- జీవన శైలిలో మార్పులు అవసరం..
- మానసిక ఒత్తిడి, తగినంత నిద్రలేకపోవడం కారణం..
- నిపుణుల సలహాలు తీసుకోవడం అవసరం..
చర్మం మసకబారడం, అలసటగా కనిపించడం లేదా అసమాన రంగుతో కనిపించడం ప్రారంభమైనప్పుడు చాలా మంది వెంటనే కొత్త స్కిన్‌కేర్ ఉత్పత్తులను ప్రయత్నించడం మొదలుపెడతారు. కొత్త సీరమ్ లేదా ఫేస్ మాస్క్ తాత్కాలికంగా కొంత మెరుగుదల ఇస్తుంది. కానీ నిరంతరంగా కనిపించే డల్ స్కిన్ సమస్యకు ఒక్క ఉత్పత్తి లోపమే కారణం కాదని నిపుణులు చెబుతున్నారు. క్లినికల్ స్కిన్ ప్రాక్టీస్‌లో చర్మం మసకబారడం అనేది శాస్త్రీయంగా రూపొందించిన సరైన చికిత్స, సరైన ఫార్ములేషన్స్, జీవనశైలి మార్పులు అవసరమనే సంకేతంగా ఎక్కువగా కనిపిస్తుందని అంటున్నారు. అన్ని రకాల చర్మాల్లోనూ డల్‌నెస్‌కు అనేక అంతర్గత, బాహ్య కారణాలు ఉంటాయి.
మానసిక ఒత్తిడి, తగిన నిద్ర లేకపోవడం, ఎక్కువసేపు స్క్రీన్‌ల ముందు గడపడం, కాలుష్యం, డీహైడ్రేషన్, సెబమ్ అసమతుల్యత, మైక్రోబియోమ్ లోపాలు, మెలనిన్ అసమాన పంపిణీ, కొల్లాజెన్ ఉత్పత్తి తగ్గడం వంటి అంశాలు చర్మ కాంతిని ప్రభావితం చేస్తాయి. దీర్ఘకాలంలో ఇవి చర్మపు రక్షణ పొరను బలహీనపరచి సహజ కాంతిని తగ్గిస్తాయి. అందుకే ఎన్నాళ్లుగానో వాడుతున్న స్కిన్‌కేర్ రొటీన్ కూడా ఒక దశ తర్వాత ఫలితం ఇవ్వదు. డల్ స్కిన్‌ను తగ్గించడంలో మొదటి, అత్యంత ముఖ్యమైన దశ దానికి కారణమేమిటో తెలుసుకోవడం. కొందరిలో నీటి లోపం, తగిన మాయిశ్చర్ లేకపోవడం ప్రధాన కారణం అవుతాయి. మరికొందరిలో సన్ డ్యామేజ్, ఆక్సిడేటివ్ స్ట్రెస్, పిగ్మెంటేషన్ సమస్యలు లేదా అసమతుల జీవనశైలి కారణమవుతాయి.
శారీరక వ్యాయామం లేకపోవడం, అధిక ఒత్తిడి వల్ల ఎండోర్ఫిన్ స్థాయిలు తగ్గిపోవడం కూడా చర్మ కాంతిపై ప్రభావం చూపుతాయని నిపుణులు చెబుతున్నారు. సరైన స్కిన్ అసెస్‌మెంట్ ద్వారా అసలు సమస్యను గుర్తిస్తే, చికిత్స కూడా మరింత టార్గెటెడ్‌గా, ఫలితాలిచ్చే విధంగా ఉంటుంది. చర్మంపై పేరుకుపోయే మృతకణాలు, అదనపు ఆయిల్, కాలుష్యపు కణాలను తొలగించకపోతే చర్మం మరింత డల్‌గా కనిపిస్తుంది. ప్రొఫెషనల్ డీప్ క్లెన్సింగ్, ఎక్స్‌ఫోలియేషన్ ఫేషియల్స్ చర్మ పునరుత్పత్తిని వేగవంతం చేస్తాయి. అలాగే చర్మానికి ఆక్సిజన్, పోషకాలు సరిగా అందేలా చేసి ఫ్రెష్ లుక్‌ను తీసుకువస్తాయి.
