- ఇక నో ప్రాబ్లెమ్ ఇవి తినండి..
భోజనం చేసిన తర్వాత కడుపు ఉబ్బరం, గ్యాస్, అసిడిటీ, భారంగా అనిపించడం వంటి సమస్యలు చాలా మందిని వేధిస్తుంటాయి. ముఖ్యంగా ఆయిల్ ఎక్కువగా ఉన్న ఆహారం లేదా భారమైన భోజనం చేసినప్పుడు జీర్ణక్రియ నెమ్మదిగా మారుతుంది. ఇలాంటి సమస్యలకు సహజసిద్ధమైన పరిష్కారంగా సోంపు, వాము, జీలకర్ర గింజలను నమలాలని నిపుణులు సూచిస్తున్నారు. సరైన మోతాదులో ఈ గింజలను తీసుకుంటే జీర్ణక్రియ మెరుగుపడటంతోపాటు పొట్ట అసౌకర్యాలు తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. భోజనం తర్వాత ఈ మూడు గింజలను నమలడం భారతీయ సంప్రదాయంలో చాలా కాలంగా ఉంది.
అయితే దీనికి శాస్త్రీయ కారణాలూ ఉన్నాయని ఆరోగ్య నిపుణులు వివరిస్తున్నారు. గింజలను నెమ్మదిగా నమలడం వల్ల వాటిలోని సహజసిద్ధమైన సంయోగాలు లాలాజలంతో కలిసి శరీరంలోకి చేరి జీర్ణక్రియను వేగవంతం చేస్తాయని చెబుతున్నారు. వాము గింజలు ముఖ్యంగా అజీర్తి, అసిడిటీ, భారంగా అనిపించే వారికి ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. వాములో ఉండే థైమాల్ అనే సంయోగం గ్యాస్ట్రిక్ ఎంజైమ్‌ల విడుదలను పెంచి ఆహారం త్వరగా జీర్ణమయ్యేలా చేస్తుంది.
ఆయిల్ ఎక్కువగా ఉన్న భోజనం చేసిన తర్వాత వాము తీసుకోవడం వల్ల గ్యాస్, కడుపు అసౌకర్యం తగ్గే అవకాశం ఉందని చెబుతున్నారు. జీలకర్ర గింజలు జీర్ణక్రియ సామర్థ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి ప్యాంక్రియాస్ నుంచి జీర్ణ ఎంజైమ్‌ల విడుదలను ప్రేరేపించి పోషకాలు శరీరానికి సులభంగా అందేలా చేస్తాయి. అలాగే పేగుల్లో ఇన్‌ఫ్లమేషన్ (వాపు)ను తగ్గించి మలబద్ధకం సమస్యను కూడా నియంత్రించడంలో సహాయపడతాయి. జీలకర్రను స్వల్పంగా వేయించి తీసుకుంటే మరింత ప్రయోజనం ఉంటుందని పరిశోధనలు సూచిస్తున్నాయి.
