ఎండకు భయపడి మూస్కున్న బడి తల్పులు
నేడు అక్షర ఏరువాకై తెరుచుకున్నయ్
ఇన్ని రోజులు బెంగ పడిన తరగతి గదులు
నేడు సీతాకోకల తోటి తబ్బిబ్బవుతున్నయ్ పసిపిల్లల పాదముద్రలు లేక గుండె పగిలిన గ్రౌండ్ నేడు థౌజండ్ వాట్స్ బల్బులా వెలిగిపోతుంది
చినుకుతోటి తరువులు చిగురు తొడిగి పుడమిని మురిపెంగా ముద్దాడుతున్నాయి
పచ్చని ఆకులన్నీ సన్నటి గాలికి ఊగుతూ
బుడ్తలకు స్నేహ హస్తాలను అందిస్తున్నాయి
చెట్ల కొమ్మలు ఊగుతూ తమ భాషలో
పిల్లలకు సలాం చేస్తున్నాయి
ఎర్రటెండలో ట్రైనింగ్ లో మంచి ముచ్చట్లు
శెవులేసుకొని చిప్ కు మార్పులు చేసుకొని
జ్ఞాన ధారను లేత మనసు పొరల్లోకి
సెలైన్ లా ఎక్కించడానికి గురువులు
బార్డర్ లో సైనికుల్లా బడిలో అడుగిడారు
శుష్కిస్తున్న బడులను బతికించుకోవడానికి
కాళ్ళకు చక్రాలను కట్టుకొని
నెత్తిన సూర్యున్ని పెట్టుకొని
ఎండ తాపానికి గుక్కెడు గుక్కెడు నీళ్లను తాగి బడిబాట లో ఏరుకొచ్చిన పిల్లలను
ఏ ప్రయివేటు గధ్ధలు ఎత్తుకపోతాయని
ఒక్కటే పానమంతా గాబరై గుబులైతాంది
రోజుకో మార్పు పూటకో కూర్పు
పైన సర్కార్ ఒత్తిడి కింద టీచర్లకు చిత్తడి
అడిగిందే అడుగుడూ గీసిందే గీసుడూ
గాడి తప్పిన పాలన మెలిపెడుతున్న వేదన
గియాల పంతుల్లు మస్తు పరేశానైతుండ్రు
నాకైతే కాడి కిందెత్తేసి కాగితాన్ని సర్కార్ శేతుల పెట్టేసి సన్నాసులల్ల కల్వ బుద్దైతాంది
