- సంచలన నిర్ణయం తీసుకున్న ఆప్ ప్రభుత్వం..
- జెడ్ కేటగిరీ ఏర్పాటు చేసిన కేంద్రం..
కొంతకాలంగా ఆమ్ ఆద్మీ పార్టీ రాజ్యసభ ఎంపీ రాఘవ్ చద్దాకు, ఆమ్ ఆద్మీ పార్టీకి మధ్య వివాదం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాఘవ్ చద్దాకు కల్పించిన జడ్+సెక్యూరిటీని తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. అయితే, ఈ సెక్యూరిటీని రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన గంటల వ్యవధిలోనే కేంద్రం ఆయనకు జడ్ కేటగిరి సెక్యూరిటీని ఏర్పాటు చేసింది. దీనిపై కేంద్ర హోం శాఖ ఆదేశాలు జారీ చేసినట్లు తెలుస్తోంది.
ఈ సెక్యూరిటీ ఆయనకు పంజాబ్‌తోపాటు ఢిల్లీలో కూడా వర్తిస్తుంది. జడ్ సెక్యూరిటీలో పారామిలిటరీ సైనికులు కూడా ఉంటారు. ప్రస్తుతానికి చద్దాకు ఢిల్లీ పోలీసులు గట్టి భద్రత కల్పిస్తున్నారు. కేంద్రం పూర్తి భద్రత కల్పించేవరకు ఢిల్లీ పోలీసులదే బాధ్యత. ఇంటెలిజెన్స్ బ్యూరో అందించిన సమాచారం ఆధారంగా కేంద్రం ఈ భద్రత ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. చద్దాకు భద్రత తొలగించడం ద్వారా ఆమ్ ఆద్మీ పార్టీకి, చద్దాకు మరింత దూరం పెరిగిందని స్పష్టమవుతోంది.
రాజ్యసభలో చద్దా ఆప్ తరఫున ఎంపీగా కొనసాగుతున్నారు. ఆయనకు ఇంత వరకు పంజాబ్‌లోని ఆప్ ప్రభుత్వమే జడ్+ సెక్యూరిటీ కల్పిస్తూ వచ్చింది. రాజ్యసభలోనూ చద్దాకు ఆప్ మంచి స్థానం ఇచ్చింది. రాజ్యసభలో ఆప్ తరఫున డిప్యూటీ ఫ్లోర్ లీడర్‌గా నియమించింది. ఇటీవల ఉన్నట్లుండి చద్దాను ఆ పదవి నుంచి తొలగించింది.
