Saturday, April 25, 2026
Homeఆదాబ్ ప్రత్యేకంScam | పేరుకే లీగల్.. పేరుకుపోయిన ఇల్లీగల్

Scam | పేరుకే లీగల్.. పేరుకుపోయిన ఇల్లీగల్

  • అవినీతికి పట్టాభిషేకం.. నిరుద్యోగులకు పంగనామం
  • లీగల్ మెట్రోలాజీలో అక్రమ వ్యవహారాలు..
  • సర్వీస్ రూల్స్ లేవు.. అర్హత లేకున్నా పదోన్నతులే!
  • తప్పుడు లెక్కలు.. అక్రమాలకు అడ్డులేదు!
  • ‘తూకం తప్పుతున్న లీగల్ మెట్రోలాజి శాఖ..

సస్పెండ్ అయిన ఉద్యోగి కనీసం 2 ఏళ్ల వరకు సర్వీసులో ఉండకూడదని నిబంధనలున్నా, కేవలం 9 నెలల్లోనే పదోన్నతి..!

వినియోగదారుల ప్రయోజనాలను కాపాడాల్సిన లీగల్ మెట్రోలాజి (తూనికలు కొలతలు) శాఖలో నిబంధనలు గాలికొదిలేశారా ?. 2014లో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుండి నేటి వరకు కనీసం ‘సర్వీస్ రూల్స్’ కూడా రూపొందించకపోవడం వల్ల అటు నిరుద్యోగ యువతకు, ఇటు నిజాయితీ గల ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరుగుతోంది. ఈ శాఖలో జరుగుతున్న అక్రమాలపై ‘ఆదాబ్ హైదరాబాద’ అందిస్తున్న ‘ప్రత్యేక కథనాలు’..

- Advertisement -

సర్వీస్ రూల్స్ లేవు.. నియామకాలు ఆగిపోయాయి!

లీగల్ మెట్రోలాజి శాఖలో ఖాళీలను గుర్తించిన ప్రభుత్వం, వాటిని ప్రత్యక్ష నియామక పద్ధతిలో భర్తీ చేయాలని టీఎస్‌పీఎస్సీని ఆదేశించింది. అయితే, ఈ నియామకాలు చేపట్టడానికి సర్వీస్ రూల్స్ కావాలని టీఎస్‌పీఎస్సీ కోరింది. సర్వీస్ రూల్స్ అందుబాటులో లేకపోవడం వల్ల లీగల్ మెట్రో లాజి పోస్టుల భర్తీ ప్రక్రియ నిలిచిపోయింది. దీనివల్ల అర్హులైన నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను కోల్పోతూ తీవ్రంగా నష్టపోతున్నారు.

రాష్ట్ర విభజన తర్వాత 36 నెలల్లోగా సర్వీస్ రూల్స్ రూపొందిం చాలని ప్రభుత్వం గడువు విధించినప్పటికీ, లీగల్ మెట్రోలాజి శాఖ నేటికీ ఆ పని పూర్తి చేయలేదు. దీని ఫలితంగా: తీ.ఎస్. పీ.ఎస్.సి.ద్వారా భర్తీ చేయాల్సిన 19 అసిస్టెంట్ కంట్రోలర్ పోస్టుల నియామకం ఆగిపోయింది. అర్హులైన నిరుద్యోగ యువత ఉపాధి అవకాశాలను కోల్పోతున్నారు. నిబంధనల ప్రకారం కాకుండా, తమకు నచ్చిన వారికి పదోన్నతులు కల్పించడానికి ఈ పరిస్థితిని అడ్డం పెట్టుకుంటున్నారు.

ఫిజిక్స్ డిగ్రీ లేదు.. కానీ ఇన్‌స్పెక్టర్ పదవి ఖాయం!

జి.ఓ. నం. 579, 673 (1980) ప్రకారం, ఇన్‌స్పెక్టర్ పోస్టుకు ప్రమోషన్ పొందాలంటే భౌతిక శాస్త్రం ఒక సబ్జెక్టుగా కలిగిన సైన్స్ డిగ్రీ తప్పనిసరి. కానీ, శాఖలో విడ్డూరమైన నిర్ణయాలు అమలవుతున్నాయి.. బి.ఎ., బి.కామ్ చదివిన వారికి కూడా రూల్స్ కు విరుద్ధంగా ఇన్‌స్పెక్టర్లుగా పదోన్నతులు కల్పించారని తెలుస్తోంది..

ఢిల్లీలోని కేంద్ర ప్రభుత్వ కార్యాలయానికి తప్పుడు సమాచారం పంపి, అర్హత లేని వారికి శిక్షణ కోసం అనుమతులు కోరారు. అర్హత లేని కారణంగా రాంచీలోని ‘ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ లీగల్ మెట్రోలాజి’ వారిని శిక్షణకు అనుమతించకుండా తిరస్కరించింది.
గత ఆగస్టు 18, 2025న రఘువీర్ సింగ్, బి. భార్గవి, వెంకటయ్య, ప్రవీణ్ కుమార్ లకు పదోన్నతులు కల్పించారు. కాగా, నిబంధనల ప్రకారం వెంకటయ్య మినహా మిగిలిన నలుగురు సిబ్బందికి పదోన్నతికి కావాల్సిన అర్హతలు లేవని సమాచారం.

ఏసీబీకి చిక్కినా.. 40 రోజులు జైలుకు వెళ్ళినా పదోన్నతే!

