Wednesday, February 11, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంChengicherla | చెంగిచెర్లలో చక్రం తిప్పిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

Chengicherla | చెంగిచెర్లలో చక్రం తిప్పిన నాటి బీఆర్ఎస్ ఎమ్మెల్యే

అక్రమంగా పహానిలో పేరు నమోదు చేసుకొని నకిలీ పట్టా పాసు బుక్కుతో ప్రభుత్వ భూమీ దర్జాగా కబ్జా..

  • ధరణి అయినా భూభారతి అయినా డోంట్‌ కేర్‌ అంటున్నాడు..?
  • అధికారం అడ్డుపెట్టుకొని కబ్జాలు చేయడమే తన వృత్తి..
  • ప్రభుత్వ భూమిలో నోమా నిలయం పేరుతో విల్లాలు
  • ఖాతా నెంబర్లతో బట్టబయలైన ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి వ్యవహారం
  • నకిలీ పాసు బుక్కు ఫోర్జరీ సంతకాలతో కబ్జా..
  • నేటికి పోలీస్‌ స్టేషన్‌లో పిర్యాదు చేయని అధికారులు..
  • కొందరు అధికారులు అమ్ముడుపోయి, కబ్జాదారులకు సహకారం
  • ముత్తిరెడ్డి కబ్జాలపై ఏసీబీ, విజిలెన్స్‌ విచారణ జరపాలి..
  • స్థానికులు, సామాజిక వేత్తల నుండి వెల్లువెత్తుతున్న డిమాండ్స్‌..

‘‘ రాజకీయాల్లో కమిట్‌ మెంట్‌ , సమాజంపై అవగాహన, ప్రజాసేవ చెయ్యాలనే దృక్పధం ఉంటే చాలు.. ఒక మంచి నాయకుడిగా గుర్తింపు పొందవచ్చు.. కానీ కొంతమంది రాజకీయ నాయకులకు ఈ మూడు గుణాలతోబాటు అవినీతి, అరాచకం, అక్రమార్జన లాంటి గుణాలు కూడా ఉంటాయి.. ఇలాంటి వారితో ప్రజలకు, సమాజానికి పెను ప్రమాదం.. అయితే ఇలా రెండు రకాలుగా కాకుండా..

- Advertisement -

మూడో రకం రాజకీయ నాయకులు వుంటారు.. వీరి బుర్ర పాదరసం కన్నా వేగంగా ప్రవహిస్తుంది.. ఇలాంటి కోవలోకే వస్తాడు మాజీ బీ.ఆర్‌.ఎస్‌. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి.. ఈయన స్టైల్‌ సపరేటుగా ఉంటుంది.. ప్రభుత్వ భూమికి ఎసరు పెట్టిన ఈ మాజీ ఎమ్మెల్యే చేసిన ఘనకార్యం ఇప్పుడు మేడ్చల్‌ జిల్లాలో సంచలనంగా మారింది.. దీనికి సంబంధించిన కథా కమావిూషు ఒకసారి చూద్దాం..

మేడ్చల్‌ మల్కాజిగిరి జిల్లా, మేడిపల్లి మండలం, చెంగిచెర్ల గ్రామ శివారు లో సర్వేనెంబర్‌ 33లో ఫారెస్ట్‌ ల్యాండ్‌ తో పాటు ప్రభుత్వ భూమి నెలకొని ఉంది.. ఇట్టి భూమిపై కన్నేసాడు జనగామ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి.. అధికారం అడ్డుపెట్టుకొని స్థానిక వ్యక్తులతో ములఖాత్‌ అయి కబ్జాకు తెర లేపాడు.. సర్వే నెంబర్‌ 33లో ప్రభుత్వ భూమిలో బీఆర్‌ఎస్‌ పార్టీ మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి అక్రమంగా పహానిలో పేరు నమోదు చేసుకున్నట్లు రెవెన్యూ రికార్డులు స్పష్టం చేస్తున్నాయి..

