- టికెట్ రేట్ల దగ్గరినుంచి తినే వస్తువుల వరకు ఆకాశానంటుతున్న ధరలు
- ఇలా అయితే థియేటర్ల మూత తప్పదు
- హెచ్చరించిన సుప్రీంకోర్టు
దేశంలో సింగిల్ స్క్రీన్ థియేటర్లు బాగా తగ్గిపోయాయి. మల్టీప్లెక్స్ ల హవా నడుస్తోంది. అయితే, టికెట్ రేట్ల దగ్గరినుంచి తినే వస్తువుల వరకు మల్టీప్లెక్స్ లో ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. మినిమం టికెట్ ధర 200 రూపాయలు పైనే ఉంటోంది. కొన్ని మల్టీప్లెక్స్ లో వాటర్ బాటిల్ ధర 100 రూపాయలు.. కాఫీ ధర 700 రూపాయలు ఉంటోంది. సాధారణ, మధ్య తరగతి కుటుంబాలు మల్టీప్లెక్స్ లకు వెళ్లే పరిస్థితి కనిపించటం లేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని మల్టీప్లెక్స్లపై భారత అత్యున్నత న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది.
అత్యధిక ధరలు ఇలానే కొనసాగితే సినిమా హాళ్లు మూసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. మల్టీప్లెక్స్ లోని టికెట్ రేట్లు 200 రూపాయల వద్ద ఉండాలని కర్ణాటక ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీనిపై మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియాతో పాటు మరికొంతమంది హైకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ప్రభుత్వ నిర్ణయంపై స్టే విధించింది. కానీ.. ఆన్లైన్, ఆఫ్లైన్ ద్వారా అమ్మే ప్రతీ టికెట్కు సంబంధించిన ఆడిటబుల్ రికార్డ్స్ మెయిన్టిన్ చేయాలని ఆదేశించింది. అంతేకాదు..
ఆన్లైన్లో టికెట్ కొనే వారి నుంచి ఐడీ ప్రూఫ్ తీసుకోవాలని స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా సుప్రీంకోర్టును ఆశ్రయించింది. హైకోర్టు నిర్ణయంపై ఓ పిటిషన్ వేసింది. ఆ పిటిషన్పై జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ సందీప్ మెస్త బెంచ్ తాజాగా విచారణ జరిపింది. ఇ+చారణ సందర్భంగా జస్టిస్ విక్రమ్ నాథ్ మాట్లాడుతూ.. ‘మీరు వాటర్ బాటిల్ కు 100 రూపాయలు, కాఫీకి 700 రూపాయలు తీసుకుంటున్నారు’ అని అన్నారు. ఇందుకు మల్టీప్లెక్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా తరఫున కేసు వాదిస్తున్న అడ్వకేట్ ముకుల్ రోహతీ స్పందిస్తూ..
‘తాజ్ హోటల్లో కాఫీకి 1000 రూపాయలు తీసుకుంటున్నారు. మరి మీరు ఆ రేట్ను ఫిక్స్ చేస్తారా?’ అని అడిగారు. ఇందుకు విక్రమ్ నాథ్ బదులిస్తూ.. ‘ఈ రేట్లు స్థిరంగా ఉండాలి. సినిమా రంగం రోజురోజుకు దెబ్బ తింటోంది. ఇలాంటి సమయంలో జనం వచ్చి సినిమాను ఎంజాయ్ చేసేలా రేట్లు ఉండాలి. లేకపోతే సినిమా హాళ్లు ఖాళీగా ఉండాల్సి వస్తుంది’ అని అన్నారు. ముకుల్ స్పందిస్తూ.. ‘కర్ణాటక హైకోర్టు తీసుకున్న నిర్ణయం సరైనది కాదు. ఆఫ్లైన్ టికెట్ కొనే వారి నుంచి ఐడీ ప్రూఫ్ తీసుకోమంటే ఎలా?. ఐడీ కార్డులు పెట్టుకుని థియేటర్లకు ఎవరు వస్తారు?’ అని ప్రశ్నించారు.
