- హైదరాబాద్ అంతటా “1 మినిట్ హార్ట్ ఛాలెంజ్”కు విశేష స్పందన..
- గుండె ఆరోగ్యానికి చురుకైన జీవనశైలి అవసరంపై అవగాహన
“వరల్డ్ హార్ట్ డే” సందర్భంగా యశోద హాస్పిటల్స్ (Yashoda Hospital) ఆధ్వర్యంలో నగరవ్యాప్తంగా పలు ప్రత్యేక ఆరోగ్య అవగాహన, వ్యాయామ కార్యక్రమాలు నిర్వహించారు. ప్రజల్లో గుండె ఆరోగ్యంపై అవగాహన పెంచడంతో పాటు, రోజువారీ జీవితంలో శారీరక చురుకుదనాన్ని భాగంగా చేసుకోవాల్సిన అవసరాన్ని తెలియజేసేందుకు “1 మినిట్ హార్ట్ ఛాలెంజ్” కార్యక్రమాన్ని నిర్వహించారు. కేబీఆర్ పార్క్, బొటానికల్ గార్డెన్స్, ట్యాంక్ బండ్, వివిధ కమ్యూనిటీ సెంటర్లు, సికింద్రాబాద్ క్లబ్, పలు జిమ్‌లతో పాటు యశోద హాస్పిటల్స్‌కు చెందిన నాలుగు యూనిట్లలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు.
చిన్నారుల నుంచి వృద్ధుల వరకు వేలాది మంది ఉత్సాహంగా ఈ గుండె ఆరోగ్య అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. వరల్డ్ హార్ట్ డే సందర్భంగా నిర్వహించిన “1 మినిట్ హార్ట్ ఛాలెంజ్”లో తెలంగాణ కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్, హైదరాబాద్ సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ పాల్గొని కార్యక్రమానికి తమ మద్దతు తెలిపారు. గుండె ఆరోగ్యం, చురుకైన జీవనశైలి ప్రాముఖ్యతపై ప్రజల్లో అవగాహన పెంపొందించే లక్ష్యంతో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వారి భాగస్వామ్యం ప్రజలను మరింత ఉత్సాహపరిచింది.
ఈ అవగాహన కార్యక్రమంలో ట్రెడ్‌మిల్, స్టేషనరీ సైక్లింగ్, స్కిప్పింగ్, పుష్-అప్స్ తదితర వ్యాయామాల్లో పాల్గొని తమ సామర్థ్యాన్ని ప్రదర్శించారు. వివిధ వయసుల వారు, మహిళలు–పురుషులు, వివిధ వ్యాయామ విభాగాల్లో ఒక నిమిషంలో అత్యధిక కేలరీలు ఖర్చు చేసిన వారిని కార్డియాలజిస్టులు, ఇతర వైద్యులు, ఫిజియోథెరపిస్టులు, నర్సులు, (ఈ ఎమ్ టీ )ల వైద్య బృందం పర్యవేక్షించి విజేతలకు ప్రత్యేక బహుమతులు అందజేశారు. ఈ సందర్బంగా యశోద హాస్పిటల్స్ (Yashoda Hospital) డైరెక్టర్, డాక్టర్. పవన్ గోరుకంటి మాట్లాడుతూ, “ప్రస్తుత ఆధునిక జీవనశైలిలో కుటుంబం, ఉద్యోగం, ఇతర బాధ్యతల కారణంగా చాలామంది వ్యాయామానికి తగిన సమయం కేటాయించలేకపోతున్నారని తెలిపారు.
అయితే, వ్యక్తిగత ఆరోగ్య పరిస్థితి, ఫిట్‌నెస్‌కు అనుగుణంగా సురక్షితంగా నిర్వహించే తక్కువ వ్యవధి శారీరక శ్రమ కూడా ఆరోగ్యానికి ప్రయోజనకరంగా ఉంటుందని వివరించారు. రోజువారీ జీవితంలో చిన్న చిన్న మార్పులు చేసుకోవడం ద్వారా శారీరక చురుకుదనాన్ని పెంచుకోవచ్చని సూచించారు. లిఫ్ట్‌కు బదులుగా మెట్లు ఉపయోగించడం, ఎక్కువసేపు కంప్యూటర్ ముందు పనిచేసేటప్పుడు మధ్యలో కొద్దిసేపు నడవడం, ఎక్కువసేపు ఒకే చోట కూర్చోకుండా తరచూ నిలబడటం వంటి చిన్న అలవాట్లు ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయని తెలియజేశారు. క్రమమైన శారీరక శ్రమ గుండె ఆరోగ్యంతో పాటు మొత్తం శరీర ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు.
వ్యాయామం కోసం ఎక్కువ సమయం అవసరం లేదనే సందేశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడమే ఈ “1 మినిట్ హార్ట్ ఛాలెంజ్” ప్రధాన ఉద్దేశం. చిన్న చిన్న జీవనశైలి మార్పులు, క్రమమైన శారీరక శ్రమతో గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతో పాటు ఆరోగ్యకరమైన జీవనకాలాన్ని పెంచుకోవచ్చు. “1 మినిట్ హార్ట్ ఛాలెంజ్”కు నగరవ్యాప్తంగా మంచి స్పందన లభించింది. వైద్యులు, నిపుణులు, అధికారులు, ఫిట్‌నెస్ ట్రైనర్లు, ఉద్యోగులు, గృహిణులు, చిన్నారులు, వృద్ధులు సహా అన్ని వర్గాల ప్రజలు ఉత్సాహంగా పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. ఈ భారీ స్పందన మాకెంతో ప్రోత్సాహకరంగా ఉంది” అని డాక్టర్. పవన్ గోరుకంటి తెలిపారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)
