- మత్తు పదార్థాల నిర్మూలనకు టూ టౌన్ పోలీసుల ప్రత్యేక తనిఖీలు
- ఇన్స్పెక్టర్ ఇజాజ్ఉద్దీన్
జిల్లా ఎస్పీ శ్రీమతి డి.జానకి, ఐపీఎస్ ఆదేశాల మేరకు మహబూబ్‌నగర్ టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో నార్కోటిక్ జాగిలం “రుద్ర” సహాయంతో టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్ మరియు పోలీసు సిబ్బంది కలిసి మోటర్ లైన్స్ లోని ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం తో పాటు ఇతర ప్రాంతాలలో విస్తృత తనిఖీలు నిర్వహించడం జరిగింది.
మత్తు పదార్థాల అమ్మకం, కొనుగోలు, రవాణా మరియు వినియోగం జరగకుండా నిరోధించేందుకు ఈ తనిఖీలు చేపట్టినట్లు తెలిపారు. అదేవిధంగా పాన్ షాపులు, కిరాణా దుకాణాల యజమానులకు 18 సంవత్సరాల లోపు పిల్లలకు ఎలాంటి టొబాకో ఉత్పత్తులు, గుట్కా, సిగరెట్లు విక్రయించరాదని స్పష్టమైన సూచనలు ఇవ్వడం జరిగింది. నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ సందర్భంగా టూ టౌన్ ఇన్స్పెక్టర్ ఇజాజ్ ఉద్దీన్ మాట్లాడుతూ, యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని, మత్తు పదార్థాలు ఆరోగ్యాన్ని మాత్రమే కాకుండా కుటుంబాలను మరియు సమాజాన్ని కూడా నాశనం చేసే ప్రమాదకరమైన వ్యసనమని తెలిపారు. జిల్లాలో మత్తు పదార్థాల నిర్మూలనకు పోలీస్ శాఖ కట్టుదిట్టమైన చర్యలు కొనసాగిస్తోందని, ప్రజలు కూడా అనుమానాస్పద వ్యక్తులు లేదా చట్టవిరుద్ధ కార్యకలాపాలపై వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
