కాంగ్రెస్ హవా పెరిగేనా.. కారు జోష్ పెంచేనా… కమలం వికసించేనా?
కాంగ్రెస్ నుండి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, బీజేపీ నుండి కిషన్ రెడ్డి, బీఆర్ఎస్ నుండి మాజీ మంత్రి కేటీఆర్ ప్రచారం..
- మరో నాలుగు రోజుల్లో జరుగనున్న పోలింగ్
- సర్వశక్తులూ ఒడ్డుతున్న కాంగ్రెస్, గులాబీ, బీజేపీ
- జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో ఎవరి ధీమా వారిది..
- ప్రచారంలో ఆ మూడు పార్టీల ముఖ్యనేతలు
- గెలవడం కాంగ్రెస్, బీఆర్ఎస్లకే అవసరం
- ఓడినా గెలిచినా బీజేపీకి వచ్చే నష్టం లేదు
- గెలిచి చేసేదేమీ లేదంటున్న ప్రజలు
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక కోసం హోరాహోరీ పోరు సాగుతోంది. అతిరథ మహార థులంతా ప్రచారంలో దిగారు. కాంగ్రెస్ తరఫున సిఎం రేవంత్, మంత్రులు గల్లీగల్లీ ప్రచారం చేస్తున్నారు. కార్నర్ మీటింగ్ సవాళ్లు విసురుతున్నారు. బిఆర్ ఎస్ తరఫున కెటిఆర్ ముందు వరసలో ఉన్నారు. అనేకమంది బిఆర్ఎస్ నేతలు ఉన్నా ఆయనే ముందుండి నడుపుతున్నారు. ఇక బిజెపి నుంచి ఇద్దరు కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఎంపిలు తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. ఎవరికి వారు విమర్శలు, ప్రతి విమర్శలతో ఈ ఉప ఎన్నిక వేడెక్కింది. గెలిస్తే కాంగ్రెస్కు పరువు ఉంటుంది.
తమ పథకాలకు ప్రజలు ఆమోదిస్తున్నారని, పాలనను మెచ్చుకుంటున్నారని చెప్పుకోవచ్చు. బిఆర్ఎస్ గెలిస్తే ప్రభుత్వంపై దుమ్మెత్తి పోసే అవకాశం మరింత పెరుగుతుంది. ఎంతమంది వచ్చినా ప్రజలు తమ వెన్నంటే ఉన్నారని చెప్పుకోవచ్చు. ఇక బిజెపి గెలిస్తే నరేంద్రమోడీ ఛరిష్మా అని ప్రచారం చేసుకుంటారు. కాంగ్రెస్, బిఆర్ఎస్లపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని అంటారు. ఎన్నికల తరవాత ఇవే ప్రకటనలు కొంచెం అటుఇటుగా ఉంటాయి. పదేండ్ల కేసీఆర్ పాలనలో రాష్ట్రంలో జరిగిన అభివృద్ధిని ఓటరు మహాశయుడు మరిచిపోలేదు. రెండేండ్ల కాంగ్రెస్ పాలనలో జరిగిన దురాగతాలను కూడా గమనిస్తూనే ఉన్నాడు.
ఇక, సమయం వచ్చింది. రేవంత్ బుల్డోజర్ పాలనకు తమ సిరా చుక్కతో బుద్ధి చెప్పాలని జూబ్లీహిల్స్ ఓటర్లను బిఆర్ఎస్ కోరుతోంది. మరో నాలుగు రోజుల్లో జరుగనున్న ఉప ఎన్నికలో హస్తం పార్టీ 30వేల ఓట్ల మెజార్టీతో గెలుస్తుందని సిఎం రేవంత్ ప్రచారం చేసుకుంటున్నారు. బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటలా పిలిచే జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో దివంగత ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ హ్యాట్రిక్ విజయాలు సాధించారు. దురదృష్టవశాత్తు ఆయన అనారోగ్యంతో మరణించడంతో ఇక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. దీంతో హైదరాబాద్లోనే కాకుండా రాష్ట్రవ్యాప్తంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక ఆసక్తి రేకెత్తిస్తున్నది. ఇక మైనార్టీలు ఎక్కువగా ఉన్న జూబ్లీహిల్స్లోలో ఆ వర్గం ఓటర్లను ఆకట్టుకోవడానికి అజారుద్దీన్ క్కుఱ త్యవసరంగా మంత్రి పదవి కట్టబెట్టారు.
దీంతో వారి మద్దతు కొంత కాంగ్రెస్ సాధించిందనే చెప్పాలి. ఎంఐఎం కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వడం కలసివచ్చే అంశం. ఓటర్లు ప్రభుత్వ పాలనకు వ్యతిరేకంగా ఓటేసే అవకాశాలు ఉన్నాయని బిజెపి, బిఆర్ఎస్ ఆశగా ఉన్నాయి. ఇదే సందర్భంలో బిఆర్ఎస్ సొంత సర్వేలతో హడలెత్తించే ప్రయత్నంలో ఉంది. ప్రతి సర్వేలోనూ కారు దూసుకుపోయినట్టు ఉందని చెబుతోంది.. జూబ్లీహిల్స్ ఓటర్లలో 48 శాతం మంది కేసీఆర్ పార్టీకి మద్దతు ప్రకటించగా.. కాంగ్రెస్కు 42శాతం, బీజేపీకి 9శాతం మంది ఓటేస్తారని ముందే చెప్పుకుంటున్నారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో గులాబీ జండా ఎగురనున్నట్టు సర్వే తేల్చిందని ప్రచారం చేసుకుంటున్నారు. రేవంత్ పాలనలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా?, కేసీఆర్ పాలనలో పరిపాలన, సంక్షేమం, అభివృద్ధి బాగుందా? అనే ప్రశ్న ఇప్పుడు ఇక్కడ ఉత్పన్నం కానేకాదు. ఎందుకంటే ఇక్కడ ప్రభుత్వ అజమాయి షీయే ఉంటుంది. అధికారంలో ఉన్న పార్టీకి మాత్రమే ఉప ఎన్నికల్లో అనుకూలత ఉంటుంది. కాబట్టి కొంత అటుఇటుగా మాత్రమే మెజార్టీ ఉన్నా గెలుపు అవకాశాలు ఎక్కువగా అధికార పార్టీకి ఉంటుంది. ఇకపోతే ఇక్కడ ఎవరు గెలిచినా ప్రజలకు ఒరిగేదేమీ లేదు. ఇది ప్రజలకు కూడా బాగా తెలుసు.
