- ఇద్దరూ కలిసి తెలంగాణను దోచుకుంటున్నారు..
- బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు ఫైర్.
తెలంగాణ సమాజాన్ని, నిరుద్యోగ యువతను దగా చేయడంలో కాంగ్రెస్, బీ.ఆర్.ఎస్. పార్టీలు ఒకే నాణేనికి ఉన్న బొమ్మాబొరుసు లాంటివని బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాసం వెంకటేశ్వర్లు తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ రెండు పార్టీలు “దొంగలు దొంగలు ఊర్లు పంచుకున్నట్లు” రాష్ట్ర సంపదను దోచుకుంటూ ప్రజలను పూర్తి స్థాయిలో మోసం చేస్తున్నాయని విమర్శించారు బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాశం వెంకటేశ్వర్లు.. పదేళ్ల పాలనలో నిరుద్యోగులను నట్టేట ముంచిన బీ.ఆర్.ఎస్., కేటీఆర్, ఇవాళ ఏ మొహం పెట్టుకొని సరూర్‌నగర్‌లో ‘నిరుద్యోగ సంగ్రామ సభ’ పెడుతున్నారని ఆయన ప్రశ్నించారు.
ఇది నిరుద్యోగుల కోసం పెట్టిన సభ కాదని, బీ.ఆర్.ఎస్. నాయకుల ఉద్యోగాలు పోయి, వాళ్ల కుటుంబాలు నిరుద్యోగ పాలవ్వడంతో.. మళ్లీ అధికారం ఎలా సంపాదించాలనే స్వార్థంతో పెట్టిన సభ మాత్రమేనని స్పష్టం చేశారు. “ఇంటికో ఉద్యోగం”, “కేజీ టు పీజీ ఉచిత విద్య”, “దళితుడే ముఖ్యమంత్రి” అంటూ నమ్మించి మోసం చేసిన ఘనత బీ.ఆర్.ఎస్.ది కాదా అని నిలదీశారు.
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ నాయకులు శ్రీధర్ రెడ్డి, బీజేపీ అధికార ప్రతినిధి డాక్టర్ ఇంద్రసేనారెడ్డి, బీజేపీ రాష్ట్ర నాయకులు విక్రమ్ రెడ్డి, బీజేపీ మీడియా ప్యానలిస్ట్ మహేష్ నామానీ, ఓయూ జేఏసీ కన్వీనర్ సురేష్ యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా కాసం మాట్లాడుతూ..ఉస్మానియా, కాకతీయ విశ్వవిద్యాలయాలను నిర్బంధ శిబిరాలుగా మార్చి, విద్యార్థులను టార్చర్ పెట్టిన కేసీఆర్, కేటీఆర్ ఇవాళ నిరుద్యోగుల గురించి మాట్లాడటం హాస్యాస్పదమన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో 76 శాతం అసిస్టెంట్ ప్రొఫెసర్, నాన్-టీచింగ్ పోస్టులను ఖాళీగా పెట్టి, యూనివర్సిటీలను అంధకారంలోకి నెట్టారని ఆరోపించారు. కేవలం పోలీస్ కానిస్టేబుళ్లు, ఉపాధ్యాయ పోస్టులు మినహా మరే ఇతర నియామకాలు చేపట్టలేదన్నారు.
గ్రూప్-1 పేపర్‌ను మూడుసార్లు లీక్ చేసి, పరీక్షలను వాయిదా వేస్తూ యువత జీవితాలతో ఆడుకున్నారని దుయ్యబట్టారు. 35 లక్షల మంది యువకులు ఉద్యోగాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకుంటే, కనీసం నిరుద్యోగ భృతి ఇవ్వకుండా.. “నిరుద్యోగి అంటే ఎవరో డిఫైన్ చేయలేదు” అంటూ అసెంబ్లీ సాక్షిగా కేటీఆర్ సిగ్గులేకుండా మాట్లాడారని గుర్తుచేశారు.
