- తీవ్ర హెచ్చరికలు జారీ చేసిన నారా లోకేష్..
- తప్పుడు ప్రచారాల అలవాటు మార్చుకోవాలి..
ముఖ్యమంత్రి చంద్రబాబు ఇచ్చిన హామీని వక్రీకరించి సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేస్తున్న వారిపై మంత్రి నారా లోకేష్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వీడియోలను ఎడిట్ చేసి దుష్ప్రచారం చేసేవారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. వైసీపీ ఎన్నిసార్లు చెప్పినా తన తప్పుడు ప్రచారాల అలవాటును మార్చుకోవడం లేదని విమర్శించారు.
అసలేం జరిగిందంటే..
తిరుపతి జిల్లా నాయుడుపేటలో మార్చి 30న జరిగిన టిడ్కో ఇళ్ల గృహప్రవేశాల కార్యక్రమంలో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముక్కర అంబిక అనే లబ్ధిదారురాలి ఇంటికి వెళ్లి సత్యనారాయణ స్వామి వ్రతంలో పాలుపంచుకున్నారు. ఆమె భర్త ఆటో డ్రైవర్ అని తెలుసుకుని, ఆయనకు జీవనోపాధి కోసం ఒక బ్యాటరీ ఆటోను ఇప్పించాలని జిల్లా కలెక్టర్‌ను అక్కడికక్కడే ఆదేశించారు.
వక్రీకరణ ఇలా..
సీఎం ఆ ఇంటి నుంచి బయటకు వస్తుండగా, ఎదురుగా ఉన్న మరో ఇంటి వద్ద ఒక మహిళ తన చదువుకున్న కుమారుడికి ఉద్యోగం ఇప్పించాలని కోరారు. అయితే కొందరు ఈ రెండు వేర్వేరు సంఘటనలను కలిపి, ‘చదువుకున్న యువకుడికి ఆటో కొనిపెడతారట’ అంటూ అపహాస్యం చేస్తూ వీడియోలను ఎడిట్ చేసి సోషల్ మీడియాలో ప్రచారం చేస్తున్నారని లోకేష్ తెలిపారు.
గతంలోనే ఈ అంశంపై ఏపీ ప్రభుత్వ ఫ్యాక్ట్ చెక్ విభాగం ద్వారా వివరణ ఇచ్చామని, అయినా మళ్లీ అదే అంశంపై దుష్ప్రచారం చేయడం దురుద్దేశపూర్వకమని ఆయన అన్నారు. వీడియోలను తప్పుడు అర్థం వచ్చేలా ఎడిట్ చేసి ప్రచారం చేయడం చట్టరీత్యా నేరమని, ఇలాంటి చర్యలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు.
