- బ్రేవ్ సి ఎఫ్ 107 ఈవెంట్ లో అద్భుత విజయం..
- బల్గెరియా ఫైటర్ ను మట్టికరిపించిన కాశ్మీర్ యువకుడు..
అంతర్జాతీయ మిక్స్డ్ మార్షల్ ఆర్ట్స్ యవనికపై ఓ భారతీయ యువకుడు సంచలనం సృష్టించాడు. జమ్మూ కశ్మీర్‌కు చెందిన ఓవైస్ యాకూబ్, బల్గేరియాలో జరిగిన ప్రతిష్ఠాత్మక బ్రేవ్ సీఎఫ్ 107 ఈవెంట్లో అద్భుత విజయాన్ని నమోదు చేశాడు. ఇప్పటివరకు ఓటమి ఎరుగని, రెండుసార్లు ప్రపంచ ఛాంపియన్‌గా నిలిచిన బల్గేరియా ఫైటర్ డెల్యన్ జార్జివ్ను మట్టికరిపించి చరిత్ర సృష్టించాడు. ఈ విజయం పట్ల జమ్మూ కశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా హర్షం వ్యక్తం చేస్తూ ఓవైస్కు అభినందనలు తెలిపారు.
ఒమర్ అబ్దుల్లా కార్యాలయం ‘ఎక్స్’ వేదికగా ఈ విషయాన్ని వెల్లడించింది. “బల్గేరియాలో అజేయ ప్రపంచ ఛాంపియన్‌ను ఓడించి అద్భుత విజయం సాధించిన జమ్మూ కశ్మీర్ ఎంఎంఏ ఫైటర్ ఓవైస్ యాకూబ్‌కు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. ఇది జమ్మూ కశ్మీర్‌తో పాటు దేశానికే గర్వకారణం. భవిష్యత్తులోనూ అతను మరిన్ని విజయాలు సాధించి, అంతర్జాతీయ వేదికపై దేశ కీర్తిని ఇనుమడింపజేయాలని ఆకాంక్షించారు” అని పేర్కొంది.
ఆగస్టు 1న బల్గేరియాలోని బుర్గాస్ ఎరీనాలో జరిగిన ఈ పోరులో ఓవైస్ పూర్తి ఆధిపత్యం ప్రదర్శించాడు. మొదటి రౌండ్ ప్రారంభమైన కేవలం 4 నిమిషాల్లోనే టెక్నికల్ నాకౌట్ (టీకేఓ) ద్వారా డెల్యన్ జార్జివ్ను ఓడించి తన కెరీర్లో చిరస్మరణీయ విజయాన్ని అందుకున్నాడు. ఈ ఓటమితో జార్జివ్ కెరీర్లో తొలి పరాజయం నమోదైంది. దక్షిణ కశ్మీర్‌లోని పుల్వామా జిల్లా మురాన్ గ్రామానికి చెందిన ఓవైస్, ఈ పోరులో అద్భుతమైన నిలకడ, పట్టుదల, సాంకేతిక నైపుణ్యాన్ని ప్రదర్శించి అందరి మన్ననలు పొందాడు.
