Saturday, February 21, 2026
HomeతెలంగాణCM Revanth Reddy statement | ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ కేంద్రం

CM Revanth Reddy statement | ఫ్యూచర్ సిటీలో నార్త్ ఈస్ట్ కేంద్రం

తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల మధ్య సంబంధాలను మరింత పటిష్టపరుచుకోవడానికి భారత్ ఫ్యూచర్ సిటీ(Bharat Future City)లో నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రం (North East Annex) నిర్మాణానికి అవసరమైన స్థలాన్ని ఉచితంగా కేటాయిస్తామని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం తన సొంత భవనాన్ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం అన్ని విధాలుగా సహకరిస్తుందని చెప్పారు.

తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల మధ్య కళలు, సంస్కృతి, సాంకేతిక పరిజ్ఞానం, క్రీడలు, ఆవిష్కరణల వంటి అంశాల్లో నిరంతర సహకారం, పరస్పర అవగాహన కోసం తెలంగాణనార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్: ‘సంస్కృతుల సంగమం–సమృద్ధికి సోపానం’ పేరుతో ఉత్సవాలు హైదరాబాద్‌లో ప్రారంభమయ్యాయి.

- Advertisement -

తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ వేడుక ప్రారంభోత్సవంలో గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ(Governor Jishnudev Varma), ఆయన సతీమణి సుధాదేవ్ వర్మ, త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డితో కలిసి సీఎం పాల్గొన్నారు.

ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ దేశంలో తొలి “నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని” తెలంగాణ ఫ్యూచర్ సిటీలో ఏర్పాటుచేసే ప్రణాళికలను విజయవంతంగా ముందుకు తీసుకెళ్లడానికి గవర్నర్ నాయకత్వం వహించాలని కోరారు.

కేంద్ర ప్రభుత్వ ఈశాన్య ప్రాంత అభివృద్ధి మంత్రిత్వ శాఖతో పాటు 8 రాష్ట్రాలతో కలిసి సమిష్టిగా పనిచేయడానికి తెలంగాణ ప్రభుత్వం (Telangana Government) ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ఇప్పుడు ఈశాన్య రాష్ట్రాలు కూడా అన్ని రంగాల్లో దేశానికి మరింతగా తోడ్పాటు అందిస్తున్నాయని అన్నారు.

సీఎం ఇంకా ఏమన్నారంటే..

“అస్సోం, అరుణాచల్‌ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు అనుసంధాన కేంద్రంలో అవసరమైన హాస్టల్ సౌకర్యం, ఆహారం, కళలు, చేతి వృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలుగా ఈ భవనాలు పని చేస్తాయి.

త్రిపురకు చెందిన జిష్ణుదేవ్ వర్మ తెలంగాణ గవర్నర్‌గా, తెలంగాణకు చెందిన ఇంద్రసేనారెడ్డి (Indrasena Reddy) త్రిపుర గవర్నర్‌గా పనిచేస్తున్న నేపథ్యంలో ఇప్పటికే బలమైన సంబంధాలను కలిగి ఉన్నాం.

తెలంగాణ-ఈశాన్య రాష్ట్రాల మధ్య మరింత సహకారానికి, ప్రజల మధ్య సంస్కృతుల పరస్పర మార్పిడికి ఈ ఉత్సవాలు నాంది మాత్రమే. “తెలంగాణ–నార్త్‌ ఈస్ట్ ఇండియా కనెక్ట్” టెక్నో-కల్చరల్ ఫెస్టివల్ విజయవంతం కావడానికి కృషి చేసిన అందరికీ అభినందనలు. ఈ ఉత్సవాలు ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణకు మధ్యన ఉన్న ఏకత్వ స్ఫూర్తిని చాటుతోంది.

ఈశాన్య రాష్ట్రాల ప్రజలకు తెలంగాణ రెండో ఇల్లు లాంటిది. హైదరాబాద్‌కు ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చినవారు పెద్ద సంఖ్యలో ఉన్నారు. ఐటీ, ఫార్మా, హెల్త్ కేర్, టూరిజం, హాస్పిటాలిటీ, స్టార్టప్, క్రీడల వంటి అన్ని రంగాల్లో విజయవంతంగా రాణిస్తున్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలు తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్ధికి తోడ్పడుతున్నందుకు వారికి ధన్యవాదాలు.

హైదరాబాద్, తెలంగాణ ఇప్పటికే పెట్టుబడులకు గమ్యస్థానంగా మారింది. ప్రపంచ దేశాలు పెట్టుబడుల కోసం చైనాకు ప్రత్యామ్నాయంగా చైనా+1 దేశాల కోసం అన్వేషణలో ఉన్నాయి. తెలంగాణ ఇప్పటికే ఐటీ, ఫార్మా, జీసీసీ, డేటా సెంటర్స్, హెల్త్‌కేర్ అగ్రస్థానంలో ఉన్న తెలంగాణను మరింత ఉన్నత దశకు తీసుకెళ్లాలని భావిస్తున్నాం.

ఈ ప్రణాళికల్లో భాగంగా ప్రభుత్వం ఏర్పాటు చేసి రెండేండ్లు పూర్తవుతున్న సందర్భాన్ని పురస్కరించుకుని రాష్ట్ర సమగ్రాభివృద్ధికి బృహత్ ప్రణాళికలతో డిసెంబర్ 8, 9 వ తేదీల్లో హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్-2047 (Telangana Rising) గ్లోబల్ సమ్మిట్‌కు గవర్నర్ నుంచి సంపూర్ణ సహకారం, మద్దతు కోరుతున్నాం.

తెలంగాణ అభివృద్ధి లక్ష్యాలను, తెలంగాణ రైజింగ్ విజన్ 2047 ఉద్దేశాలను దేశంలోని ప్రతి ప్రాంతానికి, ప్రపంచం నలుమూలలకు తీసుకువెళ్లడానికి తెలంగాణ–నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్ ప్రతినిధుల సహాయం కావాలి.

ఈ ఉత్సవాల్లో మంత్రులు జూపల్లి కృష్ణా రావు, పొన్నం ప్రభాకర్, ధనసరి అనసూయ(సీతక్క), పొంగులేటి శ్రీనివాస రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, డీజీపీ శివధర్ రెడ్డితోపాటు ఈశాన్య రాష్ట్రాల నుంచి దాదాపు 300 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఉత్సవంలో ఈశాన్య రాష్ట్రాల కళాకారులను సత్కరించారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News