అంతే కాకుండా నాటి ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వంలో పట్టా పాసు బుక్కు ఖాతా నెంబర్‌ 28లో కోట్లు విలువ చేసే మేడిపల్లి మండలం చెంగిచెర్ల గ్రామ శివారు ప్రాంతంలో 37 ఎకరాల 28 గుంటలు చూపిస్తున్నారు.. తనకు ఇష్టమొచ్చినట్లు కోట్ల విలువైన స్థలాలను ఆ దొంగ బుక్కు లో రాసుకొని కబ్జాలు చేస్తున్నాడని ఈ ప్రాంత ప్రజలు ఆరోపిస్తున్నారు.. ఇలా అక్రమంగా సృష్టించిన పట్టా పాసు బుక్కు, నకిలీ పహానీలను అడ్డు పెట్టుకొని ఎకరాలకు ఎకరాలు అమ్ముకుంటూ సొమ్ము చేసుకుంటూ, కోట్లకు పడగలెత్తాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు..

ఇదే విషయమై నాటి రంగారెడ్డి జిల్లా జాయింట్‌ కలెక్టర్‌ రవిచంద్ర కేసు నెంబర్‌ డి5/380/2004 తేది:0502`2005 గా జేసీ కోర్టులో ఇచ్చిన ఆదేశాలే అందుకు నిదర్శనంగా చెప్పచ్చు.. నకిలీ పహానీలను, పట్టా పాసు బుక్కు సృష్టించిన కబ్జాలకు పాల్పడుతున్న వ్యక్తులపై చట్ట ప్రకారం ట్రేస్పాస్‌ కేసు పెట్టీ చర్యలు చేపట్టాలి.. కానీ ఆ దిశగా అధికారులు అడుగులు వేయలేదు..

సదరు సమయంలో పనిచేసిన సంబంధిత రెవెన్యూ అధికారులు విధులు సరిగా నిర్వర్తిస్తే ఈ నకిలీ పహాని,పాసు బుక్కు కు అక్కడే పులిస్టాప్‌ పడేది.. నాడు అధికారుల సంతకాల ఫోర్జరీతో పాటు, రికార్డుల ట్యాంపరింగ్‌ పై స్థానిక పోలీస్‌ స్టేషన్‌ లో పిర్యాదు చేసి ఉంటే ప్రభుత్వ భూమి కబ్జా వ్యవహారం అంతా ఆనాడే బట్టబయలు అయ్యేది..

ప్రభుత్వ భూమిలో నోమా నిలయ పేరుతో దర్జాగా విలాసవంతమైన విల్లాలు నిర్మిస్తున్నారు ఈ కబ్జాదారు.. ఇలా ప్రభుత్వ భూమిలో అక్రమంగా కట్టిన విల్లాలను అమాయక ప్రజలకు అంటకట్టి కోట్లు రూపాయలు కొల్లగొడుతున్నాడనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.. జనగామలో జిల్లాలో బి.ఆర్‌.ఎస్‌. గత ఎమ్మెల్యేగా ఉన్న ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి..

హైదరాబాద్‌ శివారు ప్రాంతం చంగిచర్లలో చక్రం తిప్పడం ఏంటని ముక్కున వేలేసుకుంటున్నారు స్థానిక ప్రజలు..కాసులకు కక్కుర్తి పడి అమ్ముడు పోయిన అధికారులు ముత్తిరెడ్డి కబ్జాలను కట్టడి చేయాల్సింది పోయి, సహాయ సహకారాలు అందించి కబ్జాలకు తెర లేపడం ఏంటని మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు.. ధరణి అయినా భూ భారతి అయినా డోంట్‌ కేర్‌ అంటున్నారు ఈ కబ్జాదారులు..

