- బీజేపీ నాయకులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి
దేశంలో సంస్కరణలు అమలు చేసే ప్రతి సందర్భంలో కాంగ్రెస్ పార్టీ అడ్డుపడుతూనే ఉందని బీజేపీ రాష్ట్ర నాయకుడు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి విమర్శించారు. ఎస్.ఐ.ఆర్ (SIR) ప్రక్రియపై కొందరు కాంగ్రెస్ నేతలు అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేస్తున్నారని, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీల ఓట్లను లక్ష్యంగా చేసుకుని బీజేపీ ఈ ప్రక్రియ చేపడుతోందని చెప్పడం హాస్యాస్పదమని అన్నారు. దేశంలో ప్రతి పౌరుడికి ఒక్కరికి ఒకే ఓటు ఉండాలనే లక్ష్యంతో అధికారులు చిత్తశుద్ధితో ఎస్.ఐ.ఆర్ ప్రక్రియను నిర్వహిస్తున్నారని తెలిపారు. ఈ ప్రక్రియ ద్వారా ఎవరి ఓటు హక్కు కోల్పోకుండా చూడడమే కేంద్ర ప్రభుత్వ ఉద్దేశమని పేర్కొన్నారు.
ఇది కొత్తగా చేపట్టిన కార్యక్రమం కాదని, గతంలోనూ దేశవ్యాప్తంగా అనేకసార్లు నిర్వహించారని స్పష్టం చేశారు. భారతదేశాన్ని కులాలు, మతాల పేరుతో విభజించిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదేనని విక్రమ్ రెడ్డి ఆరోపించారు. ఎస్.ఐ.ఆర్ వల్ల మైనార్టీలు, ఎస్సీలు, ఎస్టీలకు ఏ విధంగా అన్యాయం జరుగుతుందో కాంగ్రెస్ నాయకులు ప్రజలకు వివరించాలని ప్రశ్నించారు. దశాబ్దాలుగా ఆయా వర్గాల జీవన పరిస్థితుల్లో మార్పు తీసుకురాకుండా వారిని కేవలం ఓటు బ్యాంకుగా మాత్రమే ఉపయోగించుకుంటున్నారని కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించారు.
తెలంగాణలో అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ అమలు చేయలేని అనేక హామీలు ఇచ్చిందని, అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో ఒక్క హామీని కూడా పూర్తిగా నెరవేర్చలేదని ఆరోపించారు. రాష్ట్ర అభివృద్ధిని పక్కనపెట్టి కాంగ్రెస్ అంతర్గత వర్గపోరాటాలకే పరిమితమైందని ఎద్దేవా చేశారు. తెలంగాణలో బీజేపీ రోజురోజుకూ బలపడుతుండటంతో కాంగ్రెస్ భయాందోళనకు గురైందని, అందుకే ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వర్గాల్లో అపోహలు సృష్టించే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు ఇలాంటి వ్యాఖ్యలను మానుకోవాలని హెచ్చరించారు. రానున్న రోజుల్లో తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావడం ఖాయమని పట్లోళ్ల విక్రమ్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు.
