- నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు
- డీసీపి రామ్ రెడ్డి
రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు,నూతన సంవత్సర వేడుకల నేపథ్యంలో గోదావరిఖని పట్టణంలో సోమవారం పోలీసులు భారీ ‘నాకాబందీ’ (వాహన తనిఖీలు) నిర్వహించారు.పెద్దపల్లి డీసీపి రామ్ రెడ్డి,ఏసీపీ ఎం. రమేష్ స్వయంగా పాల్గొన్న ఈ తనిఖీల్లో సుమారు 100 మంది పోలీస్ సిబ్బంది ఒకేసారి రంగంలోకి దిగి 5 ఇంక్లైన్,విఠల్ నగర్,తిలక్ నగర్ తదితర ప్రాంతాల్లో విస్తృతంగా సోదాలు చేపట్టారు. గంజాయి వంటి మత్తు పదార్థాల అక్రమ రవాణా, దొంగతనాలు,చైన్ స్నాచింగ్‌ల అరికట్టడమే లక్ష్యంగా జరిగిన ఈ తనిఖీల్లో సరైన పత్రాలు లేని 80 ద్విచక్ర వాహనాలు, 6 ఆటోలు,3 కార్లపై కేసులు నమోదు చేసి జరిమానా విధించారు.
ఈ సందర్భంగా డీసీపీ రామ్ రెడ్డి మాట్లాడుతూ.. నూతన సంవత్సర వేడుకల కోసం డీజేలకు ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతి లేదని స్పష్టం చేశారు. డిసెంబర్ 31 రాత్రి 10 గంటల తర్వాత భారీస్థాయిలో ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు నిర్వహిస్తామని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.యువత తాత్కాలిక ఆనందాల కోసం రోడ్లపైకి వచ్చి ఇతరులను ఇబ్బంది పెడుతూ తమ బంగారు భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని సూచించారు. వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇళ్లలోనే ప్రశాంతంగా జరుపుకోవాలని,అక్రమాలకు పాల్పడే వారిపై పోలీసుల నిఘా నిరంతరం ఉంటుందని ఆయన విజ్ఞప్తి చేశారు.ఈ తనిఖీల కార్యక్రమంలో వన్ టౌన్ సీఐలు ఇంద్రసేన రెడ్డి,రవీందర్, ఎస్సైలు,సిబ్బంది పాల్గొన్నారు.
