- ప్రతి పౌరుడు ఆర్.టి.ఐ.చట్టాన్ని వినియోగించుకొని తన హక్కులను సాధించుకోవాలి : డాక్టర్ చంటి ముదిరాజ్
సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ సహాయ కార్యదర్శిగా అన్నవరం సందీప్ రెడ్డి గారిని నియమించిన సందర్భంగా, ఆయన ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్‌లో సమావేశం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి, హాజరయ్యారు.
ఈ సందర్భంగా జాతీయ చైర్మన్ డాక్టర్ చంటి ముదిరాజ్ మాట్లాడుతూ, సమాచార హక్కు చట్టం – 2005 ప్రజలకు పారదర్శక పాలనను అందించే అత్యంత కీలకమైన చట్టమని అన్నారు. ప్రభుత్వ శాఖలు, సంస్థలు, అధికారుల పనితీరుపై ప్రజలకు సమాచారం తెలుసుకునే హక్కును ఈ చట్టం కల్పించిందని తెలిపారు.
అవినీతి, అక్రమాలు, ప్రజా ధన దుర్వినియోగం వంటి అంశాలను వెలుగులోకి తీసుకురావడంలో ఆర్.టి.ఐ. చట్టం కీలక పాత్ర పోషిస్తోందని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థ బలోపేతానికి సమాచార హక్కు చట్టం ఎంతో ఉపయోగకరమని, ప్రతి పౌరుడు ఈ చట్టంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించారు. దేశవ్యాప్తంగా సమాచార హక్కు చట్టం సాధన కమిటీ ద్వారా ప్రజలకు న్యాయ సహాయం అందించడం, ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ చేయడం, అవినీతిపై పోరాటం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేయడం జరుగుతోందని తెలిపారు.
రాష్ట్ర అధ్యక్షులు సూర స్రవంతి మాట్లాడుతూ, యువత, సామాజిక కార్యకర్తలు సమాచార హక్కు చట్టాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి అవగాహన కల్పించాలని కోరారు. సమాజంలో జవాబుదారీతనం పెంపొందించేందుకు ఆర్.టి.ఐ. చట్టం ఒక గొప్ప సాధనమని అన్నారు. నూతనంగా నియమితులైన జాతీయ సహాయ కార్యదర్శి అన్నవరం సందీప్ రెడ్డి మాట్లాడుతూ, సంస్థ లక్ష్యాల సాధన కోసం కృషి చేస్తానని, దేశవ్యాప్తంగా కమిటీల బలోపేతానికి, సమాచార హక్కు చట్టంపై అవగాహన కార్యక్రమాల నిర్వహణకు ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు.
ఈ సమావేశంలో రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షులు చింతల రాఘవేందర్ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రకాష్ పటేల్,రాష్ట్ర కార్యదర్శి అజయ్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి కార్తీక్ రెడ్డి, రాష్ట్ర కార్యదర్శి నవీన్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి, రాష్ట్ర సహాయ కార్యదర్శి అశోక్ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి అరవింద స్వామి, రాష్ట్ర సహాయ కార్యదర్శి శివ కుమార్, రాష్ట్ర సహాయ కార్యదర్శి బాపయ్య, రాష్ట్ర సహాయ కార్యదర్శి మారుతి స్వామి, ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షులు బోగంవిష్ణు, రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు ముచ్చర్ల మల్లేష్, రంగారెడ్డి జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్డేటి ప్రవీణ్, దీపక్ కులకర్ణి, సంపత్ ముదిరాజ, సుధీర్ రెడ్డి, మహేందర్ తదితరులు పాల్గొన్నారు.
