( సమన్వయం, డిజిటల్ వేదికలతో ఇది సాధ్యం )
- కొత్త నేర చట్టాల అమలుకు సమన్వయమే కీలకం..
- వెల్లడించిన హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్..
- సాంకేతిక పరిజ్ఞానం, సమన్వయం అవసరం : జస్టిస్ మౌషుమి భట్టాచార్య…
- శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలతో పౌరులకు సత్వర న్యాయం..
- డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగించాలి : డీజీపీ సీవీ ఆనంద్..
- తెలంగాణ రాష్ట్ర జ్యుడిషియల్ అకాడమీ, పోలీస్ శాఖ సంయుక్త విన్నూత్న సదస్సు..
కొత్త నేర చట్టాలైన భారతీయ న్యాయ సంహిత, భారతీయ నాగరిక్ సురక్షా సంహిత బీఎన్ఎస్ఎస్, భారతీయ సాక్ష్య అధినియమం అమలులో డిజిటల్ వేదికల వినియోగం, వివిధ విభాగాల మధ్య సమన్వయం కీలకమని తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ అన్నారు. న్యాయవ్యవస్థ, పోలీస్, జైళ్లు, ప్రాసిక్యూషన్, ఫోరెన్సిక్, వైద్య విభాగాలతో పాటు ఎన్ఐసీ, ఎన్సీఆర్బీ వంటి సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొస్తూ తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ, తెలంగాణ పోలీస్ శాఖ సంయుక్తంగా ఈ వినూత్న సదస్సును నిర్వహించాయి.
దేశంలోనే తొలిసారిగా కొత్త నేర చట్టాల డిజిటల్ అమలుకు సంబంధించిన అన్ని భాగస్వామ్య సంస్థలను ఒకే వేదికపైకి తీసుకొచ్చిన కార్యక్రమంగా ఇది నిలిచింది. తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి చొరవతో నిర్వహించిన ఈ సదస్సులో రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1,200 మంది న్యాయాధికారులు, పోలీస్, ప్రాసిక్యూషన్, జైళ్లు, ఫోరెన్సిక్, వైద్య విభాగాల అధికారులు హైబ్రిడ్ విధానంలో పాల్గొన్నారు.
సమన్వయంతోనే న్యాయవ్యవస్థ బలోపేతం :
హై కోర్టు చీఫ్ జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్
సదస్సును ప్రారంభించిన తెలంగాణ రాష్ట్ర హై కోర్టు చీఫ్ జస్టిస్, జస్టిస్ అపరేష్ కుమార్ సింగ్ మాట్లాడుతూ.. న్యాయం అనేది వివిధ సంస్థలు సమన్వయంతో పనిచేసినప్పుడే సాధ్యమయ్యే సామూహిక ఫలితం అని పేర్కొన్నారు. నేరం నమోదైనప్పటి నుంచి దర్యాప్తు, ఫోరెన్సిక్, ప్రాసిక్యూషన్, న్యాయస్థానంలో విచారణ వరకు ప్రతి దశ కీలకమన్నారు. కొత్త నేర చట్టాల అమలులో సంస్థల మధ్య సమన్వయం, సాంకేతిక పరిజ్ఞానం కీలక పాత్ర పోషిస్తాయని తెలిపారు. ప్రతి విభాగం తన బాధ్యతతో పాటు ఇతర విభాగాలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ఈ సదస్సు ఒక్కసారితో ముగిసిపోకుండా నిరంతర సమన్వయానికి నాంది కావాలని ఆకాంక్షించారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన, అందుబాటులో ఉండే న్యాయాన్ని అందించడమే లక్ష్యంగా ఉండాలని సూచించారు.

సాంకేతిక పరిజ్ఞానం పెంచాలి :
జస్టిస్ మౌషుమి భట్టాచార్య
తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షురాలు జస్టిస్ మౌషుమి భట్టాచార్య మాట్లాడుతూ.. కొత్త నేర చట్టాల సమర్థ అమలుకు భాగస్వామ్య సంస్థల మధ్య మెరుగైన సమన్వయం అవసరమన్నారు. సాంకేతిక పరిజ్ఞానం పనిభారాన్ని పెంచకుండా ప్రక్రియలను సులభతరం చేయాలని సూచించారు. ఒకే సమాచారాన్ని పదేపదే నమోదు చేయడం, అసంపూర్తి వివరాలు ఇవ్వడం వల్ల కేసుల పరిష్కారంలో అనవసర జాప్యం జరుగుతోందన్నారు. పోలీస్ స్టేషన్ల నుంచి వివరాలను ఆన్లైన్లో నమోదు చేసే సమయంలో దర్యాప్తు అధికారులు తప్పులు, తప్పుడు కోడింగ్ లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఇలాంటి తప్పుల వల్ల ప్రాసిక్యూషన్ పరిశీలన ఆలస్యమవుతోందన్నారు. పోలీస్, ప్రాసిక్యూషన్, జైళ్ల శాఖల మధ్య సమాచార మార్పిడి మరింత వేగంగా జరగాలని తెలిపారు. కొంత మంది సిబ్బందికి డిజిటల్ వేదికలపై పూర్తి అవగాహన లేకపోవడం కూడా జాప్యానికి కారణమవుతోందని పేర్కొంటూ, సామర్థ్య పెంపు, డిజిటల్ అక్షరాస్యతపై దృష్టి పెట్టాలని సూచించారు.
శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలతో పౌరులకు సత్వర న్యాయం :
డీజీపీ సీవీ ఆనంద్..
డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ కొత్త నేర చట్టాలు గత చట్టాల స్థానంలో కొత్త నిబంధనలు తీసుకురావడం మాత్రమే కాదని, పౌర కేంద్రిత న్యాయం, శాస్త్రీయ దర్యాప్తు, డిజిటల్ ఆధారాలు, ఎలక్ట్రానిక్ రికార్డులు, కాలపరిమితితో కూడిన ప్రక్రియలకు ప్రాధాన్యం ఇచ్చే సమగ్ర మార్పు అని వివరించారు. దర్యాప్తుపై సమర్థవంతమైన పర్యవేక్షణ, డిజిటల్ సమాచారాన్ని పూర్తి, కచ్చితంగా నమోదు చేయడం, నిర్ణీత సమయంలో దర్యాప్తు పూర్తి చేయడం, అందుబాటులో ఉన్న అన్ని డిజిటల్ వేదికలను సమర్థంగా వినియోగించడం అవసరమన్నారు.
ఈ – సాక్ష్య, ఈ – ఎఫ్ఐఆర్ అంశాల పైన ప్రజెంటేషన్ :
సదస్సులో మూడు సాంకేతిక సెషన్లు నిర్వహించారు. పాల్గొన్న వివిధ విభాగాల అధికారులు తమ అనుభవాలు, ఆచరణలో ఎదురవుతున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై ప్రజెంటేషన్లు ఇచ్చారు. ఐసీజేఎస్, ఈ – సాక్ష్య, ఆన్లైన్లో ఎఫ్ఐఆర్, ఛార్జిషీట్ల వినియోగం, ఈ – సమన్లు, దర్యాప్తు కాలపరిమితులు, వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సాక్ష్యాల నమోదు, న్యాయ సంహిత కాలపరిమితులు, న్యాయ శ్రుతి మాడ్యూల్, ఫోరెన్సిక్, వైద్య విభాగాల అనుసంధానం, జైళ్ల నిర్వహణ, దర్యాప్తు – ప్రాసిక్యూషన్ సంస్థల మధ్య సమన్వయం వంటి అంశాలపై చర్చించారు.
నెలనెలా సమీక్షకు ప్రతిపాదన :
కొత్త నేర చట్టాల అమలు నిరంతర ప్రక్రియ కావడంతో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి అధ్యక్షతన సమన్వయ వ్యవస్థను ఏర్పాటు చేసి, ప్రతి నెలా అమలు తీరుపై సమీక్ష నిర్వహించే అంశాన్ని పరిశీలించాలని డీజీపీ కోరారు. ఈ కార్యక్రమం మరింత సమగ్ర, సాంకేతిక ఆధారిత, పౌర కేంద్రిత న్యాయవ్యవస్థ నిర్మాణానికి తొలి అడుగుగా నిలిచింది. సదస్సుకు చొరవ చూపిన తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి, న్యాయమూర్తులకు, తెలంగాణ రాష్ట్ర జ్యుడీషియల్ అకాడమీకి డీజీపీ కృతజ్ఞతలు తెలిపారు.
ఈ సదస్సులో తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్ విజయసేనారెడ్డి, జస్టిస్ మాధవీదేవి, జ్యుడీషియల్ అకాడమీ అధ్యక్షురాలు జస్టిస్ మౌషుమి భట్టాచార్య, డీజీపీ సీవీ ఆనంద్, ఎన్సీఆర్బీ ప్రతినిధి ప్రశున్ గుప్తా, టీజీఎస్ఎఫ్ఎల్సీ డైరెక్టర్ శిఖా గోయల్, జైళ్ల శాఖ డీజీ సౌమ్యమిశ్రా, తెలంగాణ జ్యుడీషియల్ అకాడమీ ప్రిన్సిపల్ శ్రీదేవి, సీడీటీఐ డైరెక్టర్ సల్మాన్ తాజ్, డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్స్, డీజీలు, ఐజీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
