- ఎర్రకోట పేలుడు బాధితులను పరామర్శించిన ప్రధాని మోడీ
- ఆస్పత్రిలో క్షతగాత్రులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించిన ప్రధాని
ఢిల్లీ పేలుడు ఘటనలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారంనాడు పరామర్శించారు. రెండ్రోజుల భూటాన్ పర్యటన ముగించుకుని వచ్చిన ప్రధాని ఆ వెంటనే లోక్ నాయక్ జయప్రకాష్ ఆసుపత్రికి వెళ్లారు. బాధితులతో నేరుగా మాట్లాడి త్వరగా కోలుకోవాలని అభిలషించారు. వైద్యులు, అధికారులతో మాట్లాడారు. బాధితుల పరిస్థితిని తెలుసుకున్నారు.
ప్రధాని రాక కోసం ఆసుపత్రి ప్రధాన ద్వారం వద్ద మీడియా వేచి ఉండటంతో ఆయన ఆసుపత్రిలో వెనుక వైపునున్న ప్రత్యేక గేటు ద్వారా లోపలకు వెళ్లారు. ఢిల్లీలో పేలుడుకు బాధ్యులైన వారిని విడిచిపెట్టే ప్రసక్తే లేదని, వారిని చట్టం ముందు ఉంచుతామని పేలుడు ఘటన అనంతరం మోదీ స్పష్టం చేశారు. ఢిల్లీ పేలుడు దుర్ఘటనలో 12 మంది ప్రాణాలు కోల్పోగా, 20 మందికి పైగా గాయపడ్డారు. ఈ ఘటనపై ఎన్ఐఏ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలో ఆసపత్రికి చేరుకున్న వెంటనే చికిత్స పొందుతున్న వారిని నేరుగా పరామర్శించారు. వారికి ధైర్యం చెప్పారు.

