- కేంద్ర మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్కు న్యాయవాద సంఘాల వినతి
తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల నియామకాల్లో తెలంగాణ మూలాలున్న ప్రతిభావంతులైన న్యాయవాదులకు సముచిత ప్రాధాన్యం కల్పించాలని కేంద్ర న్యాయ, న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ను పలు న్యాయవాద సంఘాల ప్రతినిధులు కోరారు. ఈ మేరకు మంత్రిని కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ ప్రతినిధి బృందంలో తెలంగాణ జూనియర్ అడ్వకేట్స్ అసోసియేషన్ (TJAA) అధ్యక్షుడు జక్కుల వంశీకృష్ణ, ఎఫ్వోఎల్పీ (FOLP) అధ్యక్షుడు తల్లూరి దిలీప్ చౌదరి, ఐఎంఎల్ఏ (IMLA) ప్రతినిధి మర్రి ప్రకాశ్ రావు ఉన్నారు.
హైకోర్టు న్యాయమూర్తుల ఎంపికలో సామాజిక న్యాయం, సమానత్వం పాటించాలని వారు మంత్రికి విజ్ఞప్తి చేశారు. ముఖ్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలతో పాటు మహిళలకు తగిన ప్రాతినిధ్యం దక్కాలన్నారు. స్థానికులైన అర్హులకు అవకాశాలు కల్పించడం ద్వారానే తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆశయం నెరవేరుతుందని, తద్వారా న్యాయవ్యవస్థపై ప్రజల్లో విశ్వాసం మరింత బలోపేతం అవుతుందని వారు స్పష్టం చేశారు. న్యాయవాదుల విజ్ఞప్తిపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు ప్రతినిధి బృందం పేర్కొంది.
