- బంగారం, వెండి ఆభరణాలు స్వాధీనం…
మండల కేంద్రంలో 16 నెలల క్రితం జరిగిన ఓ ఇంటిలో దొంగతనం కేసును వెంకటాపురం పోలీసులు ఛేదించారు. వెంకటాపురం సిఐ ముత్యం రమేష్ బుధవారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఈ కేసు విషయాలను వివరించారు. మండల కేంద్రంలోని ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోల్ బంక్ సమీపంలోని సంక వేమ సుందర్ ఇంటిలో గత ఏడాది ఏప్రిల్ నెలలో ఇంట్లో ఎవరు లేని సమయంలో ఇంటి తరఫున తాళాలు పగలగొట్టి బంగారం, వెండి ఆభరణాలతో పాటు పదివేల రూపాయల సొత్తును గుర్తుతెలియని వ్యక్తులు దొంగలించారు.
ఈ మేరకు అప్పుడు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాగా వెంకటాపురం ఎస్సై కొప్పుల తిరుపతిరావు తన సిబ్బందితో కలిసి విచారించగా ఎట్టకేలకు దోపిడీకి పాల్పడిన దొంగలను పట్టుకోగలిగినట్లు తెలిపారు. చత్తీస్గడ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లా భూపాలపట్నం గ్రామంలో నివాసముంటున్న పుప్పాల సాయి ప్రకాష్ గత ఏడాది ఏప్రిల్ నెల 5వ తేదీన ఇంటిలో ఎవరూ లేని సమయంలో సంకా వేమ సుందర్ ఇంటిలో దొంగతనానికి పాల్పడ్డాడు. ఆ సమయంలో ఇంటిలో ఎవరు లేకపోవడంతో తాళాలు పగలగొట్టి ఇంటిలోని బంగారం, వెండి వస్తువులతో పాటు రూ పదివేల సొత్తును దొంగలించాడు.
ఈ దొంగతనానికి ముందు సదరు నిందితుడు ఎటునాగారం ప్రాంతంలో ట్రాక్టర్ ట్రాలీ చివరి వ్యవహారంలో జైలు శిక్ష అనుభవించే సమయంలో దబ్బకట్ల మనోజ్ కుమార్ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. అతని సహకారంతో వరంగల్ ప్రాంతానికి చెందిన శ్యామల శ్రీనివాస బాబు అనే వ్యక్తితో కలిసి బయట విక్రయించేందుకు ప్రయత్నం చేస్తుండగా వెంకటాపురం గ్రామ శివారులో తనిఖీలు చేస్తున్న సమయంలో పోలీసులకు చిక్కినట్లు తెలిపారు.
సుమారు లక్ష రూపాయల విలువైన బంగారు ఆభరణాలతో పాటు 51 వేల విలువైన వెండి ఆభరణాలను వారి వద్ద నుండి స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితుడు పుప్పాల సాయి ప్రకాష్ ను అదుపులోకి తీసుకొని కోర్టుకు తరలించినట్లు తెలిపారు. దొంగతనం కేసును చేదించిన ఎస్సై కొప్పుల తిరుపతిరావు, విచారణలో ఆయనకు సహకరించిన కానిస్టేబుళ్లు ఎల్ ప్రసాద్, బాలు, రామకృష్ణ లను సిఐ అభినందించారు.
