- సుమారు 28 బిలియన్ల డాలర్ల నుంచి 35 బిలియన్ల డాలర్ల వ్యయం..
ఇరాన్‌తో జరిగిన వార్‌లో అమెరికా భారీగా ఖర్చు చేసింది. వైట్‌హౌజ్ అంచనాల ప్రకారం ఆ ఖర్చు సుమారు 28 బిలియన్ల డాలర్ల నుంచి 35 బిలియన్ల డాలర్ల వరకు ఉంటుందని భావిస్తున్నారు. ప్రతి రోజూ అమెరికా ఆ యుద్ధం కోసం సుమారు వంద కోట్ల డాలర్లు ఖర్చు చేసింది. అయితే యుద్దం ప్రారంభమైన మొదటి రెండు రోజుల్లోనే అమెరికా దాదాపు 5.6 బిలియన్ల డాలర్ల ఖరీదైన ఆయుధాలను వినియోగించినట్లు తెలుస్తోంది. డిఫెన్స్ డిపార్ట్‌మెంట్ అంచనాల ప్రకారం అమెరికా సుమారు 1100 జాయింట్ ఎయిర్ టు సర్ఫేస్ మిస్సైళ్లను ఇరాన్ మీదుకు వదలినట్లు తెలుస్తోంది.
అమెరికా వద్ద సుమారు 1500 జేఏఎస్ఎస్ఎం-ఈఆర్ క్షిపణులు ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మిస్సైల్ రేంజ్ దాదాపు 600 కిలోమీటర్లు. శత్రువుల స్థావరాల్లోకి ఇది దూసుకెళ్తుంది. జేఏఎస్ఎస్ఎం మిస్సైల్ ధర ఒక్కటి సుమారు 11 లక్షల డాలర్లు ఉంటుంది. ఇరాన్‌పై సమరంలో అమెరికా సుమారు 1000 తోమాహాక్ క్రూయిజ్ క్షిపణులు వాడినట్లు తెలుస్తోంది. ప్రతి ఏడాది అమెరికా ఖరీదు చేసే వాటి కంటే పది రెట్లు ఎక్కువగా వాటిని వినియోగించినట్లు అంచనా వేస్తున్నారు. ఒక్కొక్క తోమాహాక్ క్షిపణి ఖరీదు 3.6 మిలియన్ల డాలర్లు ఉంటుంది. తోమాహాక్‌లు లాంగ్ రేంజ్ క్రూయిజ్ మిస్సైళ్లు.
1991లో జరిగిన పర్షియల్ గల్ఫ్ వార్ నుంచి అమెరికా వీటిని వాడుతోంది. అమెరికాకు చెందిన సీఎస్ఐసీ ప్రకారం.. ఆ దేశం వద్ద సుమారు 3000 తోమాహాక్ క్షిపణులు ఉన్నట్లు నిల్వల ద్వారా తెలుస్తోంది. ఈ యుద్ధంలో 1200 పేట్రియాట్ ఇంటర్‌సెప్టార్ క్షిపణులను అమెరికా వినియోగించినట్లు ఓ కథనం ద్వారా తెలిసింది. ఒక్కొక్క పేట్రియాట్ మిస్సైల్ ఖర్చు సుమారు 4 మిలియన్ల డాలర్లు ఉంటుంది. 2025 సంవత్సరంలో అమెరికా దాదాపు 600 పేట్రియాల్ క్షిపణులను ఉత్పత్తి చేసింది.
