- పిల్లల్ని కంటే మీరు సాకుతారా..?
- ఇది చాలా హాస్యాస్పదం..
రాష్ట్రంలో యువత ఎక్కువ మంది పిల్లల్ని కనాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన విజ్ఞప్తిపై రాజ్యసభ మాజీ సభ్యుడు విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) ఘాటుగా స్పందించారు. కేవలం ముఖ్యమంత్రి పిలుపునిచ్చినంత మాత్రాన ప్రజలు ఎక్కువ మంది పిల్లల్ని కనరని, అందుకు అనువైన పరిస్థితులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన హితవు పలికారు. ఈ మేరకు ఆయన సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాలను పంచుకున్నారు.
చంద్రబాబు చేసిన వ్యాఖ్యల్లోని వైరుధ్యాన్ని విజయసాయి రెడ్డి(Vijayasai Reddy) ప్రస్తావించారు. “ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఒకే సంతానం, ఆయన కుమారుడికి కూడా ఒకే సంతానం. అలాంటప్పుడు ఇతరులను ఎక్కువ మంది పిల్లల్ని కనమని కోరడం హాస్యాస్పదంగా ఉంది” అని ఆయన విమర్శించారు. ప్రజలు పిల్లల్ని కనాలనే నిర్ణయాన్ని సీఎం విజ్ఞప్తుల ఆధారంగా తీసుకోరని, వాస్తవ పరిస్థితులను బేరీజు వేసుకుంటారని స్పష్టం చేశారు.
కుటుంబాలు పిల్లల భవిష్యత్తు గురించి తీసుకునే నిర్ణయాలను ప్రభావితం చేసే అంశాలను విజయసాయిరెడ్డి తన పోస్టులో వివరించారు. “తల్లిదండ్రులు తమ పిల్లలకు నాణ్యమైన విద్య, వైద్యం, మంచి నివాసం, సంరక్షణ అందించగలమా లేదా అనే ఆర్థిక స్థోమతను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. అంతేకాకుండా, ఉద్యోగ జీవితం, కుటుంబ బాధ్యతలను సమన్వయం చేసుకోగలమా అన్నది కూడా ఆలోచిస్తారు” అని ఆయన పేర్కొన్నారు.(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
