క్షేత్రస్థాయిలో పనులు అల్పం…!
- కాగితాల్లోనే మొక్కలు… అధికారుల నిర్లక్ష్యంతో నీరుగారుతున్న వనమహోత్సవం ..!
- నాటిన మొక్కలకు పరిరక్షణ కరువు..ప్రభుత్వ ఆశయంనికి తూట్లు పొడుస్తున్న అధికారులు ..!
- వనమహోత్సవం కాగితాలకే పరిమితమైతే, భావితరాలకు మిగిలేది కాలుష్యమే …!
ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపు లక్ష్యంగా ఏటా వనమహోత్సవం(Vanamahotsavam) కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తోంది. అయితే మండల స్థాయిలో కొందరు అధికారుల బాధ్యతారాహిత్యం, పర్యవేక్షణ లోపం వల్ల ఈ బృహత్తర కార్యక్రమం క్షేత్రస్థాయిలో నీరుగారుతోందన్న ఆరోపణ బలంగా వినిపిస్తున్నాయి.
లెక్కల్లోనే లక్ష్యాలు :
ఉన్నతాధికారుల నుంచి వచ్చే ఒత్తిడిని తప్పించుకోవడానికి క్షేత్రస్థాయి సిబ్బంది కేవలం కాగితాల్లో మాత్రమే లక్ష్యాలు పూర్తయినట్లు తప్పుడు నివేదికలు పంపుతున్నారని , పూర్తిస్థాయిలో వనమహోత్సవం కార్యక్రమం లో రికార్డులో చూపినట్టుగా మొక్కలు నాటడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.


ప్రజా ధానం వృధా ..!
మొక్కల కొనుగోలు, గుంతల తవ్వకం, నిర్వహణ పేరుతో వెచ్చిస్తున్న ప్రభుత్వ నిధులు నిర్లక్ష్యం కారణంగా బూడిదలో పోసిన పన్నీరవుతున్నాయి. హరిత సంకల్పం నిజం కావాలంటే ఉన్నతాధికారులు క్షేత్రస్థాయిలో ఆకస్మిక తనిఖీలు చేపట్టి, నాటిన ప్రతి మొక్క సంరక్షణకు బాధ్యులను చేయడంతో పాటు నిర్లక్ష్యం వహించే అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
మొక్కలు నాటడమే తప్ప సంరక్షణ శూన్యం :
మొక్కలు నాటే రోజున ప్రజాప్రతినిధులు, అధికారులతో పెద్ద ఎత్తున హడావుడి చేసి ఫొటోలు దిగడానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. ఆ తర్వాత వాటికి నీరు పోయడం, ట్రీ గార్డులు ఏర్పాటు చేయడం వంటి సంరక్షణ చర్యలను పూర్తిగా విస్మరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు
ఎండిపోతున్న మొక్కలు :
మండల పరిధిలోని రహదారుల వెంట, ప్రభుత్వ పాఠశాలలు, ఖాళీ స్థలాల్లో నాటిన వేలాది మొక్కలు నీరందక ఎండిపోయి, మోడులుగా మారుతున్నాయి. యావత్ మానవకోటికి ఉపయోగపడే ఈ బృహత్తర కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేయడం సరి కాదంటూ, ఇకనైనా సంబంధిత ఉన్నతాధికారులు స్పందించి వన మహోత్సవం కార్యక్రమం పై లోతుగా విచారణ జరిపి, పూర్తిస్థాయిలో మొక్కల నాటి, వాటి పెంపకం సక్రమంగా జరిగే విధంగా చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు
