- దోషులకు వెంటనే కఠిన శిక్షపడేలా చర్యలు : కేంద్రం
- కారు పేలుడు ఘటనపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమీక్ష
- కేంద్ర కేబినెట్ సభ్యుల సంతాపం
- ఈ ఘటనను అత్యంత కిరాతక ఉగ్ర ఘటనగా పేర్కొన్న కేబినెట్
- ముందస్తు ప్రణాళికలపై విస్తృత స్థాయి చర్చ
- ఎగుమతులను ప్రోత్సహించే మిషన్ ఆమోదం
- ఉగ్రవాదంపై కేంద్రం చురుకైన పోరాటాన్ని కొనసాగిస్తుందన్న కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్
దేశరాజధాని ఢిల్లీలో ఇటీవల చోటుచేసుకున్న కారు పేలుడు ఘటనపై కేంద్ర కేబినెట్ అత్యవసర సమీక్ష నిర్వహించింది. ప్రధాని నరేంద్ర మోడీ నేతృత్వంలో జరిగిన ఈ సమావేశంలో భద్రతా పరిస్థితులు, దర్యాప్తు ప్రగతి, వివిధ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థల సమన్వయం, భవిష్యత్ ముందస్తు ప్రణాళికలపై విస్తృత స్థాయి చర్చ జరిగింది. ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయిన వారు, తీవ్రంగా గాయపడిన వారికి సంతాపంగా కేంద్ర కేబినెట్ సభ్యులు రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు. ఈ సమావేశంలో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్, గృహ, రక్షణ, ఇతర సంస్థల నాయకుల పాల్గొన్నారు.
కేంద్ర కేబినెట్ ఈ ఘటనను అత్యంత కిరాతక ఉగ్ర ఘటన గా పేర్కొంది. రాజధానిలో జరిగిన ఈ ఘటనను ముక్త కంఠం తో ఖండించింది. ఈ ఘటనలో పాలుపంచుకున్న వారిని చట్టం ముందు నిలబెడతామని స్పష్టంగా ప్రకటిం చింది. ఈ ఘటనపై దర్యాప్తును మరింత వేగవంతం చేయడం, భద్రతా చర్యలను మరింత కచ్చితంగా అమలు చేయడం, వివిధ ప్రభుత్వ ఏజెన్సీల మధ్య సమన్వయాన్ని పెంపొందించడం కోసం ప్రత్యేక తీర్మానాలను కేబినెట్ ఆమోదించింది. కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ మాట్లాడుతూ ఉగ్రవాదంపై కేంద్రం చురుకైన పోరాటాన్ని కొనసాగి స్తుందని, అవసరమైతే మరింత సాంకేతిక, దృఢమైన భద్రతా చర్యలు అమలు చేయడానికి వెనుకాడబోమని వెల్లడించారు.
ఇక ఈ సమావేశంలో కేంద్రం ఎగుమతులను ప్రోత్సహించే పెద్ద మిషన్ను కూడా ఆమోదించింది. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన ఈ కేబినెట్ భేటీలో ఆరేళ్లపాటు రూ.25,060 కోట్ల కేటాయింపుతో ఎగుమతుల బలోపేతానికి మిషన్ ప్రవేశపెట్టబడింది. ఎగుమతుల ఎకోసిస్టమ్ బలోపేతం, కొత్త వ్యాపార అవకాశాలను సృష్టించడం, వ్యాపారులకు సౌకర్యాలు కల్పించడం ప్రధాన లక్ష్యంగా ఈ మిషన్ ను ఏర్పాటు చేసినట్లు అధికారులు వెల్లడించారు. అలాగే, ఎగుమతిదారుల కోసం క్రెడిట్ గ్యారంటీ పథకాన్ని విస్తరించడం ద్వారా వ్యాపారులకు మరింత ఆర్థిక సాయం అందించనుంది. కేంద్రం ఉగ్రవాదాన్ని అరికట్టడం లో కచ్చితమైన, సమన్వయ విధానాలను కొనసాగిస్తూ, దేశంలో భద్రతా వాతావరణాన్ని మున్ముందుకు తీసుకెళ్లే చర్యలను తీసుకుంటున్నట్లు ఈ సమీక్షకి హాజరయిన మంత్రులు వెల్లడించారు.
