Saturday, March 21, 2026
HomeజాతీయంAccident | చైనా సరిహద్దు వెంట ఘోర రోడ్డు ప్రమాదం

Accident | చైనా సరిహద్దు వెంట ఘోర రోడ్డు ప్రమాదం

  • లోయలో పడ్డ ట్రక్కు..
  • 22మంది దుర్మరణం..
  • ఆలస్యంగా వెలుగులోకి ఘటన

దేశంలో ప్రతిరోజు రోడ్డు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. తాజాగా అరుణాచలప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ఇండో చైనా సరిహద్దు వెంబడి ఉన్న హుయులియాంగ్ చగ్లగామ్ రహదారిపై ఈ ఘటన జరిగింది. అస్సోంలోని టిన్సుకియా జిల్లాకు చెందిన రోజు వారి కూలీలను తీసుకువెళ్తున్న ఓ ట్రక్కు మార్గమధ్యలో ఈ ప్రమాదానికి గురైనట్లు తెలుస్తుంది. ఈ ప్రమాదంలో ట్రక్కులో ఉన్న 22 మంది కూలీలు చనిపోయినట్లు పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు, రెస్క్యూ టీమ్ హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయకచర్యలు చేపట్టారు. వాస్తవానికి ఈ ఘటన సోమవారం అంటే మూడు రోజుల క్రితం జరిగింది. ఈ ప్రమాదం నుంచి ఓ కార్మికుడు గాయాలతో బయటపడి పట్టణానికి చేరుకున్నాడు.

అతడు ఇచ్చిన సమాచారం వల్లనే ఈ విషాద ఘటన గురించి పోలీసులకు తెలిసింది. గాయపడ్డ ఆ కార్మికుడి మెరుగైన చికిత్స కోసం అస్సాంకు తరలించారు. ప్రమాద ఘటన గురించి అంజావ్ జిల్లా డిప్యూటీ కమిషనర్ మిల్లో కొజిన్ ధృవీకరించారు. ప్రమాదంపై మాట్లాడుతూ.. ఈ ఘటన అంతర్జాతీయ సరిహద్దుకు 45 కిలోమీటర్ల దూరంలో, సముద్ర మట్టానికి దాదాపు 10 వేల అడుగుల ఎత్తులో ఉందన్నారు. ఇప్పటి వరకు 17 మృతదేహాలను వెలికి తీసినట్లు తెలిపారు. రెస్క్యూ టీమ్ సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయని చెప్పారు. ప్రమాదానికి గల కారణాలు తెలియరాలేదు. ఈ ప్రమాదంపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు మిలో కొజిన్ వెల్లడించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News