- 230 మంది సభ్యులతో రాష్ట్ర, జిల్లా కమిటీల నియామకం..
- బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నియామక పత్రాల ప్రదాన కార్యక్రమం..
తెలంగాణ బీజేపీ ఎండోమెంట్ (ధార్మిక) సెల్ నూతన రాష్ట్ర, జిల్లా కమిటీల సమావేశం గురువారం రోజు హైదరాబాద్‌లోని బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించబడింది. ఈ సందర్భంగా నూతనంగా నియమితులైన రాష్ట్ర, జిల్లా కమిటీ సభ్యులకు నియామక పత్రాలను అందజేశారు.
ఈ కార్యక్రమానికి తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్సీ ఎన్. రామచంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై నియామక పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎన్.వి. సుభాష్ (రాష్ట్ర ప్రధాన అధికార ప్రతినిధి), గువ్వల బాలరాజు (మాజీ ఎమ్మెల్యే), రాహుల్ ఎస్, కప్పర ప్రసాద్, సారంగుల అమర్నాథ్, (రాష్ట్ర అధికార ప్రతినిధులు), సూర్యప్రకాశ్ అన్నవజ్ఞాల (రాష్ట్ర కన్వీనర్, ఎండోమెంట్ సెల్), నిరంజన్ దేశాయ్ (రాష్ట్ర కో-కన్వీనర్, ఎండోమెంట్ సెల్) పాల్గొన్నారు.

వీరి సమక్షంలో గౌరవ సలహాదారులు, రాష్ట్ర జాయింట్ కన్వీనర్లు (జిల్లా ఇన్‌చార్జ్‌లు), జిల్లా కన్వీనర్లు, జిల్లా కో-కన్వీనర్లు, జిల్లా జాయింట్ కన్వీనర్లకు నియామక పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ప్రముఖ స్వామీజీలు, విద్యావేత్తలు, మేధావులు, న్యాయవాదులు ధార్మిక సలహాదారులుగా నియమించబడ్డారు. అలాగే సామాజిక సమానత్వానికి ప్రాధాన్యతనిస్తూ విద్యావంతులైన మహిళలు, యోగులు, సన్యాసులకు కూడా కమిటీల్లో స్థానం కల్పించారు. ఈ విధమైన సమగ్ర ప్రతినిధిత్వం పార్టీని సమాజంలోని అన్ని వర్గాలకు మరింత చేరువ చేస్తుందని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్రవ్యాప్తంగా ఏకకాలంలో 230 మంది సభ్యులతో కూడిన కమిటీని నియమించడం విశేష ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ నిర్ణయం ప్రజల్లో ఆసక్తిని రేకెత్తించడమే కాకుండా, దేవాలయాల పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారంలో ఎండోమెంట్ (ధార్మిక) సెల్‌ను మరింత బలోపేతం చేస్తుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ, దేవాలయాల పరిరక్షణ, సనాతన ధర్మ ప్రచారం, అర్చకుల సంక్షేమం లక్ష్యంగా ఎండోమెంట్ (ధార్మిక) సెల్ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న కార్యాచరణను వివరించారు.
