Homeనల్లగొండYadagirigutta | వ్యవస్థల అస్తవ్యస్తం..

Yadagirigutta | వ్యవస్థల అస్తవ్యస్తం..

యాదాద్రి ఆలయంలో పరిపాలన లోపం..

  • దర్శనాల్లో గందరగోళం.. సౌకర్యాల లోపం
  • ప్రోటోకాల్ దర్శనాల పేరిట అక్రమాలు
  • ముందస్తు ఏర్పాట్లు లేక భక్తుల ఇబ్బందులు
  • తాగునీరు, మౌలిక సదుపాయాల క‌రువు
  • వీఐపీ సేవలలో ఆలయ యంత్రాంగం..
  • సాధారణ భక్తులపై చిన్నచూపు
  • ఆలయ ఆధికారుల‌పై భక్తుల ఆగ్ర‌హం

తెలంగాణ తిరుపతిగా పేరుగాంచిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి వారి దేవస్థానంలో అధికారుల పర్యవేక్షణ లోపం వల్ల భక్తులకు ఇక్కట్లు తప్పడం లేదు.స్వామివారి జయంతి ఉత్సవాలు 30వ తేదీన సమాప్తమయ్యాయి. తెల్లవారితే స్వామి వారి జన్మ నక్షత్రం స్వాతి, ఈ రెండు పర్వదినాలలో భక్తుల సంఖ్య అధికంగా వస్తుందని తెలిసినప్పటికీ ముందస్తు చర్యలు లేకపోవడం వల్ల భక్తులు ఇబ్బంది పడ్డారు. అంతేకాక స్వామివారి దర్శనాలలో అంతా గందరగోళంగా ప్రధానాలయం తయారైంది. ఒక పద్ధతి లేకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు వెళ్లడం కనిపించింది. సాధారణంగా తూర్పు రాజగోపురం నుండి వెళ్లవలసిన భక్తులు పడమటి (ఎగ్జిట్) రాజగోపురం నుండి కూడా ఇష్టానుసారంగా దర్శనాలకు బారులు తీరారు. అంతేకాక ప్రధాన ఆలయంలో ఇష్టాను రీతిగా ఎవరికివారుగా భక్తులు తిరుగుతున్నప్పటికీ అధికారులు వారిని మందలించకుండా చూసి చూడనట్టు వదిలేశారు.

- Advertisement -
Yadadri Temple Darshan Chaos

ఇబ్బంది పడ్డ సాధారణ భక్తులు :

గిరి ప్రదక్షిణం సందర్భంగా స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చిన సాధారణ భక్తులు క్యూలైన్లలో నిలబడి అవస్థలు పడ్డారు. మంచినీటి సౌకర్యం, మరుగుదొడ్ల సౌకర్యం సరిపడలేక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. భక్తులకు సౌకర్యాలు కల్పించవలసిన దేవస్థాన అధికారులు నిమ్మకు నేరెత్తనట్లుగా విఐపి సేవలలో తరిస్తున్నారని విమర్శలు వెల్లువెతుతున్నాయి. సాధారణ భక్తులను గాలికి వదిలేసి, సౌకర్యాలను మరచి, విధులలో అలసత్వం వహిస్తున్నారని భక్తులు వాపోతున్నారు.

Yadadri Temple Darshan Chaos3

ఇష్టాను రీతిగా బ్రేక్ దర్శనాలు :

సాధారణంగా ప్రతిరోజు ఉదయం 9:00 గంటల నుండి 10:00 గంటల వరకు బ్రేకు దర్శనాలకు అనుమతినిస్తారు. ఈ బ్రేక్ దర్శనాలకు తప్పనిసరిగా సాంప్రదాయ దుస్తులు ధరించి వెళ్లవలసిన భక్తులు, సరైన సమాచారం లేక, చెప్పేవారు లేక, ఎలాంటి సూచిక బోర్డులు లేక చాలామంది భక్తులు ప్యాంట్లతోనే లోపలికి వచ్చారు.. లోపలికి వెళ్లాక ప్రధాన ఆలయ దర్శనము ప్యాంటుపై లేదు అని అధికారులు చెప్పగానే ఎలాంటి సూచిక బోర్డు కానీ, టికెట్ ఇచ్చేటప్పుడు గాని, ఎవ్వరూ చెప్పలేదు అని అధికారులతో గొడవకు దిగారు.

Yadadri Temple Darshan Chaos4

ప్రోటోకాల్ పై వివాదం భక్తుల అసహనం :

సాధారణంగా వీఐపీలకు లేదా వీవీఐపీలకు మాత్రమే కేటాయించవలసిన ప్రోటోకాల్ దర్శనాలు, ఎవరికి పడితే వారికి ఇష్టానురీతిగా అనుమతినిస్తున్నారని భక్తుల నుంచి విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాక ప్రోటోకాల్ లో ఇచ్చిన చీటీతో కొంతమంది దేవస్థానం సిబ్బంది వాటిని స్వార్థానికి వాడుకొని దేవస్థాన ఆదాయానికి గండి కొడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎంపీ, ఎమ్మెల్యే, ఎంపీడీవో, ఎమ్మార్వో,.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎంతోమందికి ప్రోటోకాల్ ద్వారా దర్శనాలు చేయిస్తూ జేబులు నింపుకుంటున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రోటోకాల్ చీటీ తీసుకున్న వారంతా సరైనటువంటి వ్యక్తులేనా కాదా..? అని పరిశీలన చేసుకోవలసిన బాధ్యత కూడా అధికారులపై ఉంది. లేదంటే ప్రోటోకాల్ దర్శనాలకే అర్థం లేకుండా పోతుంది.

Yadadri Temple Darshan Chaos20

శానిటేషన్ చేయడం లేదని విమర్శలు :

కొండపై సరిగ్గా సానిటేషన్ చేయడం లేదు అని భక్తులు వాపోతున్నారు. క్యూ కాంప్లెక్స్ లు, త్రితల గోపురం పక్కన త్రాగి పడేసిన వాటర్ బాటిల్స్ దర్శనమిచ్చాయి. వాటిని చూసిన భక్తులు ఆలయ పరిసర ప్రాంతాలలో సరైన పరిశుభ్రత లేదని అసహనం వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ఆలయ అధికారులు సమస్య నిలయంగా మారిన దేవస్థాన, పరిసర ప్రాంతాలపై దృష్టి పెట్టి భక్తుల మనోభావాలను దృష్టిలో పెట్టుకొని భక్తులకు సరైన సౌకర్యాలు కల్పించి, యాదాద్రి ఆలయాన్ని పరిశుభ్రతగా, ఆధ్యాత్మిక కేంద్రంగా ఆలయాన్ని తీర్చిదిద్దాలని నరసన్న భక్తులు కోరుతున్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News