Homeఆదాబ్ ప్రత్యేకంYadadri Bhuvanagiri | ‘యాదాద్రి భువనగిరి' ప్రజలారా.. మేల్కొనండి

Yadadri Bhuvanagiri | ‘యాదాద్రి భువనగిరి’ ప్రజలారా.. మేల్కొనండి

రాజాపేట మండలం, చల్లూరు సర్వే నం.322/4లో శ్రీని డెవలపర్స్‌ అక్రమ క్రషర్‌

  • కంకర బిజినెస్‌లో కోట్లు దండుకుంటున్న అక్రమార్కులు
  • మీ జిల్లాలోని సహజ వనరులను మీరే కాపాడుకోండి
  • అక్రమార్కులను అడ్డుకోలేకపోతున్న అధికారులు
  • నిబంధనలను ఉల్లంఘిస్తున్నా.. నిమ్మకు నీరు..
  • ప్రభుత్వానికి ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యం
  • ప్రకృతి సంపదకు ప్రజలే రక్షణగా నిలవాల్సిన పరిస్థితులు
  • ఈ అక్రమ క్రషర్‌ వ్యవహారంపై మైనింగ్‌, రెవెన్యూ, ఎమ్మెల్యే, ఎంపీ మౌనానికి కారణమేంటి..

యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు మేల్కోవాల్సిన సమయం ఆసన్నమైంది. విూ జిల్లాలోని సహజ వనరులను విూరే కాపాడుకోవాల్సిన పరిస్థితులు తలెత్తాయి. ప్రకృతి సంపదను అక్రమార్కులు నిలువు దోపిడీ చేస్తున్నా నిలదీసే నాథుడే లేకుండా పోయాడు. ప్రభుత్వానికి, అధికారులకు ఎంత మంది ఎన్ని సార్లు ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోవట్లేదు. కాబట్టి జనమే అర్థంచేసుకొని ప్రత్యక్షంగా రంగంలోకి దిగాల్సిన సందర్భం వచ్చింది.

- Advertisement -

ప్రజాధనానికి రక్షణగా నిలవాల్సిన అధికార యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో అవినీతిపరుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. నిబంధనలకు నీళ్లొదులుతూ అక్రమార్కులు కంకర వ్యాపారంలో కోట్ల రూపాయలు దండుకుంటున్నారు. పట్టించుకునేవారు, ప్రశ్నించేవారు లేకపోవటంతో ఇష్టంవచ్చినట్లు ఇల్లీగల్‌ క్రషర్‌ బిజినెస్‌కు రెక్కలొచ్చాయి. పంచాయతీ, పోలీస్‌, రెవెన్యూ, మైనింగ్‌, ఎలక్ట్రిసిటీ, పొల్యూషన్‌ బోర్డ్‌..

Illegal Crusher Operations in Yadadri Bhuvanagiri 1

ఇలా ఏ డిపార్ట్‌మెంట్‌ కూడా అటువైపు కన్నెత్తి చూడట్లేదు.

ఆదాబ్‌ హైదరాబాద్‌ దినపత్రిక ఈ అనధికారిక వ్యవహారాన్ని ఆధారాలతో సహా ఎప్పటికప్పుడు వెలుగులోకి తెస్తున్నా సర్కారు వైపు నుంచి సరైన స్పందన లేకపోవటం, అడ్డుకోకపోవటం స్థాని కులకు ఆశ్చర్యం, ఆగ్రహం కలిగిస్తోంది. చట్టాన్ని, న్యాయ స్థానాలను కూడా లెక్కచేయకుండా కొందరు అదే పనిగా ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్నా, జేబులు నింపుకుంటున్నా అధికారులకు కనీసం చీమ కుట్టినట్లు కూడా లేకపోవటం విడ్డూరం.

సమాచార హక్కు చట్టం ద్వారా వాస్తవాలను బట్టబయలు చేస్తున్నా.. అధికారులు మాత్రం కళ్లుండీ చూడలేని కబోదుల్లా తప్పించుకు తిరుగుతున్నారు. ప్రజలకు చెందాల్సిన విలువైన సంపదను కాకులు, గద్దల్లా పెద్దలు తన్నుకుపోతుంటే ప్రజాప్రతినిధులు గానీ ప్రభుత్వం గానీ చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారంటే.. వారికి కూడా వాటాలు, కవిూషన్లు అందుతున్నాయా అనే అనుమానం కలుగుతోంది. లేకపోతే..

