- హితవు పలికిన మంత్రి పొన్నం ప్రభాకర్..
- ప్రతి వ్యక్తికీ తమ దేవతలపై విశ్వాసం ఉంటుంది..
రాజకీయ ప్రయోజనాల కోసం దేవుడి పేరును వాడుకోవడం సరికాదని, అది ఎవరికీ మేలు చేయదని తెలంగాణ రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) అన్నారు. ప్రతి వ్యక్తికి తమ తమ దేవతలపై విశ్వాసం ఉంటుందని, ఇతరుల నమ్మకాలను గౌరవించడం భారతీయ సంస్కృతిలో భాగమని ఆయన పేర్కొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలో పలు కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు.
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని పొన్నం ప్రభాకర్ (Ponnam Prabhakar) తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలను అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు. వేములవాడ రాజన్న, భద్రాద్రి రాముడు, కొండగట్టు ఆంజనేయ స్వామి సహా అన్ని ఆలయాల పట్ల తనకు గౌరవం, విశ్వాసం ఉన్నాయని చెప్పారు. వ్యక్తిగతంగా తనకు శివుడు ఆరాధ్య దైవమని ఆయన పేర్కొన్నారు. ప్రజల విశ్వాసాలను ప్రభుత్వం గౌరవిస్తుందని, రాష్ట్రవ్యాప్తంగా ఆలయాల అభివృద్ధికి కట్టుబడి ఉందని అన్నారు. (https://epaper.aadabhyderabad.in/), (Youtube)