దొంగతనం చేసే వ్యక్తి ఏదో ఒక్క క్లూ ద్వారా పోలీసులకు చిక్కుతారు అన్నది జగమెరిగిన సత్యం.. అదే తరహాలో భూ కబ్జాలకు పాల్పడుతున్న వీరు.. అక్రమం గా పహానీలు సృష్టించడం, దొంగ పట్టా పాసు బుక్కు తయారు చేయడం, స్టాంపులు తయారు చేయడం, అధికారుల సంతకాలు ఫోర్జరీ చేయడం ముమ్మాటికి నిజమే అనడానికి వీరు పహానిలో రాసుకున్న ఖాతా నెంబర్లు బట్టబయలు చేశాయి.. ఇక్కడే అడ్డంగా దొరికిపోయారు కబ్జాదారులు..

ఇవన్నీ తెలిసినా రెవెన్యూ అధికారులు ఆ వైపు గా చర్యలు చేపట్టకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతోంది.. కబ్జాదారులు వేసే ఎంగిలి మెతుకులకు ఆశపడి కనీస చర్యలు చేపట్టకుండా ఉండటంతో వీరి కబ్జాలు మూడు పువ్వులు ఆరు కాయలు అన్న చందంగా సాఫీగా సాగుతున్నాయి.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి కి ఖాతా నెంబర్‌ లు ఎలా మారాయి.. ముత్తిరెడ్డి యాదగిరి రెడ్డి చూపిస్తున్న ఖాతా మరో కబ్జాదారుడు ఎలా చూపిస్తున్నాడు..

ఈ కబ్జా వ్యవహారం పై అవినీతి నిరోధక శాఖ,విజిలెన్స్‌ విచారణ చేస్తే కళ్ళు బైర్లు కమ్మే నిజాలు బట్టబయలు అవుతాయని పలువురు సామాజికవేత్తలు డిమాండ్‌ చేస్తున్నారు.. అస్సలు రెవెన్యూ చట్టాలు ఏమి చెప్తున్నాయి.. రికార్డులు ఎలా సృష్టిం చారు.. నాటి కీసర ఆర్డీవోగా ఉన్న లచ్చిరెడ్డి ఎలా నాలా కన్వర్షన్‌ సర్టిఫికెట్‌ మ్యానవల్‌ గా ఇచ్చారు..? నేటికి భూ భారతి రికార్డు ఆన్లైన్‌ లో వ్యవసాయ భూమిగా కనపడటంలో మతలబేంటి..? ఎండోమెంట్‌ కమిషనర్‌ ఎలాంటి లేఖలు రాశారు..?

అడివి భూమిని భూభారతి రికార్డులో తగ్గించడంలో ఉన్న మర్మమేంటి? నాటి మేడ్చల్‌ జిల్లా ఎంపీగా ఉన్న సమయంలో ప్రస్తుత తెలం గాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఈ కబ్జా విషయం పై చేసిన పిర్యాదు ఏంటి..?దానిపై అధికారులు ఎందుకు సరిగా విచారణ చేయలేక పోయారు..మేడ్చల్‌ జిల్లా కలెక్టర్‌ స్థాయి నుండి మేడిపల్లి మండల తహశీల్దార్‌ వరకు ఎందుకు మౌనం వహిస్తు న్నారు..? ఇటీవలే ఏసీబీకి ట్రాప్‌ అయిన ఏడీ శ్రీనివాసులు మ్యాప్‌లో చేసిన మాయ మేంటి..? రేరా.. హెచ్‌. ఎం.డి.ఏ అధికారులు అక్రమంగా అనుమతులు ఎలా ఇచ్చారు..?

కళ్లెదుటే వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కబ్జా పై హైడ్రా చర్యలకు ముందడుగు వేయలేదు ఎందుకు అన్న విషయాలకు సంబంధించి.. అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూమి పరిరక్షించే విధంగా.. అక్రమార్కుల పై,కబ్జాకు సహకరించిన అధికారుల పై చర్యలు చేపట్టుటకు పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది

‘‘ఆదాబ్‌ హైదరాబాద్‌’’ ‘‘మా అక్షరం అవినీతి పై అస్త్రం’’..

- Advertisement -
RELATED ARTICLES

Latest News