- ద్వైపాక్షిక సంబంధాల బలోపేతమే లక్ష్యంగా చర్చలు..
- ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత మెరుగు..
- చివరి నిజాం మనమడు ఉస్మాన్ ఆలీ సమక్షంలో సమావేశం..
తెలంగాణ ప్రభుత్వ మైనారిటీ సంక్షేమ, పబ్లిక్ ఎంటర్ ప్రైజెస్ శాఖామంత్రి మొహమ్మద్ అజారుద్దీన్ ని, డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ తైమూర్ – లెస్టే రాయబారి కార్లిటో నునెస్, ఫస్ట్ సెక్రటరీ ఔరెలియో బారోస్ మర్యాదపూర్వకంగా కలిశారు. హైదరాబాద్ చివరి నిజాం హెచ్.ఈ.హెచ్. మీర్ ఉస్మాన్ అలీ సాహెబ్ మనుమడు నవాబ్ మీర్ నజాఫ్ అలీ ఖాన్ సాహెబ్ సమక్షంలో ఈ సమావేశం అత్యంత సుహృద్భావ వాతావరణంలో జరిగింది.
భారతదేశం, తైమూర్ – లెస్టే దేశాల మధ్య స్నేహపూర్వక సంబంధాలను మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా ఈ సమావేశంలో అర్ధవంతమైన చర్చలు జరిగాయి. ఇరు దేశాల మధ్య పరస్పర సహకారాన్ని ప్రోత్సహించడం, ప్రజల మధ్య సంబంధాలను పెంపొందించడం, ఉమ్మడి ప్రయోజనాలున్న వివిధ రంగాలలో నూతన సహకార అవకాశాలను అన్వేషించడంపై వారు తమ అభిప్రాయాలను పంచుకున్నారు.

ఇరు దేశాల మధ్య పెరుగుతున్న దౌత్యపరమైన సంబంధాలను మంత్రి అజారుద్దీన్ కొనియాడారు. ఈ విధమైన పరస్పర సమావేశాలు మరింత బలమైన ద్వైపాక్షిక సంబంధాలకు, చిరకాల స్నేహానికి బాటలు వేస్తాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. భారతదేశం, తైమూర్ – లెస్టే దేశాల మధ్య సద్భావన, సహకారం, పరస్పర ప్రయోజనకరమైన భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి గల నిబద్ధతను పునరుద్ఘాటిస్తూ ఈ సమావేశం ఎంతో సానుకూల వాతావరణంలో ముగిసింది.