Illegal Crusher Operations in Yadadri Bhuvanagiri 2

ఇంత బహిరంగంగా నేరం జరుగుతున్నా వాళ్లెందుకు మౌనం పాటిస్తున్నారో అర్థంకావట్లేదు.


యాదాద్రి భువనగిరి జిల్లా రాజాపేట మండలం చల్లూరు గ్రామంలోని సర్వే నంబర్‌ 322/4లో శ్రీని డెవలపర్స్‌ అనుమతులు లేకుండా క్రషర్‌ను నడుపుతున్న తీరు అవినీతికి పరాకాష్ట. ఈ అక్రమ క్రషర్‌ కెపాసిటీ గంటకు దాదాపు 300 టన్నులు. ఆదాయం నెలకు సుమారుగా రూ.6 కోట్లు. ఏడాదికి ఏకంగా రూ.72 కోట్లు. ఈ తతంగం వెనుక అధిరాన పార్టీ ఎమ్మెల్యే ఉండడం వల్లే గవర్నమెంట్‌ సైలెంట్‌గా ఉందా అనే ప్రశ్నలు వస్తున్నాయి.

ప్రజలు ఓటేసి తమ ప్రతినిధిగా శాసనసభకు పంపించింది ఎందుకు? ఇలా అడ్డదారుల్లో సంపాదించుకోవటానికా?, లేక, అందరికీ చెందాల్సిన సంపదను తన అనుచరులకే పంచిపెట్టడానికా? ప్రభుత్వానికి రావాల్సిన రాబడిని పక్కదారి పట్టించడానికా?. కాబట్టి యాదాద్రి భువనగిరి జిల్లా ప్రజలు ఇకనైనా ఆలోచించాలి? అన్యాయాన్ని ఎలుగెత్తి చాటాలి. లేకపోతే, ఇలాంటి రాజ్యాంగేతర శక్తులు మరింత రెచ్చిపోతాయి. మన మద్దతుతో, మన అండతో అధికారం చేపట్టి మన నోట్లోనే మట్టికొడుతుండటాన్ని తీవ్రంగా నిరసించాలి.

Illegal Crusher Operations in Yadadri Bhuvanagiri 3

అడగకపోతే అమ్మైనా బువ్వ పెట్టదంటారు. అధికారులూ అలాగే ఉన్నారు.

ఇదేం పద్ధతని నిలదీయకపోతే మాకేం పట్టిందన్నట్లు దులుపుకొని పోతారు. అందువల్ల ఈ దోపీడీ కారణంగా నష్టపోతున్న ప్రజలే దీనిపై పోరాడాలి. పోరాడితే పోయేదేవిూ లేదు. మరిన్ని అక్రమాలకు చెక్‌ పడుతుంది తప్ప మరేవిూ లేదు. మన సంపదను మనమే కాపాడుకొని మన జిల్లా, మన మండలాలు, మన గ్రామాల అభివృద్ధికి ఉపయోగించుకుందాం. లేకపోతే.. దొంగలపాలవుతుంది. మన ఇంట్లో మన కళ్ల ముందే జరుగుతున్న ఈ భారీ చోరీని ఇలాగే చూసుకుంటూ ఉందామా?

అక్రమంగా నడుస్తున్న క్రషర్‌ తాలూకు వ్యవహారాన్ని ఆధారాలతో సహా ప్రజల ముందు ఉంచినప్పటికీ.. మైనింగ్‌, రెవెన్యూ అధికారులు, ఎమ్మెల్యే, ఎంపీ చర్యలు తీసుకోకుండా మౌనంగా ఉండటానికి కారణాలేంటి?. అక్రమ క్రషర్‌ ఆమ్దానీ వీరికి కూడా చేరుతోందా? అందుకే.. అన్నీ తెలిసినా.. చూసీచూడనట్లు ఉంటున్నారా?. ప్రజల సంపదను బహిరంగంగా కోట్ల రూపాయలతో కొల్లగొడుతున్నప్పటికీ వీళ్లు కావాలనే మౌనంగా ఉండటానికి గల కారణాలపై ఆదాబ్‌ హైదరాబాద్‌ మరో కథనం ద్వారా బయటపెట్టబోతోంది. మా అక్షరం అవినీతిపై అస్త్రం.

- Advertisement -
RELATED ARTICLES

Latest News