విఆర్ఓ వ్యవస్థను రద్దు చేసి 178 మంది ఆత్మహత్యలకు, 104 అంబులెన్స్ ఉద్యోగుల తొలగింపునకు, జీవో 46, జీవో 317 లతో ఉద్యోగుల ఇబ్బందులకు బీ.ఆర్.ఎస్. ప్రభుత్వమే కారణమన్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి సునీల్ నాయక్, ప్రవళిక, కొప్పుల రాజు, గొల్ల గణేష్ లాంటి ఎంతోమంది నిరుద్యోగుల ఆత్మహత్యలకు కారణమైన కేటీఆర్.. చంపినోడే సంతాప సభ పెట్టినట్లు ఇవాళ నిరుద్యోగ సభలు పెడుతున్నారని, ఇంటికో ఉద్యోగం ఇవ్వకుండా ఊరికో బెల్ట్ షాప్ ఇచ్చారని ఆరోపించారు.
మాట తప్పిన రేవంత్ రెడ్డి మార్క్ కాంగ్రెస్ పాలన :
ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం నిరుద్యోగులను నిలువునా వంచిస్తోందని కాసం వెంకటేశ్వర్లు విమర్శించారు. ఇదే సరూర్‌నగర్ స్టేడియంలో ప్రియాంక గాంధీ సాక్షిగా 100 రోజుల్లో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారని, మరి ఇప్పటివరకు ఒక్కటైనా కొత్త నోటిఫికేషన్ ఇచ్చారా అని ఛాలెంజ్ చేశారు. పాత ప్రభుత్వం వేసిన నోటిఫికేషన్లను భర్తీ చేసి తామేదో పొడిచేసినట్లు ప్రచారం చేసుకుంటున్నారని మండిపడ్డారు.
ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1000 కోట్లు ఇస్తామని చెప్పి మాటలు చెప్పారు తప్ప, అసెంబ్లీలో కనీసం బడ్జెట్ అయినా కేటాయించారా అని ప్రశ్నించారు. నెలకు రూ.4,000 నిరుద్యోగ భృతి, విద్యార్థినులకు ఎలక్ట్రిక్ స్కూటర్లు, రూ.10 లక్షల వడ్డీ లేని రుణాలు, పోలీస్, ఆర్టీసీ పిల్లల కోసం రెండు కొత్త యూనివర్సిటీలు, జాబ్ క్యాలెండర్ అంటూ సోనియా గాంధీ పేరుతో గ్యారంటీ పత్రాలపై సంతకాలు పెట్టి ఇచ్చిన హామీలు ఏమయ్యాయని నిలదీశారు. టీఎస్‌పీఎస్సీని ప్రక్షాళన చేయకుండా అవినీతిపరులను చైర్మన్లుగా కూర్చోబెట్టడమే కాంగ్రెస్ సంస్కరణా అని ఎద్దేవా చేశారు.
కేటీఆర్‌కు బహిరంగ సవాల్ :
కేంద్రంలో మోడీ ప్రభుత్వం ఎక్కడ రెండు కోట్ల ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కల్పించిందో తాము చార్మినార్ సాక్షిగా నిరూపించడానికి సిద్ధంగా ఉన్నామని, ఒకవేళ తాము నిరూపించలేకపోతే చార్మినార్ వరకు ముక్కు నేలకు రాస్తామని ఆయన సవాల్ విసిరారు. మరి కేటీఆర్ తాను ఇచ్చిన హామీల ప్రకారం తెలంగాణలో ఇంటికో ఉద్యోగం ఇచ్చినట్లు నిరూపించగలరా? నిరూపించలేకపోతే తెలంగాణ భవన్ వరకు ముక్కు నేలకు రాస్తారా అని సవాల్ చేశారు.
బీజేపీ ఎల్లప్పుడూ నిరుద్యోగుల పక్షాన, ప్రజల పక్షాన ఉంటుందని.. కాంగ్రెస్, బిఆర్ఎస్ ఆడుతున్న దొంగ నాటకాలను, బూటకపు సభలను, అబద్ధపు హామీలను యువత నమ్మవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. నిరుద్యోగుల హక్కుల సాధన కోసం భవిష్యత్తులో బీజేపీ యువమోర్చా ఆధ్వర్యంలో దీర్ఘకాలిక పోరాటాలు చేస్తామని, యువత అంతా బీజేపీకి మద్దతుగా నిలవాలని ఆయన పిలుపునిచ్చారు.
