- రైతు బీమాకు బ్రేక్.. కొత్త పథకానికి లేట్.. !
- ఆగస్టు 14తో ముగిసిన ‘రైతు బీమా’..(Rythu Bima) ఎల్‌ఐసీకి అందని ప్రీమియం నిధులు..!
- నవంబర్ 19 వరకు పాలసీ శూన్యం.. ఈ మధ్యలో మరణించే రైతు కుటుంబాలకు దిక్కెవరు..!*
- మధ్యలో రైతు చనిపోతే.. కుటుంబానికి 5 లక్షలు ఎవరిస్తారు..!
తెలంగాణలో వ్యవసాయ రంగానికి వెన్నెముకగా నిలిచి, అన్నదాత ఆకస్మిక మరణంతో వీధిన పడే కుటుంబాలకు కొండంత ఆర్థిక భరోసానిచ్చిన ‘రైతు బీమా’(Rythu Bima) పథకం ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. గత ఎనిమిదేళ్లుగా నిరంతరాయంగా కొనసాగుతూ వచ్చిన ఈ రైతు రక్షణ కవచం ప్రస్తుతానికి నిలిచిపోవడంతో, రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది రైతులు తీవ్ర అయోమయానికి, ఆందోళనకు గురవుతున్నారు.
ముగిసిన గడువు.. నిలిచిన ప్రీమియం:
రాష్ట్రంలోని 18 నుంచి 59 ఏళ్ల వయస్సు గల పట్టాదారు రైతులందరికీ ప్రభుత్వం వంద శాతం ప్రీమియం చెల్లిస్తూ లైఫ్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎల్‌ఐసీ) భాగస్వామ్యంతో ఈ పథకాన్ని అమలు చేస్తూ వచ్చింది. ప్రతి సంవత్సరం ఆగస్టు 14 నాటికి ప్రభుత్వమే వార్షిక ప్రీమియం మొత్తాన్ని ఎల్‌ఐసీకి చెల్లించి పాలసీని పునరుద్ధరించాల్సి ఉంటుంది. అయితే, 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఆగస్టు 14వ తేదీ అర్ధరాత్రితో పాత ఒప్పందం గడువు ముగిసినప్పటికీ, ప్రభుత్వం నుంచి ఎల్‌ఐసీకి ప్రీమియం నిధులు జమ కాలేదు. దీంతో ఆగస్టు 15 నుండి రైతు బీమా పథకం(Rythu Bima Scheme) సాంకేతికంగా నిలిచిపోయినట్లయింది.

‘ఇందిరమ్మ’ జాప్యం.. నడిమధ్యలో అభద్రత:
కేవలం భూమి ఉన్న రైతులకే కాకుండా, ఆహార భద్రతా కార్డులు కలిగిన నిరుపేద కుటుంబాలన్నింటికీ వర్తించేలా ‘ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా’ పేరిట సమగ్ర నూతన పథకాన్ని తీసుకువస్తామని ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. అయితే, ఈ కొత్త పథకాన్ని నవంబర్ 19న (ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా) ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు తెలుస్తుంది. ఇక్కడే అసలు సమస్య వచ్చిపడింది. పాత రైతు బీమా(Rythu Bima) కాలపరిమితి ఆగస్టు 14తో ముగియగా, కొత్త పథకం ప్రారంభం కావడానికి ఇంకా రెండున్నర నెలల సమయం పట్టనుంది.
మధ్యంతర మరణాలకు పరిహారం దక్కేదెలా?
ఈ రెండు పథకాల మధ్య ఏర్పడిన సుమారు మూడు నెలల విరామ కాలంలో (ఆగస్టు 15 నుంచి నవంబర్ 19 మధ్య) సహజంగా గానీ, ప్రమాదవశాత్తు గానీ మరణించే రైతుల పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. క్షేత్రస్థాయిలో వ్యవసాయ విస్తరణ అధికారులు (ఏఈవోలు) ఆగస్టు 14 తర్వాత సంభవించిన మరణాలకు సంబంధించిన క్లెయిమ్ దరఖాస్తులను స్వీకరించేందుకు నిరాకరిస్తున్నట్లు సమాచారం . గతంలో రైతు మరణించిన పది రోజుల్లోనే నామినీ బ్యాంకు ఖాతాలో 5 లక్షల మొత్తం జమయ్యేది. కానీ ప్రస్తుత పరిస్థితిల్లో , దురదృష్టవశాత్తు కుటుంబ పెద్దను కోల్పోయిన రైతు కుటుంబాలు దిక్కుతోచని స్థితిలో పడిపోతున్నాయి.(epaper.aadabhyderabad.in)

ప్రభుత్వం తక్షణమే స్పష్టత ఇవ్వాలి:
తాడ్వాయి మండలంలో 2018 నుండి 2026 వరకు మండలం లో 426 మంది రైతులకు, రైతు బీమా(Rythu Bima) కింద 21 కోట్ల 31 లక్షలు ప్రభుత్వం చెల్లించింది.విధానపరమైన మార్పులు, సరికొత్త సంక్షేమ పథకాల రూపకల్పన ఆహ్వానించదగ్గ పరిణామమే అయినప్పటికీ, కొత్త పథకం అమలులో ఇటువంటి కాలవ్యవధి లోపాలు అన్నదాతల జీవితాలను అగాధంలోకి నెట్టే ప్రమాదం ఉంది. నవంబర్ 19 వరకు వేచి చూడకుండా, ఈ మధ్యంతర కాలంలో మరణించిన రైతుల కుటుంబాలకు కూడా ₹5 లక్షల పరిహారాన్ని ప్రభుత్వమే ప్రత్యేక నిధుల ద్వారా మంజూరు చేస్తుందా లేదా అనే అంశంపై అటు ప్రభుత్వంగాని,అధికారులుగాని వెంటనే అధికారిక ప్రకటన జారీ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
తమకు ఎలాంటి ఉత్తర్వులు అందలేదు. వ్యవసాయ శాఖ అధికారులు.
ఆగస్టు 14 నుండి రైతు బీమా పథకం(Rythu Bima Scheme) నిలిచిపోయిన మాట వాస్తవమేనని, ప్రభుత్వం గాని పై అధికారుల నుండి గాని ఈ మధ్యకాలంలో చనిపోయిన రైతుల నుండి దరఖాస్తులు తీసుకోవాలని తమకు ఎలాంటి ఉత్తర్వులు గాని అందలేదు కాబట్టి ప్రస్తుతం తమ వద్దకు వచ్చిన రైతులకు ప్రభుత్వం నుండి ఆదేశాలు వచ్చేవరకు వేచి చూడాలని చెప్తున్నాం.
వాయిస్. మా కుటుంబం పెద్ద దిక్కుని కోల్పోయింది. రైతు భార్య మంగమ్మ
కొద్దీ రోజుల క్రితం మా ఆయన బాలా గౌడ్ ప్రమాదవశాత్తు కిందపడి మృతి చెందాడు,మా కుటుంబం పెద్ద దిక్కును కోల్పోయింది..
రైతు బీమా(Rythu Bima) దరఖాస్తు కోసం వెళితే అధికారులు తీసుకోవడం లేదు.. ఇప్పుడు మాకు ఆర్థికంగా భరోసా లేకుండా పోయింది. ప్రభుత్వమే మాకు ఆర్థిక భరోసా ఇవ్వాలి ఇన్సూరెన్స్ డబ్బులు వచ్చే విధంగా చూడాలి.

