( వైద్యరంగంలో వయసు మంట!)
- కొద్దిమంది కోసమే జీవో తెస్తున్నారనే ఆరోపణలు!
- ప్రభుత్వ నిర్ణయంపై నిరుద్యోగ యువ డాక్టర్ల తీవ్ర నిరసనలు.
- ఖాతరు చేయకపోతే రాష్ట్రవ్యాప్త ఉద్యమానికి సిద్ధం.
తెలంగాణ ప్రభుత్వ వైద్యరంగంలో సరికొత్త వివాదం ముదురుతోంది. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో బోధనా సిబ్బంది, ప్రభుత్వ వైద్యుల పదవీ విరమణ వయసును ప్రస్తుతం ఉన్న 65 ఏళ్ల నుంచి ఏకంగా 70 ఏళ్లకు పెంచేందుకు ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తుండటం వైద్య వర్గాల్లో తీవ్ర కలకలం రేపుతోంది. ఇప్పటికే పలుమార్లు సర్వీస్ కాలాన్ని పెంచిన ప్రభుత్వం.. ఇప్పుడు మరో ఐదేళ్లు పొడిగించాలని భావించడంపై యువ వైద్యుల నుంచి, నిరుద్యోగ అభ్యర్థుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వ తాజా ఆలోచనతో తమ కెరీర్ ఎదుగుదల దెబ్బతింటుందని, వేలాది మంది యువ స్పెషలిస్టులు రోడ్డున పడే ప్రమాదం ఉందని వైద్య నిరుద్యోగులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
ఆ ‘ముగ్గురి’ కోసమే ప్రజాధన దుర్వినియోగమా?
వైద్యుల వయసు పెంపు ప్రతిపాదన వెనుక అంతర్గత వ్యూహం ఉందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. కొద్ది రోజుల్లో రిటైర్ కాబోతున్న కొందరు కీలక అధికారులు (డి.ఎం.ఇ డా. నరేంద్ర కుమార్, అకడమిక్ డి.ఎం.ఇ డా. శివరాం ప్రసాద్, కాళోజీ హెల్త్ వర్సిటీ ఇన్చార్జి వి.సి డా. రమేష్ రెడ్డి) పదవుల్లో కొనసాగేందుకే ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకోబోతోందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
గతంలో కూడా డా. రమేష్ రెడ్డి రిటైర్ అవుతుండగా..
2019 జూన్‌లో ప్రొఫెసర్ల పదవీ విరమణ వయసును 58 ఏళ్ల నుంచి 65 ఏళ్లకు పెంచారు. ఇప్పుడు మళ్లీ అదే అధికారుల రిటైర్మెంట్ సమయానికి, నేషనల్ మెడికల్ కమిషన్ ఇచ్చిన వెసులుబాటును సాకుగా చూపుతూ వయసును 70 ఏళ్లకు పెంచేలా పావులు కదపడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. కొద్దిమంది ప్రయోజనాల కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వేలాది మంది యువ వైద్యుల భవిష్యత్తును బలిపెట్టడం ఎంతవరకు న్యాయమని మేధావులు ప్రశ్నిస్తున్నారు.
నియామక సంస్థల వైఫల్యమే శాపమా?
ఇటీవల 607 అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేయడానికి మెడికల్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్‌మెంట్ బోర్డ్ కు ఏడాది కాలం పట్టింది. అయినా సరే, అందులో 243 పోస్టులను భర్తీ చేయలేక తదుపరి నోటిఫికేషన్‌కు బదిలీ చేయాల్సి వచ్చింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా 2,786 ఫ్యాకల్టీ పోస్టులు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఈ ఖాళీలను సక్రమంగా, వేగంగా భర్తీ చేయలేక, తమ వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే ప్రభుత్వం ఈ ‘వయసు పెంపు’ అనే సులువైన దారిని ఎంచుకుందనే ఆరోపణలు వస్తున్నాయి.
నిరుద్యోగుల ‘గళం’.. ఉద్యమాలకు సై!
