Homeమెదక్‌Sadashivpet | ఖద్దరు వెనుక కన్నీటి తడి!

Sadashivpet | ఖద్దరు వెనుక కన్నీటి తడి!

రాజకీయ మోజులో గుల్లవుతున్న బతుకులు.. అప్పుల ఊబిలో నేతలు!

  • ​సదాశివపేట్ మున్సిపాలిటీ, సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో ముదురుతున్న రాజకీయ వ్యామోహం!
  • ​స్నేహితులతో కలిసి ఇంత పార్టీ చేసుకుందామన్నా జేబులో పైసల్లేని దుస్థితి!
  • ఎవరినైనా చేయి చాచి అడుగుదామంటే పరువు పోతుందని లోలోపలే కుమిలిపోతున్న నేతలు!
  • ​నాటి రాజకీయాల్లో విలువల దర్పం.. నేటి రాజకీయాల్లో పైసల పైత్యం, పరమ దరిద్రం!
  • “ముందు స్కూల్, కాలేజీ ఫీజులు కట్టండి.. ఆ తర్వాత మీ పెద్ద రాజకీయాలు చేయండి!” అంటూ భార్యాపిల్లల నిలదీత!
  • పైకి తెల్లటి అంగీ.. జేబులో చూస్తే చిల్లి రూపాయి ఉండదు!
  • ​పండుగలొస్తే చాలు ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఊళ్లు వదిలి పారిపోతున్న వైనం!

రాజకీయ పిచ్చి ఎందరో స్థానిక నేతల జీవితాలను నిలువునా దహించివేస్తోంది. ముఖ్యంగా సదాశివపేట్ మున్సిపాలిటీతో(Sadashivpet Municipality) పాటు సదాశివపేట, సంగారెడ్డి మండలాల్లో అధికారం, గుర్తింపు కోసం చేస్తున్న ఆర్భాటాలు ద్వితీయ శ్రేణి నేతలను నిండా ముంచుతున్నాయి.

- Advertisement -

​పార్టీ చేసుకుందామన్నా పైసల్లేవు.. అడుగుదామంటే పరువు బజారుపాలు!

ఈ అప్పుల కుంపటి, రాజకీయ వ్యామోహం తెచ్చిపెట్టిన పరిస్థితులు నేతలను నిలువునా దహించివేస్తున్నాయి. నలుగురు స్నేహితులతో కూర్చొని ఇంత దావత్ చేసుకుందామన్నా, చిన్న పార్టీ చేసుకుందామన్నా కనీసం చేతిలో చిల్లిగవ్వ లేని అత్యంత దయనీయ స్థితి నెలకొంది. పోనీ ఆ కాస్త ఖర్చు కోసం తెలిసిన వాళ్లనో, కార్యకర్తలనో చేయి చాచి అడుగుదామంటే ఎక్కడ పరువు పోతుందోనన్న భయం వెంటాడుతోంది. “లీడర్ అయి ఉండి వంద రూపాయల కోసం చేతులు చాస్తున్నాడు” అని నలుగురూ నవ్వుకుంటారేమోనన్న బిడియంతో, ఎవరికీ చెప్పుకోలేక ఆ బాధను దిగమింగుకుంటూ లోలోపలే కుమిలిపోతూ నరకయాతన అనుభవిస్తున్నారు.

​నాటి విలువలు మాయం.. నేటి రాజకీయం పరమ దరిద్రం!

గత రాజకీయాలతో పోల్చి చూస్తే ప్రస్తుత రాజకీయం ఎంత దిగజారిపోయిందో, ఎంతటి దీన స్థితికి చేరిందో చూస్తే రోత పుడుతోంది. ఒకప్పుడు రాజకీయమంటే ప్రజాసేవ, సిద్ధాంతాలు, గౌరవం ఉండేవి. కానీ నేటి రాజకీయం అంతా కుళ్లిన పైసల పైత్యం, పరమ దరిద్రపు ఆర్భాటంగా మారిపోయింది. ఓట్ల కొనుగోళ్లు, మద్యం ఏరులై పారించడం, రాత్రికి రాత్రే దావత్‌లు, పైరవీలు తప్ప ప్రజాసేవ అనే మాటే కరువైంది. విలువలు లేని ఈ మురికి రాజకీయాల్లో బతకలేక, డబ్బులు గుమ్మరించలేక నిజాయితీపరులు అల్లాడుతున్నారు. “అప్పటి రాజకీయం ఒక తపస్సులా ఉంటే.. ఇప్పటి రాజకీయం బతుకులను రోడ్డుకీడ్చే వ్యసనంలా తయారైంది” అని స్థానికులు దుమ్మెత్తిపోస్తున్నారు.

