- ఆషాఢ మాస బోనాల సందర్భంగా హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు..
- నేడు ఆదివారం సెలవు దినాన్ని సద్వినియోగం చేసుకొని
- మేళాను సందర్శించి బీసీ కళాకారులను ప్రోత్సహించండి..
- విజ్ఞప్తి చేసిన రాష్ట్ర మంత్రి పొన్నం ప్రభాకర్..
ఆషాఢ బోనాల ఉత్సవాల సందర్భంగా హెచ్‌ఎండీఏ గ్రౌండ్స్‌లో ఏర్పాటు చేసిన కులవృత్తుల మేళాకు నగర ప్రజల నుంచి విశేష స్పందన లభిస్తున్నదని రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. బోనాల పండుగకు అవసరమైన కుండలు, బుట్టలు, మట్టి పాత్రలు తదితర సంప్రదాయ వస్తువులను పెద్ద ఎత్తున కొనుగోలు చేస్తూ ప్రజలు కళాకారులను ప్రోత్సహిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
మొత్తం 60 స్టాళ్లతో 15 రోజుల పాటు నిర్వహిస్తున్న ఈ కులవృత్తుల మేళాను నేడు ఆదివారం సెలవు దినం సందర్భంగా కుటుంబ సమేతంగా సందర్శించి, బీసీ వర్గాలకు చెందిన కళాకారులు తయారు చేసిన ఉత్పత్తులను కొనుగోలు చేసి ప్రోత్సహించాలని మంత్రి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం సంప్రదాయ కులవృత్తులకు నూతన ఊతమిస్తూ, బీసీ వర్గాలకు చెందిన కళాకారులు తమ ఉత్పత్తులను నేరుగా ప్రజలకు విక్రయించుకునేందుకు ప్రత్యేక స్టాళ్లను ఏర్పాటు చేసినట్లు మంత్రి తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా సంప్రదాయ వృత్తులకు ప్రోత్సాహం లభించడంతో పాటు వేలాది మంది కళాకారుల జీవనోపాధికి భరోసా కలుగుతుందని చెప్పారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానంలో అంతర్భాగంగా ఉన్న అనేక కులవృత్తులు కనుమరుగుకాకుండా కాపాడేందుకు ఇటువంటి ప్రదర్శనలు ఎంతో దోహదపడతాయని మంత్రి పేర్కొన్నారు. ఈ వృత్తులు రాష్ట్ర సాంస్కృతిక వారసత్వాన్ని పరిరక్షించడమే కాకుండా పర్యావరణహితమైన, ఆరోగ్యకరమైన జీవనశైలిని కూడా ప్రోత్సహిస్తాయని అన్నారు.


ఈ ప్రదర్శనలో టెర్రకోట ఉత్పత్తులు, మట్టి పాత్రలు, జనపనార ఉత్పత్తులు, మేదర బుట్టలు, గద్వాల్ చీరలు, పోచంపల్లి ఇకత్ చేనేత వస్త్రాలు, నిర్మల్ బొమ్మలు, నిర్మల్ చిత్రకళా ఉత్పత్తులు, వెండి ఫిలిగ్రీ కళాఖండాలు, వరాహి హస్తకళ ఉత్పత్తులు, వరంగల్ దుర్రీలు, నారాయణపేట చేనేత వస్త్రాలు, పెంబర్తి ఇత్తడి కళాఖండాలు, సెర్ప్, మెప్మా ఆధ్వర్యంలోని సేంద్రీయ ఆహార ఉత్పత్తులు, రానున్న వినాయక చవితి సందర్భంగా పర్యావరణహిత మట్టి వినాయక విగ్రహాలు, పూసల కళాఖండాలు, సంప్రదాయ ఔషధాలు, విశ్వకర్మ కళాకారుల ఉత్పత్తులు, ప్రభుత్వ విజయ డెయిరీ ఉత్పత్తులు ప్రజలకు అందుబాటులో ఉన్నాయని మంత్రి తెలిపారు.
ప్రదర్శనలో పాల్గొన్న కళాకారుల నైపుణ్యాన్ని మంత్రి అభినందిస్తూ, తమ సంప్రదాయ కళలు, కులవృత్తులను భావితరాలకు అందించే దిశగా నిరంతరం కృషి చేయాలని ఆకాంక్షించారు. ప్రజలు స్థానిక కళాకారుల ఉత్పత్తులను కొనుగోలు చేయడం ద్వారా సంప్రదాయ కులవృత్తులను పరిరక్షించడమే కాకుండా వేలాది మంది కళాకారుల కుటుంబాలకు అండగా నిలుస్తారని మంత్రి పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