ప్రభుత్వం తీసుకుంటున్న ఈ ఏకపక్ష నిర్ణయంపై నిరుద్యోగ వైద్యులు, యువ స్పెషలిస్టులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యోగాలు లేక ఎంతోమంది మెడికల్ పీజీ, సూపర్ స్పెషాలిటీ పూర్తి చేసిన అభ్యర్థులు వీధిన పడ్డారు. వయసు పెంపు నిర్ణయంతో కొత్త నోటిఫికేషన్లు వచ్చే అవకాశం పూర్తిగా దెబ్బతింటుందని, దీనివల్ల తమ భవిష్యత్తు అంధకారమవుతుందని వారు ఆవేదన చెందుతున్నారు.
“ప్రభుత్వం తక్షణమే ఈ ప్రతిపాదనను విరమించుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉన్న మెడికల్ కాలేజీలు, ఆస్పత్రుల వేదికగా భారీ ఎత్తున ఉద్యమాలు చేస్తాం. ప్రభుత్వ నిరంకుశ పోకడలపై నిరుద్యోగులంతా గళమెత్తి, వీధుల్లోకి వచ్చి పోరాడతాం” అని యువ డాక్టర్ల సంఘాలు హెచ్చరిస్తున్నాయి.
యువ స్పెషలిస్టుల మానసిక క్షోభ.. ప్రమోషన్లకూ బ్రేక్!
రాష్ట్రవ్యాప్తంగా 2025 బ్యాచ్‌కు చెందిన దాదాపు 1,200 మంది సీనియర్ రెసిడెంట్లు గత ఏప్రిల్‌లోనే తమ సీనియర్ రెసిడెన్సీ పూర్తి చేసుకుని సిద్ధంగా ఉన్నా రెగ్యులర్ రిక్రూట్‌మెంట్ ప్రక్రియ సాగడం లేదు. ఇటు కాంట్రాక్ట్ ఉద్యోగాల గడువు ముగిసిపోయింది. మరోవైపు దాదాపు 400 మంది నీట్ సూపర్ స్పెషాలిటీ అభ్యర్థులు కౌన్సిలింగ్ కోసం మూడు నెలలుగా వేచి చూస్తున్నారు. ఈ వ్యవస్థాగత లోపాల వల్ల యువ డాక్టర్లు తీవ్ర ఆర్థిక, మానసిక క్షోభను అనుభవిస్తున్నారు.
ఇప్పటికే ఒకసారి రిటైర్మెంట్ వయసును 58 నుంచి 65 ఏళ్లకు పెంచడం వల్ల ప్రస్తుతం ఉన్న అసిస్టెంట్, అసోసియేట్ ప్రొఫెసర్లకు పదోన్నతులే లేకుండా పోయాయి. దీనివల్ల యంగ్ డాక్టర్లకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. 65 ఏళ్ల తర్వాత కనీసం వీఆర్‌ఎస్ (స్వచ్ఛంద పదవీ విరమణ) తీసుకునేందుకు కూడా అవకాశం లేకుండా చేయడం వారికి శాపంగా మారుతోంది. 70 ఏళ్ల వృద్ధాప్యంలో ప్రొఫెసర్లు అందించే సేవలు అంతంతమాత్రంగానే ఉంటాయని, ఇది పరోక్షంగా ప్రజారోగ్య వ్యవస్థను బలహీనపరుస్తుందని ఆందోళన వ్యక్తమవుతోంది.
ప్రభుత్వానికి అల్టిమేటం..
ప్రభుత్వం ఏకపక్షంగా జీవో జారీ చేస్తే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున నిరసనలు, ధర్నాలు, అవసరమైతే సమ్మెకు వెనుకాడబోమని ఎంబీబీఎస్ గ్రాడ్యుయేట్లు, పీజీ రెసిడెంట్లు, సూపర్ స్పెషాలిటీ ట్రైనీలు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్లు తెరిచి, వృద్ధ వైద్యుల పదవీ కాలం పెంచే ఆలోచనను విరమించుకోవాలని.. ఖాళీగా ఉన్న పోస్టులకు తక్షణమే నోటిఫికేషన్లు విడుదల చేసి నిరుద్యోగ యువతకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