​”ముందు స్కూల్, కాలేజీ ఫీజులు కట్టండి.. ఆ తర్వాత పెద్ద రాజకీయాలు చేయండి!”

బయట పదిమందిలో ‘లీడర్’ అనిపించుకోవడానికి చేస్తున్న ఆర్భాటాలు ఇంట్లో నిత్య కన్నీళ్లకు దారితీస్తున్నాయి. పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు కట్టలేక యాజమాన్యాల నుంచి పదేపదే నోటీసులు వస్తుంటే.. ఈ నాయకులు మాత్రం అవేమీ పట్టనట్లు వీధుల్లో దర్పం ప్రదర్శిస్తున్నారు. దీంతో భార్యాపిల్లలు సహనం కోల్పోయి, “ముందు ఇంట్లో నాలుగు పచ్చడి మెతుకులు దొరికేలా చూడండి.. పిల్లల స్కూల్ ఫీజులు, కాలేజీ ఫీజులు ఫస్ట్ కట్టండి.. ఆ తర్వాత మీరు బయట ఆ పెద్ద రాజకీయాలు, ఆ దర్పాలు చేయండి!” అంటూ ముఖం మీదే నిలదీసి కడిగిపారేస్తున్నారు.

​బయట ‘పెద్ద లీడర్’.. ఇంట్లో చూస్తే ‘పీకల్లోతు దరిద్రం’!

బయట నాలుగు రోడ్ల కూడలిలో నిలబడితే అనుచరుల హడావుడి, దండలు, చేతులెత్తి దణ్ణాలు పెట్టే దర్పం.. చూసేవాళ్లకు అతనొక ‘పెద్ద లీడర్’! కానీ ఇంటి గుమ్మం తొక్కి లోపలికి చూస్తే మాత్రం కడుపు తరుక్కుపోయే దైన్యం, పీకల్లోతు దరిద్రం దర్శనమిస్తోంది. కిరాణా కొట్టు బాకీలు, కరెంట్ బిల్లులు కట్టలేక కుటుంబం నానా అగచాట్లు పడుతోంది. పైకి తెల్లటి అంగీ.. జేబులో చూస్తే చిల్లి రూపాయి ఉండదు!

​పండుగలొస్తే చాలు ఫోన్లు స్విచ్ ఆఫ్.. ఊరు దాటి పలాయనం!

నిత్యం అయ్యే రాజకీయ ఖర్చులు ఒక ఎత్తైతే.. వినాయక చవితి, దసరా, దీపావళి, సంక్రాంతి, పీర్ల పండుగ, జాతరలొస్తే చాలు గల్లీ నుంచి జిల్లా స్థాయి వరకు చందాల రసీదు పుస్తకాలు పట్టుకుని నేతల ఇళ్ల ముందు దండయాత్ర చేస్తున్నారు. ఇచ్చే స్తోమత లేక.. ఇవ్వకపోతే పరువు పోతుందన్న భయంతో పండుగ రోజుల్లో ఎవరికీ దొరక్కుండా ఫోన్లు స్విచ్ ఆఫ్ చేసి, ఊళ్లు వదిలి పారిపోతున్నారు.

​’రాకముందే బాగుండేది’.. కన్నీటి రోదనతో వాపోతున్న వైనం!

“ఈ దరిద్రపు రాజకీయాల్లోకి రాకముందే మా బతుకులు ఎంతో ప్రశాంతంగా బాగుండేవి.. ఈ రాజకీయ ముద్ర పడటం వల్లే బతుకు బస్టాండ్‌ అయింది.. పరువు పోయింది, ఆస్తులు ఆవిరయ్యాయి.. ఈ రాజకీయ ముద్ర మాకొద్దే వద్దంటూ” అత్యంత సన్నిహితుల వద్ద బోరుమంటూ ఏడుస్తూ చెప్పుకుంటున్నారు. ఇప్పటికైనా ఈ డొల్ల ఆడంబరాల పిచ్చి వీడకపోతే మిగిలిన బతుకు కూడా మరింత అగాధంలోకి జారడం ఖాయం!(https://epaper.aadabhyderabad.in/)(Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News