ఉక్కపోత తట్టుకోలేక కెనాల్ లో ఈతకు వెళ్లి వ్యక్తి శవమై తేలిన సంఘటన జగదేవపూర్ మండల కేంద్రంలో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కర్ణాటక రాష్ట్రం, బీదర్ జిల్లాకు చెందిన ప్రకాష్ రాథోడ్ తండ్రి: విట్టల్ రాథోడ్, వయస్సు: 30 సంవత్సరాలు, కులం: లంబాడి, వృత్తి: వ్యవసాయం, తన బావలు బస్వరాజు పవార్, రామచంద్రం కలిసి తేదీ 16-04-2026 నాడు సాయంత్రం సుమారు 3 గంటల సమయంలో తమ పనిమీద బైక్‌పై హైదరాబాద్ నుండి జగదేవపూర్ మండలం, పీర్లపల్లి గ్రామంలోని కెనాల్ వద్దకు వచ్చారు.
అక్కడికి చేరుకున్న తరువాత ఎండ వేడి తట్టుకోలేక ప్రకాష్ రాథోడ్ కెనాల్‌లో ఈత కొట్టేందుకు ఒక్కడే వెళ్లాడు. కొంత సమయం గడిచిన తరువాత అతను బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన మిగతా ఇద్దరు కెనాల్ వద్దకు వెళ్లి పరిశీలించగా అతను కనిపించలేదు. చుట్టుపక్కల వెతకగా కెనాల్ ఒడ్డున అతని చెప్పులు, బట్టలు వదిలి ఉన్నట్లు గమనించారు.
ఈ విషయమై అతని బావ బస్వరాజు పవార్ జగదేవపూర్ పోలీసులకు సమాచారం అందించడంతో కేసు నమోదు చేసి, నిన్నటి నుండి కెనాల్‌లో గాలించగా, శుక్రవారం రోజున ఉదయం సుమారు 8 గంటలకు పీర్లపల్లి కెనాల్ గేట్ల వద్ద ప్రకాష్ రాథోడ్ శవం అయి కనిపించినాడు. అనంతరం మృతదేహాన్ని గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, పోస్ట్‌మార్టం నిర్వహించడం జరిగింది.