గత సంవత్సరం మార్చి 21 2025 నాడు రంగారెడ్డి జిల్లా లీగల్ మెట్రోలాజి విభాగంలో జిల్లా ఇన్ స్పెక్టరుగా పనిచేస్తున్న సింగబోయిన ఉమారాణి, సీనియర్ టెక్నికల్ అసిస్టెంట్ డి. మల్లేశం మధ్యవర్తిత్వంతో ఫిర్యాదుదారుడి నుంచి రూ. 10,000 లంచం తీసుకుంటుండగా ఏసీబీకి రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డారు..

“సిగ్గా.. శరమా.. జీడిగింజా అంటే నల్లటి దానికి నాకేం సిగ్గు” అన్నదట నిండా మునిగినంక సలెక్కడిది అన్నట్టు ఒక్క తప్పు చేసినా తప్పే వంద తప్పులు చేసినా తప్పే.. ఇంకేముంది తప్పులకు లైసెన్సు పొందినట్టు ఉమారాణి ని తూనికలు కొలతల శాఖలో ఈమెకే పదోన్నతి కలిపించి తప్పుల మీద తప్పులు చేయిస్తున్నారనేది ఎవరికైనా సందేహం రాని అంశం. శాఖలో అవినీతి ఏ స్థాయిలో ఉందో చెప్పడానికి అసిస్టెంట్ కంట్రోలర్ ఉమారాణి ఉదంతమే సాక్ష్యం.

ఏసీబీ ట్రాప్ :

లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడ్ హ్యాండెడ్‌గా చిక్కి 40 రోజులు రిమాండ్‌లో ఉన్నారు (ఖీI= చీశీ.: 07/్పు=T-్పు=-2/2024)..

నియమాల ఉల్లంఘన :

సస్పెండ్ అయిన ఉద్యోగి కనీసం 2 ఏళ్ల వరకు సర్వీసులో ఉండకూడదని నిబంధనలు ఉన్నా, కేవలం 9 నెలల్లోనే ఆమెకు పదోన్నతి కల్పించారు.

అధికార దుర్వినియోగం :

క్షేత్రస్థాయి విధులకు బదులుగా హెడ్ ఆఫీస్ పనుల్లో జోక్యం చేసుకుంటూ అధికారులను తప్పుదోవ పట్టిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అమ్మగారు తన విధులు పై అధికారికి రిపోర్ట్ చేయకుండా బైపాస్ చేస్తూ తానే ఫైనల్ అంటూ కంట్రోలర్ కి కూడా బుకాయిస్తూ డైరెక్ట్ గా ఫైల్స్ ని పంపిస్తుంది. ప్రతి ఏటా ఉద్యోగుల పనితీరుకు ప్రామాణికంగా ఉండాల్సిన తన ‘పర్ఫార్మెన్స్ అప్రైసల’ నివేదికలు కూడా లేకుండా, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సర్వాధికారిలా (ఓజీ)గా చలామణి అవుతున్నారు.

ప్రజా ప్రయోజనాలు ఏమైపోవాలి?

అధికారుల ఈ నిర్లక్ష్యం వల్ల సామాన్యులు తీవ్రంగా నష్ట పోతున్నారు.. ఉద్యోగుల కొరతవల్ల ఈ పరిణామం తలెత్తుతోంది..

ధాన్యం సేకరణ :

ఐకెపి సెంటర్లలో తక్కువ తూకాలు వేస్తూ రైతులను మోసం చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు.

తనిఖీల గైర్హాజరు :

వేబ్రిడ్జిలు, పెట్రోల్ బంకుల పర్యవేక్షణ కుంటుబడింది. ఫ్లయింగ్ స్క్వాడ్ యÖనిట్ల పనితీరు రిపోర్టుల నుండి మాయం అవుతోంది.
అక్రమ వసూళ్లు :

కరీంనగర్ వంటి ప్రాంతాల్లో షాపింగ్ మాల్స్ నుండి లక్షలాది రూపాయలు వసూలు చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయి.

ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించాలి!

ఉన్నతాధికారుల అండదండలతో సాగుతున్న ఈ అక్రమాలను అరికట్టాలి. తక్షణమే సర్వీస్ రూల్స్ రూపొందించి, నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చిన ప్రమోషన్లను రద్దు చేయాలి. నిజాయితీ గల పాలనను అందిస్తామని చెబుతున్న ప్రభుత్వం, లీగల్ మెట్రోలాజి శాఖలో జరుగుతున్న ఈ చీకటి బేరాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలి. దీనిపై ప్రస్తుత శాఖ కంట్రోలర్ గా విధులు నిర్వహిస్తున్న స్టీఫెన్ రవీంద్ర తనకున్న అదనపు శాఖల బాధ్యతల కారణంగా ప్రతీక దృష్టి పెట్టలేకపోతున్నారా..?

ఈ శాఖకు ఒక ప్రత్యేక ఐఏఎస్ అధికారి ఉండాలనేది విశ్లేషకులు సూచిస్తున్నారు.. అదే విధంగా సంబంధిత మంత్రి అయిన ఉత్తమ్ కుమార్ రెడ్డి ఈ శాఖపై దృష్టిపెట్టి ప్రక్షాళన దిశగా చర్యలు తీసుకుని, శాఖలో పేరుకుపోయిన అవినీతిని, అక్రమార్కులపై కొరడా ఝళిపించకపోతే ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురై, అసంతృప్తితో ఆగ్రహావేశాలకు గురయ్యే ప్రమాదం ఉంది..

- Advertisement -
RELATED ARTICLES

Latest News