- DM&HO, DEO కార్యాలయాలపై అవినీతి ఆరోపణలు..
- సమాచారం ఇవ్వడంలో అధికారుల ఘోర నిర్లక్ష్యం..
నల్గొండ జిల్లాలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయాల్లో అవినీతి అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం నుండి ఈ శాఖలకు అందిన నిధుల వినియోగంలో పెద్దఎత్తున అవకతవకలు జరిగాయనే ఆరోపణల నేపథ్యంలో, అక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని తెలుసుకునేందుకు సమాచార హక్కు చట్టం, 2005 యాక్ట్ ప్రకారం సమాచారం కొరకు దరఖాస్తు చేసుకున్నప్పటికీ, సంబంధిత అధికారులు, సిబ్బంది కనీస స్పందన లేకుండా, సమాచారం ఇవ్వకుండా పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు పత్రిక ప్రకటనలో తెలిపారు.

సమాచార హక్కు చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ…
ఒకవైపు దేశంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన చట్టంగా గుర్తింపు పొందిన సమాచార హక్కు చట్టాన్ని జిల్లా అధికారులు పట్టించుకోకపోవడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దరఖాస్తు చేసినప్పటికీ, రోజుల తరబడి సమాచారం ఇవ్వకపోవడం, బాధ్యతారహితంగా ప్రవర్తించడం చూస్తుంటే, అధికారులు ఏదో దాచిపెట్టే ప్రయత్నం చేస్తున్నారనే అనుమానాలకు మరింత బలం చేకూరుతోంది. ఈ నిర్లక్ష్యం వెనుక అవినీతి జరిగిందనే ఆరోపణలు మరింత బలపడుతున్నాయి.

అధికారుల ధిమా.. అక్రమాలకు పరాకాష్ట!
జిల్లాలో ప్రభుత్వ యంత్రాంగానికి కీలకంగా వ్యవహరించాల్సిన బాధ్యత గల అధికారులు, ఇంతటి బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించడంపై జిల్లా ప్రజలు విస్మయం చెందుతున్నారు. కొందరు అధికారులు తాము “రాష్ట్ర అధ్యక్షులుగా” ఉన్నామని, మరికొందరు ఉన్నత పదవులకు ప్రమోషన్ పై వెళ్తున్నామనే ధీమా తో “సమాచార హక్కు చట్టాన్ని” ఉద్దేశపూర్వకంగా కాలరాస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ అధికారుల నిర్లక్ష్యం వెనుక దాగి ఉన్న రహస్యం జవాబులేని ప్రశ్నగా మిగిలిపోతోంది.
జిల్లా అధికారుల బాధ్యతారాహిత్యంపై జాతీయ మాల మహానాడు నేషనల్ స్టీరింగ్ కమిటీ సభ్యులు గోలి సైదులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భారతదేశ అత్యుత్తమ చట్టాలను విస్మరిస్తున్న ఈ జిల్లా అధికారులపై జిల్లా కలెక్టర్ తక్షణమే విచారణ జరిపించి, తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టం ముందు అందరూ సమానమేనని, అధికారులు చట్టాన్ని అగౌరవపరచడం సరికాదని ఆయన నొక్కి చెప్పారు.
