- త్వరలోనే ఒక కీలక ప్రకటన చేస్తాను..
- తీవ్ర చర్చనీయాంశంగా మారిన కొండా వ్యాఖ్యలు..
మంత్రి వర్గం నుంచి బర్తరఫ్ అయిన తర్వాత కొండా సురేఖ (Konda Surekha) ఎట్టకేలకు తన మౌనాన్ని వీడారు. త్వరలోనే ఓ కీలక నిర్ణయం ప్రకటిస్తానని సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు. “నిరీక్షణ ముగిసింది.. త్వరలో కీలక నిర్ణయాన్ని ప్రకటిస్తా” అని ఆమె చేసిన పోస్ట్ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. సురేఖ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మరోవైపు, తన తల్లిని మంత్రి పదవి నుంచి తొలగించడంపై కొండా సురేఖ కుమార్తె సుస్మిత తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి దమ్ముంటే తన తల్లిపై పోటీ చేసి గెలవాలని సవాల్ విసిరారు. తాను రేవంత్ రెడ్డి కుటుంబ అవినీతి గురించి వ్యక్తిగతంగా మాట్లాడానని, అంతమాత్రానికే తన తల్లిపై వేటు వేయడం సరికాదని సుస్మిత అన్నారు. తన వ్యాఖ్యలకు, పార్టీకి ఎలాంటి సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. “నా తల్లిని ఇలా చూడటం బాధగా ఉంది. ఈ విషయంలో నేను రేవంత్ రెడ్డిని శపిస్తున్నాను” అని సుస్మిత ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే సమయంలో సురేఖ భర్త కొండా మురళి మీసాలు మెలివేయడం వంటి పరిణామాలు.. కొండా ఫ్యామిలీ ‘ప్లాన్ బీ’ ఏమై ఉంటుందనే ఉత్కంఠను మరింత పెంచుతున్నాయి. మొత్తం మీద ఈ పరిణామాలు రాష్ట్ర రాజకీయాలను వేడెక్కిస్తున్నాయి.
