- కోటిచెరువును పవన్ కళ్యాణ్ కబ్జా చేశాడు..
- తిరిగి ఇవ్వకపోతే తీవ్ర పరిణామాలుంటాయి..
- ఘాటుగా హెచ్చరించిన టి.ఆర్.ఎస్. కవిత..
తెలంగాణ రాజకీయాల్లో భూకబ్జాల వ్యవహారం ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వర్సెస్ కవితగా మారి సరికొత్త వివాదానికి తెరలేపింది. హైదరాబాద్‌లోని ‘కోటిచెరువు’ శిఖం భూమిని పవన్ కల్యాణ్ కబ్జా చేశారంటూ టీఆర్ఎస్ చీఫ్ కల్వకుంట్ల కవిత సంచలన ఆరోపణలు చేశారు. జూబ్లీహిల్స్‌లోని పార్టీ ఆఫీస్‌లో జరిగిన ప్రెస్ మీట్‌లో ఆమె మాట్లాడుతూ.. పవన్ గనుక ఆ భూమిని ఆక్రమించలేదని చెప్తే, వెంటనే ఆ స్థలాన్ని తెలంగాణ ప్రభుత్వానికి అప్పగించి, అక్కడి నిర్మాణాలను, మట్టిని తొలగించాలని డిమాండ్ చేశారు.
నీటిపారుదల శాఖ రికార్డుల ప్రకారం ఆ 10 ఎకరాల భూమి పూర్తిగా ‘శిఖం’ (ప్రభుత్వ) భూమి అని కవిత స్పష్టం చేశారు. కానీ రిజిస్ట్రేషన్ సమయంలో కేవలం 3 ఎకరాలను మాత్రమే శిఖం భూమిగా చూపి, మిగిలిన 7 ఎకరాలను ‘మాగాణి’ (ప్రైవేట్) భూమిగా మార్చేశారని.. ఇది స్పష్టమైన నిబంధనల ఉల్లంఘనే అని ఆమె ఎండగట్టారు. ఇటీవల పవన్ చేసిన “తెలంగాణ మీ అబ్బ సొత్తా.. మీ జాగీరా?” అనే వ్యాఖ్యలపై కవిత అత్యంత ఘాటుగా స్పందించారు.
“అవును, ఇది కచ్చితంగా మా జాగీరే! 1,200 మంది అమరవీరుల త్యాగాల పునాదుల మీద ఏర్పడిన తెలంగాణ ఇది. ఇది తెలంగాణ ప్రజల సొత్తు, ఎవరి ముత్తాతలదో కాదు” అని కవిత ప్రతిస్పందించారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజధానిని కూడా నిర్మించలేకపోయిన పవన్.. ఇప్పుడు తెలంగాణలో కేవలం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ఆరోపించారు. తెలంగాణలో బీజేపీకి సరైన స్థానిక నాయకులు లేకపోవడం వల్లే పవన్‌ను వాడుకుంటున్నారని విమర్శించారు.
