- ప్రభుత్వ భూమిలో ఇళ్ల నిర్మాణాలు.. ఇంటి నంబర్లు సైతం వారే వేసుకున్న వైనం!
- సొంత స్థలాల్లో ఇళ్లు కూల్చే అధికారులకు ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు కనిపించడం లేదా…?
- నిద్రావస్థలో మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు….?
జగిత్యాల: జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని బిలాల్పురా ప్రాంతంలో సర్వే నంబర్ 1245లో ప్రభుత్వ భూమి ఆక్రమణకు(Encroachment) గురవుతోందన్న ఆరోపణలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. ప్రభుత్వ స్థలంలో యథేచ్ఛగా నిర్మాణాలు చేపడుతున్నారని, ఇళ్ల నిర్మాణాలు పూర్తిచేసుకుని ఇంటి నంబర్లు సైతం వారే వేసుకున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ప్రభుత్వ భూములను కాపాడాల్సిన బాధ్యత సంబంధిత అధికారులపై ఉన్నప్పటికీ, అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయని ఆరోపణలు వస్తున్నా పట్టించుకోకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు సాగుతుంటే మున్సిపల్ టౌన్ ప్లానింగ్ అధికారులు ఏం చేస్తున్నారనే ప్రశ్నలు పట్టణ ప్రజల్లో వ్యక్తమవుతున్నాయి.
సొంత స్థలాల్లో నిర్మాణాలు చేపట్టిన పేదల ఇళ్లను కూల్చివేసే అధికారులు.. ప్రభుత్వ భూమిలో నిర్మాణాలు చేపడుతున్న వారిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు సామాన్యులకు ఒకలా, ప్రభుత్వ భూమిని ఆక్రమిస్తున్న వారికి మరోలా ఉంటాయా? అనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

ఇంటి నంబర్లు కేటాయించడంలోనూ, నిర్మాణాల అనుమతుల విషయంలోనూ అధికారులు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టాల్సిన అవసరం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. ఇంటి నంబర్లు ఉన్నంత మాత్రాన భూమిపై హక్కు నిర్ధారణ కాదని, ప్రభుత్వ భూమి స్థితిగతులను రెవెన్యూ రికార్డుల ఆధారంగా తేల్చాలని కోరుతున్నారు.
ఇప్పటికైనా రెవెన్యూ, మున్సిపల్ అధికారులు సంయుక్తంగా సర్వే నంబర్ 1245లో క్షేత్రస్థాయి విచారణ చేపట్టి, భూమి హద్దులను నిర్ధారించి, ప్రభుత్వ భూమి ఆక్రమణకు(Encroachment) గురైనట్లు తేలితే బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులే మౌనంగా ఉంటే.. ప్రజల ఆస్తులకు రక్షణ ఎక్కడ…?అనే ప్రశ్న ప్రజలలో మొదలైతుంది… ఇప్పటికైనా అధికారులు మేలుకొన్ని ఆ సర్వే 1245 లో అక్రమ నిర్మాణాలు ఆపుతారా….? వేచి చూడాలి..(https://epaper.aadabhyderabad.in/)(Youtube)
