స్త్రీకి వెలకట్టలేని వరం అమ్మతనం
అమ్మతనమే ఆమెకు పూర్ణత్వం
ప్రసవంతో చనుబాల చెలిమెలు
బిడ్డ రక్షణకు పాలు పంచుకోవడం !
అప్పుడే పుట్టిన శిశువు ఏడిస్తే..
ప్రసవ నొప్పులు మరిచిపోయి..
కడుపు నిండా నవ్వుతుంది అమ్మ
ఆపైన బిడ్డ ఏడిస్తే తల్లడిల్లుతుంది !
ప్రేమ మమకారాల మాతృత్వం
అమ్మ కాని అతివ జన్మ పాక్షికం
తల్లి హృదయం నిండా త్యాగం
అమ్మ అయిన స్త్రీ పరిపూర్ణవతి !
పునర్జన్మతో స్త్రీ గుండె ఉప్పొంగు
నవమాసాల ప్రయాస ప్రయాణం
చిట్టి ప్రాణి అంటే ఆమెకు ప్రాణం
అనురాగ బంధాల సమాహారం !
అమ్మ ఒడి స్వర్గలోకం గుడి
అమ్మ చేయి అమృత నిధి
అమ్మ చూపు శీతల పవనం
అమ్మ మనసు ప్రేమాలయం !
అమ్మ ఏకైక లక్ష్యం బిడ్డ ఆరోగ్యం
సంతాన సమృద్ధే తల్లి తత్వం
ఆది గురువును చేసేది అమ్మతనం
సహనానికి మారుపేరు మాతృత్వం !
అమ్మ ప్రేమ పొందని బిడ్డ లేడు
బిడ్డే ప్రాణమని తలవని తల్లి లేదు
తల్లి బిడ్డల బంధం పరమ పవిత్రం
లోకంలో అద్వితీయం పేగుబంధం !
