారు.
