Tuesday, March 3, 2026
Homeహైదరాబాద్‌Post Office | న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

Post Office | న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలి

కేంద్ర ప్రభుత్వాన్ని కోరిన పోస్టాఫీస్ ఉద్యోగులు

సికింద్రాబాద్, జనవరి 30(ఆదాబ్ హైదరాబాద్): నగరవ్యాప్తంగా పోస్టాఫీసుల్లో పనిచేస్తున్న తమ సమస్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని పోస్ట్‌మ్యాన్(Postman), మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multitasking Staff) డిమాండ్ చేశారు. ఈ మేరకు సికింద్రాబాద్ డివిజన్ ప్రెసిడెంట్ అశోక్ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా పోస్టల్ ఎంప్లాయిస్ యూనియన్, నేషనల్ యూనియన్ ఆఫ్ పోస్టల్ ఎంప్లాయిస్, భారతీయ పోస్టల్ ఎంప్లాయిస్ అసోసియేషన్ నాయకులు ఉస్మానియా యూనివర్సిటీలోని హైదరాబాద్ హెడ్ క్వార్టర్స్ రీజియన్ ఆఫీసు ముందు పెద్దఎత్తున నిరసన చేపట్టారు.

- Advertisement -

ఈ కార్యక్రమంలో నగరవ్యాప్తంగా ఉన్న ఉద్యోగులు పాల్గొన్నారు. యూనియన్ నేతలు మాట్లాడుతూ పోస్టాఫీసుల్లో తమకు సరైన మౌలిక సదుపాయాలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని డెలివరీ సెంటర్లలో తాగునీరు, టాయిలెట్, కూర్చునే వసతిలేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందని చెప్పారు. పోస్టాఫీసుల్లో సరిపోను సిబ్బందిలేక తమపై పనిఒత్తిడి తీవ్రంగా పెరిగిందని, సిబ్బంది కొరతను వెంటనే తీర్చి తమపై పని భారం తగ్గించాలని కోరారు. లీవ్‌లో ఉన్న, ఖాళీ అయిన పోస్ట్‌మ్యాన్, ఎంటీఎస్ పోస్టులకు సబ్‌స్టిట్యూట్‌లను వెంటనే నియమించాలని కోరారు.

ఇప్పటికే పనిచేస్తున్న సబ్‌స్టిట్యూట్‌లకు వేతన బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. డైరెక్టరేట్ ఆదేశాల ప్రకారం పని సమయాలను కచ్చితంగా అమలుచేయాలన్నారు. పోస్ట్‌మ్యాన్, ఎంటీఎస్‌ల పెండింగ్ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. ఆదివారం సెలవు అయినా కూడా తమతో బలవంతంగా పనిచేయిస్తున్నారని మండిపడ్డారు. అన్యాయమైన పని భారం పెంపు విధానాలను తక్షణమే నిలిపివేయాలని అన్నారు.

తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 1000 మంది ఉద్యోగులతో ఇందిరా పార్క్ వద్ద ఉన్న ధర్నా చౌక్‌లో పెద్దఎత్తున ధర్నా చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో పీజేసీఏ నాయకులు ఎం.మధుసూదన్‌రావు, కృష్ణ, షేక్, లాల్ మియా, మొహమ్మద్, వై ప్రసాద్, శ్రీనివాసచారి, డివిజనల్ ప్రెసిడెంట్లు, కార్యదర్శులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News