Homeనిజామాబాద్‌Complaint | కరెంట్ బిల్లుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. సమస్యల పరిష్కారంపై ఏదీ..!

Complaint | కరెంట్ బిల్లుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ.. సమస్యల పరిష్కారంపై ఏదీ..!

  • వసూళ్లలో వేగం.. సేవలలో శూన్యం !
  • ప్రజలకు జరిమానాలు.. అధికారులకు మినహాయింపా ..!
  • సమస్య పరిష్కరించాలని వెళ్తే… సీఎం కి చెప్తారా చెప్పుకోండి నేను ఎవరికి భయపడను
  • అంటూ రైతులపై తాడ్వాయి ట్రాన్స్ ఏఈ చిందులు ..!
  • తాడ్వాయి ట్రాన్స్‌కో అధికారుల నిర్లక్ష్యంపై భగ్గుమంటున్న ప్రజలు, రైతులు …!

తాడ్వాయి: కరెంట్ బిల్లుల వసూళ్లలో అధికారులు చూపే అత్యుత్సాహం, ప్రజలు ఎదుర్కొంటున్న విద్యుత్ సమస్యల పరిష్కారంలో ఎందుకు కనిపించడం లేదని తాడ్వాయి మండల ప్రజలు ట్రాన్స్‌కో అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లు చెల్లింపు ఒక్క రోజు ఆలస్యమైతే జరిమానాలు విధించడం, కనెక్షన్లు తొలగించడంలో నిబంధనలు గుర్తుచేసే సిబ్బంది.. క్షేత్రస్థాయిలో పనులు చేయడంలో మాత్రం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారని మండిపడుతున్నారు. “ప్రజలకో న్యాయం.. అధికారులకో న్యాయమా?” అంటూ మండల వాసులు అధికారులను నిలదీస్తున్నారు.

ప్రాణాల మీదకు తెస్తున్న నిర్లక్ష్యంComplaint

మండలంలోని పలు గ్రామాల్లో విద్యుత్ స్తంభాలు విరిగిపోయి, పక్కకు వంగి, తీగలు ప్రమాదకరంగా కిందకి వేలాడుతున్నాయి. విద్యుత్ సరఫరాలో నిరంతర అంతరాయాలు, లో-వోల్టేజ్, హై-వోల్టేజ్ హెచ్చుతగ్గులతో నిత్యం గృహోపకరణాలు కాలిపోతున్నాయి. పదుల సంఖ్యలో ఫిర్యాదులు అందుతున్నా ఉన్నతాధికారుల నుంచి కిందిస్థాయి లైన్‌మెన్ల వరకు సమస్యలు పరిష్కరించకుండా ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. సామాన్యులు, చిరువ్యాపారులపై ప్రతాపం చూపే యంత్రాంగం, ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారిన సమస్యలను మాత్రం పట్టించుకోవడంలేదని ప్రజలు విమర్శిస్తున్నారు.

- Advertisement -

సీఎం కి చెప్తారా .. ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి..నేను ఎవరికీ భయపడను. రైతులపై తాడ్వాయి ట్రాన్స్కో ఏఈ చిందులు

డీడీలు కట్టి ఏళ్లు గడుస్తున్నా తప్పని తిప్పలు..

చందాపూర్ గ్రామానికి చెందిన రైతులు వ్యవసాయ బావుల వద్ద విద్యుత్ ఒత్తిడిని తట్టుకునేందుకు అదనపు ట్రాన్స్‌ఫార్మర్ కోసం ఏళ్ల కిందటే నిబంధనల ప్రకారం డీడీలు చెల్లించారు. అయినప్పటికీ ఇప్పటివరకు ట్రాన్స్‌ఫార్మర్ మంజూరు చేయలేదు. ఈ విషయమై శనివారం స్థానిక విద్యుత్ కార్యాలయంలో ఏ ఈ కరుణాకర్ ను కలిసి తన సమస్యను పరిష్కరించాలని కోరగా అయన బాధ్యతాయుతమైన సమాధానం ఇవ్వాల్సింది పోయి, “ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి, సీఎంకు సీఎంకు చెప్తారా చెప్పుకోండి. నేను ఎవరికీ భయపడను” అంటూ రైతులపై దురుసుగా ప్రవర్తించారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు..

ఏఈ స్థాయి నుంచి లైన్‌మెన్, హెల్పర్ వరకు ఇదే తరహా బాధ్యతారాహిత్యం తాడ్వాయి మండలంలో సర్వసాధారణమైందని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని, ప్రజలపై దురుసుగా వ్యవహరిస్తూ నిర్లక్ష్యం వహిస్తున్న సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకోవాలని, మండలంలో పేరుకుపోయిన విద్యుత్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.(https://epaper.aadabhyderabad.in/), (Youtube)

- Advertisement -
RELATED ARTICLES

Latest News