- దక్షిణ కొరియాలో ట్రంప్ పర్యటన
- భారత్ – పాక్ అంశంపై స్పందన
- ప్రధాని మోడీ గురించి ప్రస్తావన
ఆసియా పర్యటనలో భాగంగా దక్షిణ కొరియాలో ఉన్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, భారత ప్రధాని నరేంద్ర మోడీపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మోడీ వ్యక్తిత్వం గురించి మాట్లాడుతూ.. ఆయన చూడటానికి ఎంతో సౌమ్యంగా, స్నేహపూర్వకంగా కనిపిస్తారు కానీ నిర్ణయాల విషయంలో చాలా కఠినమైన నాయకుడు అని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య చాలా కాలంగా చర్చలు కొనసాగుతున్నాయి. ఆ ఒప్పందం త్వరలోనే రూపుదిద్దుకోబోతోంది. మోడీ గారితో నాకు ఉన్న బలమైన సంబంధాలు దీనికి కారణమని ట్రంప్ తెలిపారు. ఒకసారి ఆ రెండు దేశాల మధ్య పరిస్థితులు తీవ్రమయ్యాయి. అప్పట్లో నేను మోడీకి ఫోన్ చేసి, యుద్ధం కొనసాగితే మా వాణిజ్య ఒప్పందం వాయిదా పడుతుందని చెప్పాను.
ఆయన మొదట కఠినంగా స్పందించినా, రెండు రోజుల తర్వాత మోడీ, షెరీఫ్ ఇద్దరూ నాతో మాట్లాడి ఉద్రిక్తతలు తగ్గించారు. అయితే ట్రంప్ వ్యాఖ్యలు అంతర్జాతీయ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి. భారత్ పాక్ సంబంధాలపై అమెరికా నేతల మధ్యవర్తిత్వం మళ్లీ ప్రాధాన్యత సంతరించుకోవచ్చన్న విశ్లేషణలు వెలువడుతున్నాయి. ఇక వాణిజ్య ఒప్పందం విషయానికొస్తే, అమెరికా భారత్ ఉత్పత్తులపై విధిస్తున్న టారిఫ్లను 16 శాతంకు తగ్గించేందుకు సిద్ధంగా ఉందని, దీనికి ప్రతిగా భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులను పరిమితం చేయనుందని వర్గాలు వెల్లడిస్తున్నాయి. ఈ మార్పులు రెండు దేశాల మధ్య వాణిజ్య సంబంధాలకు కొత్త ఊపునిస్తాయని నిపుణులు భావిస్తున్నారు.
