Monday, June 1, 2026
Homeభక్తిMata Hanuman | స్త్రీ రూపంలో హనుమంతుడు..

Mata Hanuman | స్త్రీ రూపంలో హనుమంతుడు..

  • ఛత్తీస్​గఢ్​లోని రత్​నపూర్​లో వెలసిన ఆలయం..

హనుమంతుడు అద్వితీయ శక్తికి, అచంచల భక్తికి తార్కాణం. వినయానికి, అభయానికి నిలువుటద్దం. అబ్బురపరిచే ఆయన గుణగణాలు మానవాళికి మార్గదర్శకాలు. రామబంటు తత్వం అద్భుతం, ఆదర్శప్రాయం. అంతేకాక అష్టసిద్ధులకు అధిపతి. నవ వ్యాకరణాలను పఠించిన ఈశ్వర సంభూతుడు కూడా. అభయాంజనేయుడిగా, కార్యసిద్ధుడిగా కొలిచే ఈ రామబంటుకు ఊరూరా క్షేత్రాలే.

వ్యాసతీర్థులు మధ్వమత సిద్ధాంతకర్తతో పాటు పవనసుతుడి భక్తుడు. ఈయన భారతదేశంలో దాదాపు 732 హనుమంతుడి విగ్రహాలను ప్రతిష్ఠించారు. వాటిల్లో ఒకటి కర్ణాటకలోని హంపిలో ఆంజనేయ పర్వతంపైన తుంగభద్రానదీ తీరంలో ఉన్న యంత్రోద్ధారక హనుమాన్‌ మందిర్‌. ఈ దేవాలయంలో స్వామి స్వయంభువుగా షట్‌యంత్రంలో కొలువుదీరిన వైనం ఆసక్తికరం. వ్యాసతీర్థులు ఈ ప్రాంతంలో తపస్సు చేసేటప్పుడు ఇక్కడున్న బండరాయిపైన ఆంజనేయుడి చిత్రాన్ని గీసి పూజించేవారట.

- Advertisement -

విచిత్రంగా పూజ ముగిసిన వెంటనే ఆ చిత్రం మాయమైందట. ఇలా పన్నెండు రోజులయ్యాక వ్యాసతీర్థులు షట్‌కోణాన్ని గీసి, అందులో హనుమంతుడి రూపాన్ని చిత్రించి పూజించారు. దీనితో అది అదృశ్యం కాలేదట. అప్పటినుంచీ ఆంజనేయుడు యంత్రోద్ధారక మూర్తిగా ధ్యానముద్రలో పూజలు అందుకుంటున్నాడని ప్రతీతి.

ఆంజనేయుడు ఆజన్మ బ్రహ్మచారి. కానీ ఈ పవనసుతుడిని స్త్రీ రూపంలో అలంకరించి, మాతా హనుమాన్‌గా పూజించే ఆలయం ఛత్తీస్​గఢ్​లోని రత్​నపూర్​లో ఉంది. ఇక్కడ గిరిజాబంధ్ హనుమాన్ క్షేత్రంలో స్వామి వారు స్త్రీ రూపంలో భక్తులకు దర్శనమిస్తారు. దీనికి వెనుక ఓ చరిత్ర దాగి ఉంది. ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించిన పృథ్విదేవ్‌జు అనే రాజు కుష్ఠువ్యాధి బాధితుడు. స్వస్థత కోసం ఆంజనేయుడిని పూజించాడు.

కొన్ని రోజుల తర్వాత పృథ్విదేవ్​జుకు స్వామి కలలో కనిపించి, తన విగ్రహం ఉన్న ప్రాంతం ఉనికిని తెలియజేసి దేవాలయాన్ని నిర్మించమన్నాడట. రాజు సైన్యంతో వెళ్లి వెతికితే స్త్రీరూపంలో ఉన్న వానరవీరుడి మూర్తి కనిపించిందట. ఆ విగ్రహాన్నే ప్రతిష్ఠించడంతో నేటికీ ఈ సదా బ్రహ్మచారి స్త్రీ రూపంలోనే దర్శనమిస్తున్నాడు. మూలమూర్తికి ముక్కుపుడక, కుంకుమ, కొంగు తదితర అలంకరణలు చేసి శక్తిస్వరూపిణిగా కొలుస్తారు. స్వామి భుజాలపైన రామలక్ష్మణులు ఉంటారు.

- Advertisement -
RELATED ARTICLES

Latest News